సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శని, ఆదివారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో పరీక్ష కేంద్రం వివరాలు, సమయం పేర్కొంటారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి అడ్మిట్ కార్డు పొందవచ్చు. జేఈఈ పరీక్షకు తెలంగాణ నుంచి 2 లక్షల మంది హాజరుకానున్నారు.
రెండేళ్లుగా కోవిడ్ కారణంగా 21 పట్టణాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వీటిని 17కు తగ్గించారు. జేఈఈ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ఇది వరకే ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి.
ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. దీంతో పాటు మెయిన్స్ సిలబస్‌లోనూ మార్పు చేశారు. మేథ్స్‌లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)ను పూర్తిగా తొలగించారు. సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొంత భాగాన్ని మేథ్స్‌లో కొత్తగా చేర్చారు. ఫిజిక్స్‌లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్‌ను తొలగించారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో–ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్ తొలగించారు. వీటితో పలు అంశాలపై సిలబస్‌లో స్పష్టత ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment