జేఈఈ–మెయిన్ తొలిరోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ
సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు.. రెండు సెషన్లలోనూ ఇదే తీరు
మ్యాథ్స్‌లో సమాధానాలు ఇవ్వడానికి సరిపోని సమయం
కెమిస్ట్రీలో కొన్ని సులభం.. కొన్ని ఓ మోస్తరు క్లిష్టత
గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు
కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే..
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు దీనిని నిర్వహిస్తోంది.
మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా. 23, 24, 28, 29, 30 తేదీల్లో కూడా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.
300 మార్కులకు పరీక్ష
మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది.
ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.
తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.
ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్‌ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్‌ల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా..
ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు.
మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్‌సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు.
అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్‌టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment