
ఆత్మవిశ్వాసమే ఆయుధం
జేఈఈ మెయిన్స్‌లో 360కి 360 మార్కులు సాధించిన కల్పిత్
జేఈఈ మెయిన్స్‌లో 360/360 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కల్పిత్ వీర్వాల్ దళితబిడ్డ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వారి స్వస్థలం. తండ్రి ప్రభుత్వాసుపత్రిలో కాంపౌండర్ కాగా.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కల్పిత్ సాధారణ టీనేజ్ కుర్రాళ్లకు భిన్నం. ఎప్పుడు చూసినా తోటి పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తో సోషల్ మీడియాలో బిజీగా ఉంటే... కల్పిత్ మాత్రం చదువుపై దృష్టి సారించేవాడు. సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా సందేహం వచ్చినపుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో సమాధానం వెతికేవాడు. పాఠశాలలోనూ అతని హాజరు దాదాపు 100 శాతం ఉండేది.
సీబీఎస్‌ఈ చైర్మన్ ఆర్.కే.చతుర్వేది గురువారం ఉదయం స్వయంగా కల్పిత్‌కు ఫోన్‌చేసి టాపర్‌గా నిలిచిన (360/360 సాధించిన) విషయాన్ని తెలపడం గమనార్హం. ‘‘పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాడిని, ఏనాడూ క్లాసులు మిస్సయింది లేదు. సందేహాలు వస్తే టీచర్లను అడిగి తీర్చుకునేవాడిని. కాలేజీలో తరగతులు, కోచింగ్ క్లాసులు కాకుండా రోజుకు ఐదారు గంటలు చదివేవాడినని. ఫలితమే ఈ టాప్ ర్యాంకు. టాపర్‌గా నిలవడం సంతోషమే. అయితే నేను దీన్ని సాధారణ విషయంగానే తీసుకుంటున్నాను. అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాను..’’అని 17 ఏళ్ల కల్పిత్ పేర్కొన్నాడు. కెరీర్ గురించి ఇంకా నిర్ణయాలు తీసుకోకున్నా.. ముంబై ఐఐటీలో కంప్యూటర్ కోర్సు చదవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
చరిత్ర సృష్టించాడు: జేఈఈ మెయిన్స్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ 360/360 (నూటికి నూరుశాతం) మార్కులు సాధించలేదు. మెయిన్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. అంటే ఏదైనా ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే.. ఒక మార్కు కోత పడుతుంది. ఈ లెక్కన కల్పిత్ 360 మార్కులు సాధించాడంటే మొత్తం అన్ని ప్రశ్నలకూ కచ్చితంగా సరైన సమాధానాలు రాశాడన్నమాట.
ఇదీ నేపథ్యం..: కల్పిత్ తండ్రి పుష్కర్‌లాల్ వీర్వాల్ ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ ప్రభుత్వాస్పత్రిలో కాంపౌండర్. తల్లి పుష్ప ప్రభుత్వ టీచర్. అన్నయ్య ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు తన ఆహారం, ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకొనేవా రని, ఫలితంగా అనారోగ్యంతో స్కూలుకు వెళ్లని పరిస్థితి తనకు రాలేదని కల్పిత్ చెప్పాడు. చదువుతో పాటు క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టమని, మ్యూజిక్ వింటూ రిలాక్స్ అయ్యేవాడినని తెలిపాడు. కల్పిత్ తొమ్మిదో తరగతిలో ఆలిండియా జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచాడు. పదో తరగతిలో ఉండగా దాదాపు ఐదు లక్షల మంది రాసే ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్’లో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగానే.. కేంద్రం పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించేందుకు నిర్వహించే ‘కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)’లో టాపర్‌గా నిలిచాడు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్