
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్–2021 పేరిట ఫేక్ వెబ్‌సైట్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటి బారినపడి మోసపోతున్నారు. ఫేక్ వెబ్‌సైట్లను రూపొందించిన కేటుగాళ్లు.. వాటి ద్వారా వివిధ ఫీజుల పేరుతో డబ్బులు కొల్లగొడుతున్నారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పలు ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఎన్‌టీఏ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మోసపోయిన విద్యార్థులు ఆయా తప్పుడు వెబ్‌సైట్ల సమాచారం అందించారని పేర్కొంది.
జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేస్తున్నట్టు ఎన్‌టీఏ గుర్తించింది. ఈ వెబ్‌సైట్లో ఈ మెయిల్ అడ్రస్ ‘ఐఎన్‌ఎఫ్‌ఓఎట్‌దరేట్‌జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్’అని, మొబైల్ నంబర్ 93112 45307 అని పొందుపరిచారని, ఈ నంబర్ ద్వారా ఆయా విద్యార్థులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా కూడా విద్యార్థులను కేటుగాళ్లు మోసగిస్తున్నట్టు పేర్కొంది. ఇటువంటి యూఆర్‌ఎల్‌తో ఉండే వెబ్‌సైట్లు, ఈ–మెయిళ్లు, మొబైల్ నంబర్లతో ఎన్‌టీఏకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వెబ్‌సైట్లతో విద్యార్థులను మోసగిస్తున్న వారిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఇలాంటి వెబ్‌సైట్లపై స్థానిక పోలీస్‌స్టేషన్లలోనూ ఫిర్యాదు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించింది.
ఇదే అసలైంది..
‘జేఈఈఎంఏఐఎన్.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఐఎన్’ ద్వారా మాత్రమే ఎన్‌టీఏ అభ్యర్థుల నుంచి జేఈఈ మెయిన్–2021 ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరిలో నిర్వహించనున్న తొలి విడత పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. 24వ తేదీ రాత్రి 11.50 గం. వరకు ఆన్‌లైన్లో ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తుల్లో వివరాల సవరణకు 27 నుంచి 30 వరకు గడువిచ్చింది. అడ్మిట్ కార్డులను వచ్చే నెల రెండో వారంలో అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment