జేఈఈ, నీట్‌ వాయిదాకై సుప్రీంకు! | Seven non-BJP states agree to move Supreme Court against NEET and JEE | Sakshi
Sakshi News home page

జేఈఈ, నీట్‌ వాయిదాకై సుప్రీంకు!

Published Thu, Aug 27 2020 3:58 AM | Last Updated on Thu, Aug 27 2020 7:48 AM

Seven non-BJP states agree to move Supreme Court against NEET and JEE - Sakshi

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షలను కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ విషయమై ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. మరోవైపు డీఎంకే, ఆప్‌ సైతం ఈ డిమాండ్‌కు మద్దతు పలికాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం పలువురు ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పరీక్షల వాయిదాకు సుప్రీం తలుపుతట్టాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమ యింది. సమావేశంలో సీఎంలు అమరీందర్‌ సింగ్, అశోక్‌ గహ్లోత్, భూపేష్‌ భఘేల్, నారాయణ స్వామి, హేమంత్‌ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రేలు పరీక్షల వాయిదాపై సమష్టి వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంపై కేంద్రం అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. పరీక్షల వాయిదాపై మరోమారు కలిసికట్టుగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని మమతాబెనర్జీ ఇతర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సహా ఇతర సీఎంలతో కలిసి నడవాలని మమతను సోనియా కోరారు. మమత సూచనపై సానుకూలంగా స్పందించిన అమరీందర్‌ సింగ్, ఈ విషయమై న్యాయసలహా ఇవ్వాలని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ను కోరారు. అందరం కలిసికట్టుగా కోర్టును ఆశ్రయించి లక్షలాది విద్యార్ధులకు బాసటగా నిలుద్దామన్నారు. ఈ నెల 28న పరీక్షల వాయిదాపై వివిధ రాష్ట్రాలు, జిల్లాల రాజధానుల్లోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా #SpeakUpForStudentSafety పేరిట ఆన్‌లైన్‌ ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.  

జాప్యంతో మరింత అనర్థం
జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం చేయడం మెరిట్‌ విద్యార్ధుల కెరీర్, అకడమిక్‌ క్యాలెండర్‌పై దుష్ప్రభావం చూపుతుందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ రావు అభిప్రాయపడ్డారు. పరీక్షలు వాయిదా వేస్తే మొత్తం ఐఐటీ క్యాలెండర్‌పై ప్రభావం పడుతుందని, అప్పుడు ఒకేమారు రెండు బ్యాచులు నడపాల్సి ఉంటుందని చెప్పారు. దీనికితోడు లక్షలాది మంది విద్యార్థులు జీరో అకడమిక్‌ ఇయర్‌ బారిన పడతారన్నారు. ఇది మెరిట్‌ స్టూడెంట్స్‌ కెరీర్‌పై పెనుప్రభావం చూపుతుందని వివరించారు. ఇప్పటికే ఆరునెలలు వృథా అయ్యాయని, సెప్టెంబర్‌లో పరీక్షలు పెడితే కనీసం డిసెంబర్‌లో క్లాసులు ఆరంభించవచ్చని, ఇంకా వాయిదా వేయడం సబబుకాదని చెప్పారు.

14 లక్షల అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌
జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షలకు సంబంధించి దాదాపు 14 లక్షలకు పైగా అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. నీట్‌ పరీక్షకు అడ్మిట్‌కార్డులను బుధవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంచగా తొలి మూడుగంటల్లో 4 లక్షల కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, సాయంత్రానికి 6.84 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఎన్‌టీఏ అధికారి తెలిపారు. ఈ పరీక్షకు దాదాపు 16 లక్షల మంది రిజిస్టరయ్యారు. జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 8.58 లక్షల మంది అభ్యర్దుల్లో సుమారు 7.41 లక్షల మంది అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1–6 తేదీల్లో జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement