సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ సహా జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం నుంచి తుది విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని తెలిపింది.
నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పరీక్షను నిర్వహించిన ఎన్‌టీఏ అభ్యర్థుల పర్సంటైల్ కూడా ప్రకటించింది. రెండో విడత జరగబోయే పరీక్షకు దేశవ్యాప్తంగా 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఎన్‌టీఏ పేర్కొంది.
సిలబస్ కుదించకుండా చాయిస్
జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానాన్ని ఈ సంవత్సరం పూర్తిగా మార్చారు. గతంలో సెక్షన్–ఏ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బీ లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్‌టీఏ తెలిపింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్–2ఏ లోని సెక్షన్–బీ లో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది.
పేపర్–1, పేపర్–2ఏ, 2–బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. తుది విడత మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే ప్రాథమిక కీ విడుదల చేసేందుకు ఎన్‌టీఏ సన్నాహాలు చేస్తోంది. ఆ మర్నాడే పూర్తిస్థాయి పర్సంటైల్ వెలువడే వీలుంది. ఆగస్టు రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుంది. అదేనెల 28న పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.
టై బ్రేకర్‌లోనూ మార్పులు
ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్‌ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
మొదటి విడత రాసినవారికి సులువే
తొలి విడత జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్లకు ఈ పరీక్ష కొంత తేలికగానే ఉండే వీలుంది. జూన్‌లో జరిగిన పరీక్ష తాలూకూ ప్రశ్నపత్రం ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దాదాపు అవే చాప్టర్స్ వచ్చే వీలుంది. మేథ్స్‌లో సుదీర్ఘంగా ప్రశ్నలుంటే కంగారు పడకూడదు. నెగెటివ్ మార్కింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జవాబులివ్వాలి.
– ఎంఎన్ రావు (గణిత శాస్త్ర బోధకుడు)
పాత పేపర్లు తిరగేస్తే మంచిది
జూన్‌లో జరిగిన జేఈఈలో ఫిజిక్స్ పేపర్ మధ్యస్తంగానే ఉంది. ఈసారీ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉండే వీలుంది. ఇవే చాప్టర్స్‌ను చదువుకుని, పాత పేపర్లు ఒక్కసారి తిరగేస్తే తేలికగా సమాధానం ఇవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నెగెటివ్ మార్కుల బాధ నుంచి తప్పించుకోవచ్చు.
– జీకే రావు (ఫిజిక్స్ బోధకుడు)
Comments
Please login to add a commentAdd a comment