
జేఈఈ-మెయిన్స్‌లో మెరిసిన సౌదాగర్ అఫ్జల్
గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు తేజం మెరిసింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకు అఖిల భారతస్థాయిలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు దక్కింది. మంగళవారం రాత్రి సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించిన జేఈఈ మెయిన్స్(బీటెక్, బీఆర్క్) ర్యాంకుల్లో బీటెక్ విభాగం నుంచి భాష్యం విద్యాసంస్థల విద్యార్ధిని సౌదాగర్ అఫ్జల్ షామా జాతీయస్థాయిలో సత్తా చాటింది.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సౌదాగర్ అఫ్జల్ షామా తండ్రి సౌదాగర్ బాబావలి విజయవాడలో మెయిల్ ఎక్స్‌ప్రెస్ గార్డుగా ఉద్యోగం చేస్తుండగా, తల్లి నస్రీన్ సుల్తానా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎీస్జీటీగా పనిచేస్తున్నారు. పెద్ధ కొడుకు ఇమ్రాన్ ఢిల్లీలోని ఐఐటీలో చదివి ఢిల్లీలోనే ఉద్యోగం చేస్తుండగా, రెండో తనయుడు ఇర్ఫాన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సన్నద్ధమవుతున్నారు. కుమార్తె అఫ్జల్ షామా 8వ తరగతి వరకూ మంగళగిరిలోనే చదివి, 8వ తరగతిలో గుంటూరులోని భాష్యం పబ్లిక్‌స్కూల్లో చేరింది.
అనంతరం ఇంటర్మీడియెట్ భాష్యంలోనే చదివి సీనియర్ ఇంటర్లో 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి జాతీయస్థాయిలో 97వ ర్యాంకు సాధించి ఆ ర్యాంకు ఆధారంగా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారంతోనే తాను ఈస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించినట్లు అఫ్జల్ షామా చెబుతోంది.