రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. | BTech student jumps off college building in Sangareddy | Sakshi
Sakshi News home page

రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..

Published Sat, Jan 6 2024 11:17 AM | Last Updated on Sat, Jan 6 2024 11:23 AM

BTech student jumps off college building in Sangareddy - Sakshi

సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్‌పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్‌ కాలనీకి చెందిన రాహుల్‌, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది.

మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్‌ కలిశారని, క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement