విలేకర్ల సమావేశంలో ఎన్‌టీఏ వివరాలు వెల్లడిస్తున్న హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్
న్యూఢిల్లీ: తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రం భారీ సంస్కరణలకు తెర లేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్‌ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. నీట్, ఐఐటీ జేఈఈ–మెయిన్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో, జేఈఈ–మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు.
విద్యార్థి ఈ పరీక్షలను రెండుసార్లు రాసినా, ఉత్తమ స్కోరునే ప్రవేశాల సమయం లో పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి హాజరైనా సరిపోతుంది. కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)ల నిర్వహణ బాధ్యతను కూడా ఎన్‌టీఏకే అప్పగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకుని, పారదర్శకంగా, సమర్థంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకే కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు.
నెట్‌తో ప్రారంభం..
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే అర్హత సాధించాల్సిన నెట్ పరీక్షతో(డిసెంబర్‌లో) ఎన్‌టీఏ పని ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహణను ఎన్‌టీఏకు అప్పగించినా, అడ్వాన్స్‌డ్ మాత్రం యథావిధిగా ఐఐటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు సిలబస్, ఫీజు, భాష, ప్రశ్నలు అడిగే తీరు మారవని స్పష్టం చేశారు. టైం టేబుల్‌ను ఎప్పటికప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
4–5 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, పరీక్షకు ఎప్పుడు హాజరుకావాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి అధునాతన ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎన్‌టీఏ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఎంతో అనుకూలమని, ఆగస్టు మూడో వారం నుంచి విద్యార్థులు అధీకృత కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సాధన చేయొచ్చని జవదేకర్ తెలిపారు. పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఉచిత సాధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
ఎన్‌టీఏ అంటే...
దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏని ఏర్పాటుచేయాలని 2017–18 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దానికి కేంద్ర కేబినెట్ గతేడాది నవంబర్ 10న ఆమోదం తెలిపింది. ఎన్‌టీఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ప్రముఖ విద్యావేత్తను ఎన్‌టీఏకు డైరెక్టర్ జనరల్/సీఈఓగా మానవ వనరుల శాఖ నియమిస్తుంది. నిపుణులు, విద్యావేత్తల నేతృత్వంలోని 9 వేర్వేరు విభాగాలు సీఈఓకి సహాయకారిగా ఉంటాయి.యూజీసీ, ఎంసీఐ, ఐఐటీ సభ్యులతో పాలక మండలిని ఏర్పాటుచేస్తారు. కేంద్రం ఎన్‌టీఏకు తొలుత రూ.25 కోట్ల ఏకకాల గ్రాంటు కేటాయిస్తుంది. తరువాత ఆ సంస్థే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్‌టీఏకు డైరెక్టర్ జనరల్‌గా వినీత్ జోషి కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment