అవకాశాలున్నాయ్‌.. ఆందోళన వద్దు | Experts say that students do not need to be stressed or worried about JEE | Sakshi
Sakshi News home page

అవకాశాలున్నాయ్‌.. ఆందోళన వద్దు

Published Sat, Jan 30 2021 4:43 AM | Last Updated on Sat, Jan 30 2021 4:43 AM

Experts say that students do not need to be stressed or worried about JEE - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా ఐదారు నెలలు విద్యాసంస్థలు తెరుచుకోక ఆన్‌లైన్‌ బోధనతో తాపీగా సాగిన ఇంటర్మీడియట్‌ చదువులు ఇప్పుడు తరగతుల ప్రారంభంతో ఉరుకులు పరుగులు అందుకున్నాయి. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతోపాటు జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలు, పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్‌ ముగించి రివిజన్‌ చేయించే సన్నాహాల్లో పడ్డాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 

4 సార్లు పరీక్ష నిర్వహణతో ఎంతో వెసులుబాటు 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2021 పరీక్షలను 4 సార్లు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. కోవిడ్‌తో పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి జేఈఈని ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు నాలుగుసార్లు రాయవచ్చు. ఎన్నిసార్లు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది.  

13 భాషల్లో 384 ప్రశ్నపత్రాలు 
జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, ఉర్దూ, పంజాబీ, ఒడియా, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామీ భాషల్లో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నందున విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉండనుంది. ప్రాంతీయ భాషలో రాసేవారికి ఇంగ్లిష్‌ ప్రశ్నలు కూడా అందుబాటులో ఉంటాయి. జేఈఈలో బీఈ, బీటెక్‌లకు పేపర్‌–1, బీఆర్క్‌కు పేపర్‌–2ఏ, బీ, ప్లానింగ్‌కు పేపర్‌–2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 384 ప్రశ్నపత్రాలను ఎన్‌టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 4 లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేసింది. ఎన్‌టీఏ ఈసారి జేఈఈ సిలబస్, పరీక్షల ప్యాటర్న్‌లో కూడా మార్పులు చేసింది. పేపర్‌–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలో 30 చొప్పున ప్రశ్నలుంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement