నెలాఖరుకు ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ | APEAP set counseling by the end of the montH | Sakshi
Sakshi News home page

నెలాఖరుకు ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌

Published Tue, Oct 19 2021 4:10 AM | Last Updated on Tue, Oct 19 2021 4:10 AM

APEAP set counseling by the end of the montH - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్‌తో పాటు ఇతర సమగ్ర సమాచారాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఏపీఈఏపీ సెట్‌ అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని సోమవారం ఉన్నత విద్యామండలిలో నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్, సెట్స్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఈఏపీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ నిర్వహణపై సమావేశంలో చర్చించారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల(జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ.. జోసా) కౌన్సెలింగ్‌ 6 విడతల్లో జరుగనుండటం, చివరి విడత సీట్ల కేటాయింపు ఆయా సంస్థల్లో చేరికలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ప్రవేశాలను చేపట్టడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీఈఏపీ సెట్లో అగ్రస్థానంలో ఉన్న ర్యాంకర్లు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి వారికి సీట్లు కేటాయించి చేరికలు చేపడితే.. జేఈఈలో కూడా మెరిట్లో ఉన్న ఆ విద్యార్థులు ప్రస్తుత జోసా కౌన్సెలింగ్‌లో ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర సంస్థల్లో సీట్లు పొంది అటు వైపు వెళ్లే పరిస్థితి ఉంటుంది.

ఇక్కడి కాలేజీల్లో వారికి కేటాయించిన సీట్లు ఖాళీ అవ్వడం, వాటిని మళ్లీ తదుపరి కౌన్సెలింగ్‌లో కేటాయింపు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆయా సంస్థలకు ధ్రువపత్రాలిచ్చి, ఫీజులు చెల్లించి ఉంటే.. వాటిని తిరిగి పొందడం సమస్యగా మారుతుంది. జేఈఈ కౌన్సెలింగ్‌ తర్వాత ఏపీఈఏపీ కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఈ ఇబ్బందులు తప్పడంతో పాటు.. తదుపరి మెరిట్లో ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇలా అన్ని అంశాలపై ఏపీఈఏపీ సెట్‌ అడ్మిషన్ల కమిటీ దృష్టి సారించింది. జేఈఈ కౌన్సెలింగ్‌ అనంతరం నెలాఖరు నుంచి ఏపీఈఏపీ సెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ చేపట్టడం తదితర అంశాలపై లోతుగా చర్చించింది. ఈ నెల 21న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ నేతృత్వంలో మరోసారి సమావేశమై చర్చించి ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేస్తారు.  

కన్వీనర్‌ కోటాలోకి ప్రైవేట్‌ వర్సిటీల్లోని 35 శాతం సీట్లు
ఇదిలా ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలలోని 35 శాతం సీట్లు కూడా ప్రస్తుత ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ యూనివర్సిటీలు తమ కోర్సులకు ఫీజుల ఖరారుకు ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు అందించాయి. ఈ నెలాఖరులోగా కమిషన్‌ ఫీజులు ఖరారు చేసే అవకాశముందని, వాటిపై ప్రభుత్వం తుది ఉత్తర్వులు విడుదల చేశాక కౌన్సెలింగ్‌లో ఆ సీట్లను కూడా కన్వీనర్‌ కోటాలో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు కేటాయిస్తామని అడ్మిషన్ల కమిటీ అధికారి ఒకరు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement