
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు తామంతా గర్వపడుతున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని కొండా రేణు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు దక్కించుకుని సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఏపీకే చెందిన బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వనాథ్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్‌ఫణి సాయి 19వ ర్యాంకులతో రికార్డుల మోత మోగించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలో ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు లభించిన విషయం విధితమే.