ఎంసెట్ రద్దు?
- భారీగా ఇంజనీరింగ్ సీట్లున్నా చేరేవారు లేకపోవడంతో ప్రభుత్వ యోచన
- జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఇంజనీరింగ్ ప్రవేశాలు!..
- లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ
- ఇప్పటికే ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయిన మెడికల్, డెంటల్ కోర్సులు
- అగ్రికల్చర్, ఆయుష్ కోర్సులకు ప్రత్యేక పరీక్ష
- న్యాయపరమైన సమస్యలేమైనా ఉంటాయా అని పరిశీలన
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉండి, విద్యార్థులు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పటికే మెడికల్, డెంటల్ కోర్సులు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో మిగిలిన అగ్రికల్చర్, ఆయుష్ తదితర కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం నేరుగా జేఈఈ మెయిన్ ర్యాంకులతోనో, ఇంటర్ మెరిట్‌తోనో చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి.
తగ్గిపోతున్న విద్యార్థులు..
గత ఏడేళ్లలో వరుసగా ఐదేళ్లపాటు ఇంజనీరింగ్ సీట్లు పెరిగినా.. వాటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016-17లో మొత్తంగా 1,43,820 సీట్లు అందుబాటులో ఉంటే.. 80 వేల సీట్లు (60 శాతం) కూడా నిండలేదు. కన్వీనర్ కోటాలో 1,00,674 సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 54,172 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం మిగిలిపోయాయి. మేనేజ్‌మెంట్ కోటాలోనూ 43 వేలకు పైగా సీట్లుంటే భర్తీ అయిన సీట్లు 25 వేలకు మించలేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష అవసరమా? అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.
మెడికల్ కోర్సులకు ‘నీట్’
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలను ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్‌స టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు వేరుగా పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం ఇంటర్ మార్కులు లేదా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. అందువల్ల ఎంసెట్ లేకుండా ప్రవేశాలు చేపడితే న్యాయపరమైన సమస్యలేమైనా తలెత్తుతాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపట్టేందుకు గుజరాత్, మధ్య ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషా తదితర రాష్ట్రాలు ముందుకొచ్చాయి.
ఈ నేపథ్యంలో మన రాష్ట్రం కూడా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు చేపడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. లేకపోతే ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం ద్వారా వెయిటేజీ వంటి అంశాల్లో న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చన్న ఆలోచన కూడా ఉంది. ఈ అంశంపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో విస్రృ్తత సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా ఎంసెట్‌ను రద్దు చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీనిపై పూర్తిగా అధ్యయనం చేశాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.