నేడు తుది దశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు  | TS EAMCET: Over nineteen thousand engineering seats vacant | Sakshi
Sakshi News home page

నేడు తుది దశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 

Published Wed, Aug 9 2023 2:51 AM | Last Updated on Wed, Aug 9 2023 2:51 AM

TS EAMCET: Over nineteen thousand engineering seats vacant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్‌ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్‌ కోటా కింద 82,666 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 

17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ 

  • తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. 
  • ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరగనుంది. ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది.
  • స్పెషల్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి.  
  •  ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వే­రొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రా­న్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. 

యాజమాన్య కోటా సీట్ల పరిశీలన 
ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకులను, ఇంటర్‌లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్‌ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement