సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్–2023ను జూన్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2023 ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
ఫీజు చెల్లింపును మే 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేయాలి. అభ్యర్థులు https://jeeadv.ac.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. విదేశీ అభ్యర్థులు https:// jeeadv.ac.in/foreign. html ద్వారా రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంచుతారు.
పరీక్షలు కంప్యూటరాధారితంగా నిర్వహిస్తారు. సంబంధిత పోర్టల్‌లో మాక్ టెస్టులనూ అందుబాటులో ఉంచుతారు. జూన్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచి, 11, 12 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, రిజల్స్‌ను జూన్ 18న ప్రకటిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గౌహతి సంస్థ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐటీ గౌహతి గురువారం షెడ్యూల్‌ను, సవివర బ్రోచర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు రెండు పేపర్లకూ హాజరవడం తప్పనిసరని పేర్కొంది.
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులను (అన్ని కేటగిరీలకు సంబంధించిన వారిని) ఈ పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షలు రాసేందుకు వరుసగా రెండేళ్లు మాత్రమే అనుమతిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, తత్సమాన పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. 2021, అంతకు ముందు ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్సుడ్–2023కి దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లు, తిరువనంతపురం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్జీఐపీటీ), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) తదితర సంస్థలు కూడా ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి.
ఏపీలో పరీక్ష నిర్వహించే నగరాలు, పట్టణాలివే..
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment