AP JEE Counselling And Admisssions From October 16 - Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌

Published Tue, Sep 21 2021 4:53 AM | Last Updated on Tue, Sep 21 2021 10:51 AM

Counseling of JEE Admissions from October 16 - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీలు)లతో పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా–2021) ఇంతకు ముందే అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెలువడ్డాక అడ్మిషన్ల ప్రక్రియను జోసా ప్రారంభించనుంది. జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షల ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 11కి ముందే జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలవుతాయని భావించారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సెప్టెంబర్‌ 12 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆ పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ముందు నోటిఫికేషన్‌ ఇచ్చింది. జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఆలస్యం కావడంతో ఈ నెల 13కి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వాయిదా వేసింది. మెయిన్‌ ఫలితాలు 14న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చివరి తేదీని సెప్టెంబర్‌ 21 (నేడు) వరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ పొడిగించింది. 

అడ్వాన్స్‌డ్‌కు 2.50 లక్షల మంది..
జేఈఈ మెయిన్‌లో నిర్దేశిత కటాఫ్‌తో మెరిట్‌లో ఉన్న 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అక్టోబర్‌ 3న పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను అక్టోబర్‌ 5 సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నారు. దీనిపై 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 15న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేస్తారు. 16 నుంచి అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జీఐఎఫ్‌టీ)ల్లోని సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా అభ్యర్థులకు కేటాయించనుంది.

మెయిన్‌ పరీక్ష స్కామ్‌లో 20 మంది విద్యార్థులపై వేటు
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,39,008 మంది దరఖాస్తు చేశారు. చివరిదైన నాలుగో సెషన్‌లో 7 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ స్కోర్‌ సాధిస్తే దాన్నే తుది ఫలితంగా ఎన్‌టీఏ పరిగణించింది. అయితే చివరి సెషన్‌లో కొందరి స్కోర్‌ తొలి సెషన్‌ స్కోర్‌ కంటే అమాంతం పెరిగిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.  హరియాణాలోని సోనిపట్‌లో ఒక కేంద్రంలో పరీక్షలు రాసిన వారికి ఇలా అత్యధిక మార్కులు వచ్చాయి. అంతకు ముందు 38, 40కి మించి స్కోర్‌ రానివారు ఏకంగా 95 నుంచి 99 పాయింట్ల స్కోర్‌ సాధించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణ చేపట్టి ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ స్కామ్‌లో ఉన్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్‌ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement