కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం' | JEE Advanced-2020 exam ended peacefully | Sakshi
Sakshi News home page

కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం'

Published Mon, Sep 28 2020 4:40 AM | Last Updated on Mon, Sep 28 2020 5:19 AM

JEE Advanced-2020 exam ended peacefully - Sakshi

విశాఖ చినముషిడివాడలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్, మేథమేటిక్స్‌ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్‌ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల  కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను చేపడుతుంది. 

విభిన్న రీతుల్లో ప్రశ్నలు.. 
► ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీలలో వివిధ విభాగాల్లో విభిన్నమైన రీతుల్లో ప్రశ్నలున్నాయి. ఫిజిక్స్‌ ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు. 
► మేథమేటిక్స్‌ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని కోచింగ్‌ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. 
► కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్టీ ప్యాట్రన్‌ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు. 
► అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్‌ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారని గుంటూరుకు చెందిన అధ్యాపకుడొకరు చెప్పారు.  
► బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు. 
► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో ఒక్కో దానిలో 18 చొప్పున  మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు.  
► కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ  ఉన్నాయి.  
► మొత్తం మీద పేపర్‌–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 5న ఫలితాలు 
► ఫలితాలు అక్టోబర్‌ 5న వెల్లడవుతాయి. తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది. 
► ఈసారి 7కు బదులు ఆరు విడతల కౌన్సెలింగ్‌ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్‌ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. 
► ప్రాథమిక ఆన్సర్‌ కీలను త్వరలోనే ప్రకటించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 
► అధికారిక బులెటిన్‌ ప్రకార, అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్‌ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement