ఓ వైపు చికిత్స... మరో వైపు పరీక్ష
జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసిన విద్యార్థిని..
భీమారం: వరంగల్ నగర పరిధి ఎర్రగట్టు గుట్టలోని కిట్స్ కళాశాలలో ఆదివారం ఓ విద్యార్థిని చికిత్స పొందుతూనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసింది. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం చల్లకొండ గ్రామానికి చెందిన నన్నం మౌనిక ఆదివారం ఉదయం పరీక్ష రాయడానికి తండ్రి రాజేందర్‌తో కలిసి కిట్స్ కళాశాలకు వచ్చింది. అప్పటికే ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్ష కేంద్రంలోకి రాగానే కడుపునొప్పి తీవ్రం కావడంతో హెల్త్ సూపర్‌వైజర్ నీలకంఠం ప్రథమ చికిత్స చేసి, గ్లూకోస్ ఎక్కించారు.
ఉదయం 9 గంటల వరకు ప్రథమ చికిత్స జరిగింది. పరీక్ష ప్రారంభం కాగానే ఆమెను హాల్‌లోకి అనుమతించారు. గంట తర్వాత ఆమె అస్వస్థతకు గురికావడంతో నీలకంఠం మళ్లీ హాల్‌లోకి వెళ్లి ఆమెను పరీక్షించగా.. నొప్పి భరిస్తూనే పరీక్ష రాసి, ముగిశాక ఆస్పత్రికి వెళ్లింది.