అర్హత లేకుండా వైద్యం చేయొద్దు
సూచిక బోర్డుపై క్లినిక్, మెడికల్ సెంటర్, నర్సింగ్ హోం పేర్లు వాడొద్దు
ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే పెట్టుకోవాలి
ఆర్‌ఎంపీలకు స్పష్టం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్‌ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్‌ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది.
ఆర్‌ఎంపీలకు సూచనలివీ...
- ఆర్‌ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు.
- రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) రాయకూడదు.
- రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు.
- ఇన్–పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్‌లను నిర్వహించరాదు.
- అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్ చికిత్సలు చేయరాదు.
- రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment