
కుటుంబ సభ్యులను హతమార్చేందుకు యత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ-అమెరికన్ వైద్యుడు ధర్మేష్ పటేల్ కేసు కొత్త మలుపు తిరిగింది. కాలిఫోర్నియా మెడికల్ బోర్డ్ ఇటీవల పటేల్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. కుటుంబ సభ్యులను హత్యచేసేందుకు ప్రయత్నించాడంటూ పలు ఆరోపణలను అతను ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. నియంత్రణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం పటేల్ మానసిక సామర్థ్య లోపం, బలహీనత ఇతరులకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న దృష్ట్యా అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాగా ధర్మేష్ పటేల్(41) కాలిఫోర్నియాలోని పసాదేనాకు చెందిన వైద్యుడు. గత జనవరి 2న పటేల్ తన భార్య, తమ ఇద్దరు చిన్న పిల్లలతో సహా కారులో వెళుతుండగా, అది కొండపై నుండి 250 అడుగుల లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆ నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ధర్మేష్ భార్య నేహా పటేల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ కారు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. తన భర్త ఉద్దేశపూర్వకంగానే కారును శాన్ మాటియో కౌంటీలోని కొండపై నుండి కిందకు మళ్లించినట్లు ఆరోపించారు.
తనను, తన ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకే భర్త ఇలా చేశాడని ఆమె పేర్కొన్నారు. తన భర్త పటేల్ మానసిక స్థితి సరిగా లేదని ఆమె తెలిపారు. కాగా పటేల్ రేడియాలజీలో నిపుణుడు. ఫ్లోరిడా, ఒరెగాన్, కాలిఫోర్నియాలో చెల్లుబాటు అయ్యే మెడికల్ లైసెన్స్‌లు అతనికి ఉన్నాయి. పటేల్ 2008లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటర్న్‌షిప్, మయామిలో రెసిడెన్సీ కూడా పూర్తిచేశారు. దీనికితోడు లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా మెడికల్ సెంటర్‌లో ఫెలోషిప్ చేశారు.
ఇది కూడా చదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment