ఐఐటీల్లో కటాఫ్ ర్యాంకులు
♦ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన గువాహటి ఐఐటీ
♦ ఐఐటీల్లో ప్రవేశానికి 22న అడ్వాన్స్‌డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 22న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించేందుకు గువాహటి ఐఐటీ చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్-2లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల కోసం ఐఐటీ గువాహటి ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2015-16 విద్యా సంవత్సరంలో ఏయే ఐఐటీల్లో ఏయే కేటగిరీల్లో ఎంత ర్యాంకు వారికి సీట్లు లభించాయన్న వివరాలను జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
రిజర్వేషన్, కేటగిరీల వారీగా వివరాలను అందులో పొందుపరిచింది. వాటి ఆధారంగా ఎంత ర్యాంకు వస్తే సీటు లభిస్తుందన్న అంచనా వేసుకునేందుకు ఈ వివరాలు తోడ్పడతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఓపెన్ కోటాలో (కామన్ ర్యాంకు లిస్టు) 35 శాతం, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 31.5 శాతం, ఎస్సీల్లో 17.5 శాతం, ఎస్టీల్లో 17.5 శాతం, ఓపెన్ వికలాంగుల్లో, బీసీ నాన్ క్రీమీలేయర్ వికలాంగుల్లో, ఎస్సీ, ఎస్టీ వికలాంగుల్లో 17.5 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించింది.