JEE Advanced Result 2021: అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టారు | Telugu students Shine In JEE Advanced Exam Results | Sakshi
Sakshi News home page

JEE Advanced Result 2021: అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టారు

Published Sun, Oct 17 2021 1:12 AM | Last Updated on Sun, Oct 17 2021 8:30 AM

Telugu students Shine In JEE Advanced Exam Results - Sakshi

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంక్‌ దక్కించుకున్న రామస్వామి సంతోష్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ విడుదల చేసింది. ఇందులో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా టాప్‌–10లో ర్యాంక్‌ల్లో మూడు మనోళ్లు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి.. 4వ ర్యాంక్, పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి.. 5వ ర్యాంక్, మొదుళ్ల హృషికేష్‌రెడ్డి 10వ ర్యాంక్‌ దక్కించుకున్నారు.

వీరితో పాటు సవరం దివాకర్‌ సాయి 11వ ర్యాంక్, ఆనంద్‌ నరసింహన్‌ 17వ ర్యాంకు సాధించారు. రిజర్వ్‌ కేటగిరీల్లో నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరిలో రామస్వామి సంతోష్‌రెడ్డి(ఈడబ్ల్యూఎస్‌), నందిగామ నిఖిల్‌(ఎస్సీ), బిజిలి ప్రచోతన్‌ వర్మ(ఎస్టీ), గొర్లె కృష్ణచైతన్య(ఓబీసీ–పీడబ్ల్యూడీ) ఉన్నారు. జోన్లవారీగా ర్యాంక్‌లు చూస్తే... టాప్‌–100లో ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ హైదరాబాద్‌ (27), ఐఐటీ కాన్పూర్‌ (3), ఐఐటీ ఖరగ్‌పూర్‌ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి.

ఈసారి జేఈఈ ర్యాంక్‌ల్లో విద్యార్థినుల వెనుకబాటు కనిపించింది. జాతీయస్థాయిలో టాప్‌–100లో ఒక్కరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగు విద్యార్థినుల్లో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో పల్లె భావన 107వ ర్యాంక్‌తో అగ్రస్థానం దక్కించుకుంది.

41,862 మంది అర్హత... 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1,51,193 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా... 1,41,699 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,862 మంది అర్హత మార్కులు సాధించారు. అర్హత మార్కులు సాధించిన వారిలో 6,452 మంది విద్యార్థినులున్నారు. ఆలిండియా టాప్‌ ర్యాంక్‌ సాధించిన మృదుల్‌ అగర్వాల్‌కు 360 మార్కులకుగాను 348 మార్కు లు వచ్చాయి. ఇక, మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభిం చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ రా శారు. వీరిలో సుమారు 7 వేల మంది అర్హత మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 

టాప్‌ 500 ర్యాంక్‌ల్లో మనోళ్లు... 
ఐఐటీ హైదరాబాద్‌ పరిధిలో టాప్‌ 500 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు 135 మం ది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏడు జోన్లు ఉం డగా.. అందులో అత్యధికంగా ఐఐటీ బాం బే పరిధిలో 137 మంది ర్యాంక్‌లు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ–108, ఐఐటీ గౌహతి–9, ఐఐటీ కాన్పూర్‌–24, ఐఐటీ ఖరగ్‌పూర్‌–38, ఐఐటీ రూర్కీ–49 ర్యాంక్‌లు సాధించాయి. 

27న తొలి విడత సీట్లు... 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంక్‌లు వెలువడటంతో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్‌ సీట్‌ అలకేషన్‌–1 చేస్తారు. 24న మాక్‌ సీట్‌ అలకేషన్‌–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాలి. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. 

కంప్యూటర్‌ ఇంజనీర్‌ను అవుతా 
మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడమే నా లక్ష్యం.  – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి 

ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేస్తా.. 
మాది వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్‌ చదవా. ఇంటర్‌ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్‌బీఐలో మేనేజర్‌. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్‌ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా.      
– మొదుళ్ల హృషికేష్‌రెడ్డి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. 
సంస్థాన్‌ నారాయణపురం: జేఈ ఈ అడ్వాన్స్‌డ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాం క్, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంక్‌ సాధించింది. మెయిన్స్‌లో 4 ర్యాంక్‌ దక్కించుకుంది. భావన మాట్లాడుతూ.. అ«ధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అడ్వాన్స్‌డ్‌ లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించానని పేర్కొంది.  

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడతా.. 
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నందిగామ నిఖిల్‌ జాతీయస్థాయిలో ఎస్సీ కేటగిరీ లో మొదటిర్యాంక్‌ సాధించాడు. 360 మార్కులకుగాను 283 మా ర్కులు సాధించాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివి సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టాలన్నదే తన ఆశయమని నిఖిల్‌ తెలిపాడు. 

మిర్యాలగూడ విద్యార్థికి 19వ ర్యాంక్‌ 
మిర్యాలగూడ అర్బన్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కుర్ర శ్రీనివాస్‌ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్‌ సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను కేఎల్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు అభినందించారు.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement