జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ‘విభజన’ గందరగోళం
రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్ధారిస్తారా? కలిపే నిర్ణయిస్తారా?
వేర్వేరుగా నిర్ణయిస్తే విద్యార్థులకు ప్రయోజనమంటున్న నిపుణులు
స్పష్టత ఇవ్వాల్సింది సీబీఎస్‌ఈయే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో గందరగోళంలో చిక్కుకుపోయిన అంశాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ కూడా చేరుతోంది. ఈ పరీక్షకు అర్హత కోసం ఇంటర్ మార్కుల ఆధారంగా పొందాల్సిన టాప్-20 పర్సంటైల్‌ను ఒకే రాష్ట్రంగా పరిగణించి నిర్ధారిస్తారా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా నిర్ణయిస్తారా? అన్న అంశం చిక్కుముడిగా మారింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు దశల్లో సాగే ఈ పరీక్షలో.. మొదటి దశలో విద్యార్థులు మెయిన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అనంతరం నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్షకు.. మెయిన్స్ ఉత్తీర్ణతతో పాటు, ఆ రాష్ట్రంలో టాప్-20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అది కూడా మొత్తంగా 1,50,000 మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరుగనుంది. విద్యార్థులు ఇందులో అర్హత సాధించడంతోపాటు ఇంటర్ మార్కుల ఆధారంగా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. వారిని మే 25న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 19న వెల్లడికానున్నాయి. ఆ తరువాతే విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతారు.
రాష్ట్ర విభజనకు జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు, ప్రవేశాల ప్రక్రియ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటాయి.
ప్రస్తుత ఇంటర్‌బోర్డు పరిధిలో పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని పర్సం టైల్ నిర్ణయిస్తారా? వేర్వేరు రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకొని చేస్తారా? అనేదానిలో స్పష్టత లేదు.
దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శిని వివరణ కోరగా.. తాము ఫలితాల సీడీని మాత్రమే ఆయా విభాగాలకు అందజేస్తామని.. పర్సంటైల్ ఎలా నిర్ణయిస్తారనేది వారిష్టమేనని చెప్పారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.
2 రాష్ట్రాలకు వేర్వేరుగా పర్సంటైల్ నిర్ణయిస్తేనే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం ఉంటుం దని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కలిపి పర్సంటైల్ నిర్ణయిస్తే.. కొంత మంది విద్యార్థులకు నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు.
ఈ అంశంలో సీబీఎస్‌ఈ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఇంటర్ బోర్డు విభజన విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని వివరించారు.
టాప్ 20 పర్సంటైల్ ఎలా?
Published Tue, Mar 11 2014 2:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement