inter marks
-
ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?
మంచి ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మంచి మార్కులుంటేనే ఇల్లు అద్దెకు లభిస్తుంది. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ఈ సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన సంఘటనలో హౌస్ బ్రోకర్, హౌస్ ఓనర్, రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్ అకౌంట్ ద్వారా వైరల్ అయింది. ఇందులో 'మీ మార్కులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ బెంగళూరులో అద్దెకి ఉండాలంటే మాత్రమే నిర్ణయించేది మీ మార్కులే' అని శుభ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంతో బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ మా కజిన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని శుభ్ ట్వీట్ చేశారు. నిజానికి యోగేష్ అనే వ్యక్తి అద్దె ఇంటికోసం బ్రోకర్ ని సంప్రదించాడు. అతడి ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన హౌస్ ఓనర్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి ఫ్రొఫైల్స్ తో పాటు పదవతరగతి, ఇంటర్ మార్క్స్ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డుతో పాటు 150 నుంచి 200 పదాల్లో తన గురించి ఇంట్రో రాసి పంపాలని చెప్పాడు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) హౌస్ ఓనర్ చెప్పినవన్నీ యోగేష్ చేశారు. అయితే ఇంటర్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఇప్పటికి 15 లక్షల మందికి పైగా చూసారు. కొంతమంది రాబోయే రోజుల్లో బెంగళూరులో అద్దె ఇంటికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో అంటూ కామెంట్ చేసాడు. "Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d — Shubh (@kadaipaneeeer) April 27, 2023 ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44
ముదిగొండ: ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి. దీంతో ఎకనామిక్స్ జవాబు పత్రం రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్సైట్లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి👇 తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
డిగ్రీ ప్రవేశాలకు ‘45%’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వీరంతా ఇంటర్లో పాసైనా ప్రయోజనం లేకుండాపోతోంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లా వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా కనీస పాస్ మార్కులు 35 శాతం ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించినా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించలేదు. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది వేల మంది విద్యార్థులు నష్టపోగా, ఈసారి కూడా అదే ప్రమాదం పొంచి ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేస్తున్నప్పుడు కనీస మార్కులైన 45 శాతం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 45% కావాలంటున్న ప్రైవేటు సంస్థలు ఇంటర్ తరువాత చదివే న్యాయ, వ్యవసాయ, వైద్య,, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని దాదాపుగా అన్ని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆ నిబంధన తొలగించినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడం లేదు. చివరకు రాష్ట్రంలోనూ ఎంసెట్ విషయంలో సమస్య తప్పలేదు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మినహాయింపునిచ్చారు. కానీ న్యాయ, ఇతరత్రా వృత్తి విద్యా కోర్సుల్లో ఆ మినహాయింపు అమలు కాలేదు. దీంతో కనీస పాస్ మార్కులైన 35 శాతంతో ఉత్తీర్ణులైన ఓపెన్ ఇంటర్ విద్యార్థులు, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో 45 శాతం లోపు మార్కులు కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారు. ఇలా ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 30 వేల మంది, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మరో 15 వేల మంది నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ మొదలైన ఆందోళన.. ఈసారి ఇంటరీ్మడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. సెకండియర్ పరీక్షలు వాయిదా వేసింది. ఫస్టియర్ వారిని ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినా ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కరోనా వచ్చే రెండు మూడు నెలల్లో అదుపులోకి రాకపోతే ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అలాంటపుడు వారికి కనీస పాస్మార్కులే 35 శాతం ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 1.47 లక్షల మందిని, గతేడాది వార్షిక పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నా, పరీక్షలకు హాజరు కాని 27 వేల మందిని 35 శాతం మార్కులతోనే పాస్ చేసింది. ఈసారి కూడా 4.5 లక్షల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను, మరో 30 వేల మంది వరకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇచ్చి పాస్ చేసే పరిస్థితి. అలా చేస్తే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సెకండియర్‌లో కష్టపడాల్సిందే ఈసారి ఇంటర్మీడియట్ విద్యారి్థకి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 45 శాతం మార్కులు ఉండాలంటే ఆ విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 55 శాతానికి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా విద్యార్థులకు కనీస మార్కులైన 45 శాతం మార్కులు లభిస్తాయి. ఆ మేరకు రాకపోతే వచ్చే విద్యా సంవత్సరంలోనూ (2022–23) ప్రవేశాలకు విద్యార్థులు అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వారు రాష్ట్రంలో లక్షన్నర మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంటర్ ఒక సంవత్సరమే కావడంతో ద్వితీయ సంవత్సరంలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా వీరికి లేదు. దీంతో అందరికీ 45 శాతం మార్కులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 45 శాతం ఇస్తే చివరి విద్యార్థి వరకు మేలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనందున విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులను బోర్డు కేటాయించింది. ఓపెన్ ఇంటర్ వారికి 35 శాతం మార్కులను ఇచ్చింది. దీనితో ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకున్న విద్యార్థులకు నష్టం తప్పదు. ఇప్పుడు ప్రమోట్ చేసిన విద్యార్థులకు 45 శాతం ఇస్తే భవిష్యత్తులో వారికి నష్టం ఉండదు. 35 శాతంతో ఎలాగూ పాస్ చేస్తున్నప్పుడు 45 శాతం ఇస్తే పోయేదేమీ లేదు. పైగా విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ఇంటర్ మార్కులు, డిగ్రీ ప్రవేశాలు, తెలంగాణ, ప్రైవేటు కాలేజీలు -
విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలో కళ్యాణదుర్గం రోడ్డుకు సమీపంలోని పాపంపేటలో నివాసమున్న పద్మక్క కుమార్తె రాజేశ్వరి నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించారు. కాగా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. -
జేఈఈలో ఇంటర్ వెయిటేజీ రద్దు
►ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలు తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఉన్న వెయిటేజీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 %వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60% వెయిటేజీ ఇస్తున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించారు. అయితే ఇంటర్ వెయిటేజీతో ప్రయోజనం లేదని గతేడాది ఐఐటీల కౌన్సిల్ అభిప్రాయపడడంతో.. జేఈఈ పరీక్షలో సంస్కరణలపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంటర్ వెయిటేజీని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఉన్న 40% వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జేఈఈకి హాజరయ్యేందుకు ఇంటర్లో 75% మార్కులు, ఆపైన (ఎస్సీ, ఎస్టీలైతే 65%) ఉంటే సరిపోతుందని.. లేదా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతామని పేర్కొంది. గతంలోనే ఐఐటీల నిబంధనల్లో మార్పులు: ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఉండటంతోపాటు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన గతంలో ఉంది. టాప్-20 పర్సంటైల్‌లో ఉన్నా, ఇంటర్లో 75% మార్కులు వచ్చినా సరిపోతుందన్న నిబంధనను ఈ విద్యా సంవత్సరం నుంచి (2016-17) అమల్లోకి తెచ్చారు. తాజాగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కూడా ఇదే నిబంధనను అమల్లోకి తెచ్చారు. దీంతో ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, ఐఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒకే రకమైన నిబంధనలు అమలు కానున్నాయి. 2017లో ఉమ్మడి పరీక్ష లేనట్లే!: ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన ఇంటర్ వెయిటేజీ రద్దు, 75% మార్కులు వస్తే చాలన్న మార్పులు మినహా 2017-18 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పుల ఉత్తర్వులను జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించే సీబీఎస్ఈ చైర్మన్‌కు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించే ఐఐటీ సంయుక్త కమిటీకి పంపించారు. దీంతో ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలన్న నిబంధన 2017 నుంచి కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు. -
పాత పద్ధతిలోనే ఎంసెట్ ర్యాంకులు: కడియం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న విడుదల చేయనున్న ఎంసెట్ తుది ర్యాంకులను పాత పద్ధతిలోనే వెల్లడిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీనిచ్చాకే తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. టెన్త్ ఫలితాలను విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఏపీలో ఇంటర్ ఫలితాలు పెరిగినందున జేఈఈ మెయిన్ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానంలో ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎంసెట్‌ను కొనసాగించేదీ లేనిదీ తర్వాత ఆలోచిస్తామన్నారు. ‘ఎంసెట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంచుకునే విధానం ఉంది. ఎంసెట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. మరోవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కంటే ఎంసెట్‌లో అర్హత సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇంజనీరింగ్‌కు ఎంసెట్ అవసరమా అన్న వాదనలు ఉన్నాయి. దీనిపై తర్వాత ఆలోచిస్తాం. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ఆ తర్వాత వర్సిటీలకు వైస్ఛాన్స్లర్లను నియమిస్తాం’ అని చెప్పారు. -
ఇంటర్ మార్కులతో ఎంబీబీఎస్సా?
యాజమాన్య సీట్ల భర్తీ కుదరదు: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే ప్రయత్నాలను భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తిరస్కరించింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆధ్వర్యంలో పరీక్ష ద్వారానే ఎంపిక జరగాలని సూచించింది. ఈ మేరకు 2013లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు ఎంసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పోస్ట్ మెట్రిక్యులేషన్ పూర్తవగానే ఎంబీబీఎస్‌లో చేరడమనేది విరుద్ధమని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రవాస భారతీయులకు 15 శాతం కోటా మినహాయించి మిగతా 85 శాతం ప్రైవేటు సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేయనున్నట్లు వార్తలు రావటంపై ఎంసీఐ వర్గాలు స్పందించాయి. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై హెచ్చరిస్తూనే ఉన్నామని ఎంసీఐ అధికారి ఒకరు తెలిపారు. కచ్చితమైన విధివిధానాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రైవేట్ కళాశాలలే ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవాలని చెప్పామన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన ఎంసీఐ నిబంధనలు మారవని స్పష్టం చేశాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు సరికాదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. పరీక్షలు నిర్వహించుకోలేకపోవడం, సకాలంలో కౌన్సెలింగ్ చేయలేకపోవడమనేది విద్యార్థుల తప్పిదం కాదని, అది కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే అవుతుందని ఎంసీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై విధివిధానాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీ, అకడమిక్ క్యాలెండర్ తదితర విషయాలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక ఇవ్వనున్నట్టు భారతీయ వైద్యమండలి అధికారి చెప్పారు. -
పర్సంటైల్.. ఎంతో మేలు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : జేఈఈ మెయిన్స్, ఇంటర్ మార్కుల ఆధారంగా లెక్కించే పర్సంటైల్ విధానం మన విద్యార్థులకు మేలు చేస్తుందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. జేఈఈ మెయిన్స్ మార్కుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం లభించనుంది. ఈ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి జేఈఈ మార్కులతోపాటు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులూ కీలకం కానున్నాయి. జేఈఈలో సాధించిన మార్కులతోపాటు ఇంటర్లో సాధించిన మార్కులను కలిపి లెక్కించగా వచ్చినర్యాంక్ను పర్సంైటైల్ అంటారు. ఈ ర్యాంకు ఆధారంగా దేశంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీకి అనుబంధంగా ఉన్న డీమ్డ్ యూనివర్సిటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. పర్సంటైల్ లెక్కింపుపై గతేడాది వివాదాలు తలెత్తాయి. జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులను నిర్ణయించేందుకు రెండు విభాగాలుగా చేసి, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా పర్సంటైల్, నార్మలైజేషన్ పద్ధతుల ద్వారా ర్యాంకులు కేటాయిస్తారు. ఒక విద్యార్థికి జేఈఈ మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, అదే విద్యార్థికి ఇంటర్లో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈ రెండింటిని కలిపి నార్మలైజ్డ్ పర్సంటైల్ పద్ధతి ద్వారా ర్యాంకు కేటాయిస్తారు. గతేడాది ప్రవేశాల సమయంలో పర్సంటైల్ పద్ధతితో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి కూడా ఈ విధానంపై విద్యార్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. -
టాప్ 20 పర్సంటైల్ ఎలా?
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ‘విభజన’ గందరగోళం రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్ధారిస్తారా? కలిపే నిర్ణయిస్తారా? వేర్వేరుగా నిర్ణయిస్తే విద్యార్థులకు ప్రయోజనమంటున్న నిపుణులు స్పష్టత ఇవ్వాల్సింది సీబీఎస్ఈయే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో గందరగోళంలో చిక్కుకుపోయిన అంశాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ కూడా చేరుతోంది. ఈ పరీక్షకు అర్హత కోసం ఇంటర్ మార్కుల ఆధారంగా పొందాల్సిన టాప్-20 పర్సంటైల్‌ను ఒకే రాష్ట్రంగా పరిగణించి నిర్ధారిస్తారా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా నిర్ణయిస్తారా? అన్న అంశం చిక్కుముడిగా మారింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు దశల్లో సాగే ఈ పరీక్షలో.. మొదటి దశలో విద్యార్థులు మెయిన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అనంతరం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు.. మెయిన్స్ ఉత్తీర్ణతతో పాటు, ఆ రాష్ట్రంలో టాప్-20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అది కూడా మొత్తంగా 1,50,000 మందిని మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరుగనుంది. విద్యార్థులు ఇందులో అర్హత సాధించడంతోపాటు ఇంటర్ మార్కుల ఆధారంగా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. వారిని మే 25న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 19న వెల్లడికానున్నాయి. ఆ తరువాతే విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతారు. రాష్ట్ర విభజనకు జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ప్రవేశాల ప్రక్రియ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటాయి. ప్రస్తుత ఇంటర్‌బోర్డు పరిధిలో పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని పర్సం టైల్ నిర్ణయిస్తారా? వేర్వేరు రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకొని చేస్తారా? అనేదానిలో స్పష్టత లేదు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శిని వివరణ కోరగా.. తాము ఫలితాల సీడీని మాత్రమే ఆయా విభాగాలకు అందజేస్తామని.. పర్సంటైల్ ఎలా నిర్ణయిస్తారనేది వారిష్టమేనని చెప్పారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పర్సంటైల్ నిర్ణయిస్తేనే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం ఉంటుం దని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కలిపి పర్సంటైల్ నిర్ణయిస్తే.. కొంత మంది విద్యార్థులకు నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఈ అంశంలో సీబీఎస్ఈ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఇంటర్ బోర్డు విభజన విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని వివరించారు.