ఇదేం గోలయ్యా బాబూ...??
-
అనంత, చిత్తూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు హడావుడి
-
600 పైగా వాటర్ ట్యాంకర్లు కావాలంటూ రవాణా శాఖపై ఒత్తిడి
-
గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 200 ట్యాంకర్లు ఏర్పాటు
-
తలలు పట్టుకుంటోన్న రవాణా శాఖ అధికారులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులు వాటర్ ట్యాంకర్ల వేటలో పడ్డారు. ట్యాంకర్లు ఎక్కడ కనిపించినా వదిలి పెట్టడం లేదు. వాటిని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపుతున్నారు. మూడ్రోజుల పాటు సాగునీటి సరఫరా కోసం పురమాయిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి 200, నెల్లూరు జిల్లా నుంచి 50 ట్యాంకర్లు అనంత, చిత్తూరు జిల్లాల బాట పట్టాయి. మొత్తం 600 ట్యాంకర్లు అవసరమని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక కోస్తా జిల్లాల్లోని ఆర్టీవోలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ ఖరీఫ్ సీజనులో అనంతపురం,చిత్తూరు జిల్లాల రైతులు అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా అనంతలో 6 లక్షలు, చిత్తూరులో 1.20 లక్షల హెక్టార్ల పంట ఎండుముఖం పట్టింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని కరువు నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో రెయిన్‌గన్స్ పంపిణీ చేసిన ప్రభుత్వం వాటి ద్వారా పంటలను కాపాడతామనీ, ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని చెబుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఈ రెండు జిల్లాల్లో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. రెండు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తే ఆయా నీటితో వేరుశెనగ పంటను కాపాడవచ్చని సర్కారు అభిప్రాయపడుతోంది. ఇందుకోసం కోస్తా జిల్లాల నుంచి వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు సరఫరా చేయించాలని సీఎం చంద్రబాబు రవాణా శాఖను ఆదేశించారు. దీంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రవాణా శాఖ అధికారులు సోమవారం నుంచి నీళ్ల ట్యాంకర్ల వేటలో పడ్డారు. పట్టణాల్లో నీళ్లు సరఫరా చేసే ప్రయివేటు ట్యాంకర్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా సంస్థలు, పరిశ్రమలకు చెందిన వాటర్ ట్యాంకర్ల వివరాలను తెప్పించుకుని ఆయా ట్యాంకర్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రోజువారీ బాడుగ కింద రూ.1200 ఇవ్వడమే కాకుండా లారీలకు డీజిల్ కొట్టించే బాధ్యతను ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్, మైనర్ ఇరిగేషన్, ఉద్యాన వన శాఖలకు అప్పగించారు. బుధవారం సాయంత్రానికి 600 ట్యాంకర్లను సమకూర్చాలని రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడంతో వివిధ జిల్లాల్లోని ఆర్టీవోలు, ఎంవీఐలు ట్యాంకర్ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. గురువారం నుంచి నీటి సరఫరా జరగాలన్నది ఆలోచన. అదృష్టం బాగుండి బుధవారం నుంచి రెండు జిల్లాల్లోనూ వర్షాలు పడితే రైతుల పాటు తామూ బతికిపోతామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.
రెండు జిల్లాలకూ మంత్రులు ...
ఇదిలా ఉండగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రభుత్వం మంత్రులను ఇన్‌చార్జులుగా వేసింది. వేరుశెనగ పంట ఎండకుండా సకాలంలో సాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దీంతో చిత్తూరు జిల్లాకు మంత్రులు పల్లె ర ఘునాథరెడ్డి, నారాయణ, బొజ్జల, శిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తిలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.