Rain Gun
-
చంద్రబాబు పిట్టలదొర.. ఈ శివన్నే సాక్ష్యం: వైఎస్ జగన్
నల్లమడ (అనంతపురం): పిట్టలదొర తరహాలో చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తూ.. అబద్ధాలు చెప్తూ.. బూటకపు హామీలు ఇస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కరువుసీమ అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్ పేరిట సాగునీరు అందిస్తానంటూ చంద్రబాబు చేసిన ఆర్భాటం వెనుక ఉన్న అసలు బండారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. అబద్ధాలను చెప్తూ ప్రజలను ఏమార్చే పిట్టలదొర కథను ఉదాహరణగా చెప్తూ.. చంద్రబాబు రెయిన్‌గన్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు రెయిన్‌గన్ ఆర్భాటానికి నిలువునా మోసపోయిన పేదరైతు శివన్న కథను నల్లమడ ప్రజలకు వినిపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ చేరుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అశేష ప్రజాసమూహం నల్లమడలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికింది. భగవాన్ సత్యసాయిబాబా పుట్టిన పుట్టపర్తి ప్రాంతం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. నిజమైన పిట్టలదొర ఎవరు? 'చంద్రబాబు పాలన పూర్తయి నాలుగేళ్లు అవుతోంది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మనమంతా చూశాం. ఈ నాలుగేళ్ల పాలనలో మేం సంతోషంగా ఉన్నామని మీలో ఎవరైనా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలరా? లేదు. చంద్రబాబు పాలన గురించి ఓ చిన్న కథ, పిట్టలదొర కథ చెప్తాను. అనగనగా ఓ పిట్టలదొర.. ఆ పిట్టల దొర అంటే ఉన్నదిలేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కథలు చెప్పేవాడు. ప్రజలను వీడు ఎంతగొప్పగా మోసం చేశాడు.. వీడు పిట్టలదొరరా బాబు అనేలా చేస్తాడు. మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే గుండువారిపల్లెలో శివన్న అనే రైతన్న ఉంటాడు. ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది. అప్పులు చేసి.. రూ. 90వేలు ఖర్చుచేసి ఆయన తన పొలంలో వేరుశనగ పంట వేశాడు. అసలే అనంతపురంజిల్లాలో కరువు.. అందులోనూ చంద్రబాబు సీఎం అయ్యారు.. ఇంకా ఈ ఏడు వర్షాలు పడలేదు. దీంతో సాగునీరు లేక అల్లాడుతున్న శివన్న వద్దకు పిట్టలదొర వచ్చి.. దేవుడ్ని నమ్ముకోకు.. నన్ను నమ్ముకో నీ పొలంలోకి నీళ్లు తెప్పిస్తానని చెప్పాడు. పిట్టలదొర మాటలు ఆ శివన్న నమ్మాడు. ఆ పిట్టలదొర తనకు 9 ఏళ్లు అనుభముందని చెప్పాడు. నా దగ్గర గన్ ఉంది. అది రెయిన్ గన్.. దానితో వర్షాలు తెప్పిస్తానని పిట్టల దొర చెప్పాడు. శివన్న సరే సర్ అన్నాడు. పిట్టలదొర వస్తున్నాడని.. అధికారులు శివన్న పొలంలో పెద్ద గుంత తవ్వి.. టార్పన్ కవర్‌ను ఆ గుంతలో పరిచి.. ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చి.. అందులో పోశారు. ఈ నీళ్లతో పొలంలో రెయిన్ గన్ ఏర్పాటుచేశారు. పిట్టల దొర వచ్చి నీళ్లు చిమ్ముతున్న రెయిన్ గన్ దగ్గర మీడియాకు ఫోజులు ఇచ్చాడు. రెయిన్‌గన్ ఆన్ చేయగానే అలాఅలా నీళ్లు వచ్చాయి. శివన్న ఏదో సంతోషపడ్డాడు. ఆ తర్వాత పిట్టలదొర వెళ్లిపోయాడు. శివన్నకు భోజనానికి వెళ్లాడు. ఇలా శివన్న భోజనానికి వెళ్లాడో లేదో గంట సమయంలోనే టార్పన్ కవర్ చుట్టుకొని.. రెయిన్ గన్ను ఎత్తుకొని అధికారులు వెళ్లిపోయారు' అంటూ ఆనాడు రెయిన్ గన్‌తో చంద్రబాబు శివన్న అనే రైతుపొలంలో హడావిడి చేసిన ఫొటోలను ప్రజలకు చూపించారు. నాడు రెయిన్గన్లతో కరువుసీమ అనంతపురానికి నీళ్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు బండారాన్ని బయటపెడుతూ.. ఆ తతంగానికి నష్టపోయిన రైతు శివన్న బహిరంగ సభ వేదికపైకి పిలిచి ప్రజలకు చూపించారు. చంద్రబాబు రెయిన్గన్లతో హడావిడి చేసి వెళ్లిపోవడంతో శివన్న వేరుశనగ పంట చేతికి రాలేదని, ఆ ఏడు కేవలం అరబస్తా మాత్రమే పంట పండిందని తెలిపారు. దీంతో వ్యవసాయం కోసం తీసుకొచ్చిన రూ. 90వేల అప్పు తీర్చేందుకు శివన్న ఊరూరు తిరిగి వొడియాలు, బూరెలు అమ్ముకుంటున్నారని రైతు దీనగాథను వివరించారు. శివన్న భార్య కూడా అప్పు తీర్చేందుకు హోటల్లో పనిచేస్తోందని తెలిపారు. ఇంత దారుణంగా చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల్ని క్షమిస్తే.. ఈసారి చిన్న చిన్న అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరేమోనని, ఇంకా పెద్ద మోసాలకు దిగుతారని, ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ కారు కొనిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగలరని మండిపడ్డారు. 'ఇలా ప్రజలను మోసం చేసే వ్యక్తులు పోవాలి. బంగాళాఖాతంలో కలిసిపోవాలి. ఇందుకు జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ వస్తాయి' అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి రావాలని అన్నారు. ఈసారి చంద్రబాబుకు ఓటు వేయకండి: శివన్న ఈ సందర్భంగా నష్టపోయిన రైతు శివన్న మాట్లాడుతూ.. చంద్రబాబు తమను లేనిపోని ఇబ్బంది పెట్టారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేయకండి అని అన్నారు. మనకు జగన్మోహన్రెడ్డి ఉన్నారు చాలు.. ఆయననే గెలిపిద్దామని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు తాను ఓటేశానని, బ్యాంకుల్లో రుణాలు కూడా మాఫీ కాలేదని తెలిపారు. పుట్టపర్తిని చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ పుట్టపర్తికి చాలా హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారు పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు పుట్టపర్తిలో విమానాల నిర్వహణ మరమ్మతుల కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు పుట్టపర్తిని ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. బుక్కపట్నం-కొత్త చెరువును కలుపుతూ రిగ్రోడ్ వేస్తామన్నారు బుక్కపట్నంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుచేస్తామన్నారు ఇన్ని హామీల్లో ఒక్కటీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు హామీలిచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు మాట ఇస్తే నిలబడాలి.. లేకుంటే రాజీనామా చేయాలి బీసీలపై ప్రేమ అంటే ఇది..! మీ అందరి ఆశిర్వాదంతో మన ప్రభుత్వం వచ్చాక నవరత్నాల పథకాన్ని అమలుచేస్తాం నవరత్నాల్లో మార్పులు చేర్పులు.. సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి ఎన్నికలు రాగానే బీసీలపై చంద్రబాబు ఎక్కడాలేని ప్రేమను కురిపిస్తారు బీసీలపై ప్రేమంటే ఇస్ట్రీ పెట్టేలు, కత్తెరలు ఇవ్వడమేనా? బీసీలపై నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పి చూపిస్తా నాన్నగారు, దివంగత నేత వైఎస్సార్ పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు ఆ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు నాన్నగారి పరిపాలనలో పేదలు చదువుల కోసం ఇబ్బందిపడకూడదని ఒక్క అడుగు ముందుకేశారు నవరత్నాల్లో భాగంగా చదువుకున్న పిల్లల కోసం నేను రెండు అడుగులు ముందుకువేస్తాను మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం మీ పిల్లలను దగ్గరుండి నేను ఇంజినీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివిస్తాను అంతేకాకుండా మెస్‌చార్జీలు, హాస్టల్ చార్జీల కోసం ప్రతి పిల్లాడికి ఏటా రూ. 20వేల చొప్పున ఇస్తాం తల్లులు తమ పిల్లలను చదివించాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి పిల్లలను బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు ఇస్తాను ఆ చిట్టిపిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి.. ఇది బీసీల మీద ప్రేమ అంటే.. ఇదే పేదవాడి కోసం నవరత్నాల్లో భాగంగా నాలుగు అడుగులు ముందుకువేశాం ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పెన్షన్ రూ. 2వేలకు పెంచుతాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కాచెల్లెమ్మలకు పెన్షన్ రూ. 2వేలు ఇవ్వడం కాదు.. పెన్షన్ వయస్సు 45 ఏళ్లకు తగ్గిస్తాం -
బహుళ ప్రయోజనాల సుభాని స్ప్రేయర్
► అరగంటకు ఎకరం పండ్ల తోటలో పిచికారీ ► 10 అడుగుల ఎత్తున్న చెట్లపైకి, జీవామృతం, ద్రావణాలు పిచికారీ ► చెట్ల పాదుల్లో నీరు పోసేందుకు.. ► రెయిన్ గన్లా తుంపర సేద్యానికి కూడా వాడుకోచ్చు ట్రాక్టర్ హయ్యర్ బ్లాస్ట్, ఎయిర్ బ్లాస్ట్ స్ప్రేయర్లతో జీవామృతం, కషాయాలు, పురుగు మందులు పిచికారీ చేయడంలో పండ్ల తోటల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహుళ ప్రయెజనాలను నెరవేర్చే స్ప్రేయర్‌ను రూపొందించడం ద్వారా వీరి ఇబ్బందులకు రైతు శాస్త్రవేత్త సయ్యద్ సుభానీ చక్కని పరిష్కారం చూపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవవారిపాలెం ఆయన స్వగ్రామం. డ్రైవరొక్కడు చాలు.. కూలీల అవసరం లేదు దానిమ్మ నిమ్మ, బత్తాయి వంటి పండ్ల తోటల్లో సులభంగా శ్రమ లేకుండా.. కూలీల అవసరం లేకుండా.. డ్రైవర్ ఒక్కడే మందులు పిచికారీ చేసుకునేలా రూపొందించారు. ఒక్కసారి ట్యాంకరులో మందు ద్రావణం కలిపి స్ప్రేయర్‌ను స్టార్ట్ చేస్తే చాలు.. ట్యాంకరు వెనుక భాగంలో అమర్చిన గన్నులే నిర్దేశిత దిశలో తగు మోతాదులో మందును పిచికారీ చేస్తాయి. ఈ స్ప్రేయర్ ద్వారా పండ్లతోటలు, మెట్లపైర్లలో సులభంగా జీవామృతాన్ని లేదా మందు ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. పండ్లతోటలు.. మెట్ట పైర్లు..పిచికారీ సులభం.. ప్రకృతి సేద్యం చేసే రైతులు జీవామృతం, కషాయాలను ఈ యంత్రం సహాయంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా పిచికారీ చేయవచ్చు. ఒక మనిషి ఈ యంత్రం సహాయంతో రోజుకు 50 ఎకరాల మెట్ట పైర్ల పైన.. 30 ఎకరాల పండ్ల తోటల్లోను సునాయాసంగా మందులు పిచికారీ చేసుకోవచ్చని సుభానీ తెలిపారు. సంప్రదాయ స్ప్రేయర్ల కన్నా అధిక పీడనంతో మందును పిచికారీ చేయటం వల్ల కొమ్మలు, ఆకులు పూర్తిగా తడుస్తాయి. 10 అడుగుల ఎత్తు వరకు మందులను పిచికారీ చేసి చెట్ల తలకొమ్మలను మందు ద్రావణంతో పూర్తిగా తడపగల సామర్థ్యం దీని సొంతం. కావాలంటే దీన్ని 20 అడుగుల వరకు పెంచుకోవచ్చు. పత్తి, మిర్చి, శనగ, కంది వంటి మెట్ట పైర్లలోనూ మందు ద్రావణాన్ని లేదా జీవామృతాన్ని పిచికారీ చేయవచ్చు. ముఖ్యంగా పండ్లతోటల రైతులకు కూలీల అవసరం, శ్రమ తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది. సకాలంలో పిచికారీ పూర్తవుతుంది. 600 పీఎస్ఐ సామర్థ్యం గల కంప్రెషర్, పుల్లీలు, బెల్ట్‌లు, డెలివరీ పైపులు, నాజిళ్లూ, షూటర్ నాజిళ్లు, జింక్పైపులు, యాంగ్లేర్లు, చానల్స్‌ను ఈ పిచికారీ యంత్రం తయారీలో వాడారు. కంప్రెషర్‌ను ట్రాక్టర్ ఇంజిన్ పీటీఓ సాఫ్ట్‌కు పుల్లీల ద్వారా అనుసంధానం చేస్తారు. నీటి ట్యాంకరుకు ఇరువైపులా 15 అడుగుల పొడవైన రెక్కలను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే కంప్రెషర్ కూడా పనిచేయటం మొదలవుతుంది. మూడు పిస్టన్లు ట్యాంకు నుంచి మందు ద్రావణాన్ని తోడి ప్రెజర్‌తో మందును పిచికారీ చేసే రెక్కల్లోకి సరఫరా చేస్తాయి. ట్యాంకులో ఉండే ఫుట్‌బాల్‌కు పైనా కింద షూటర్ నాజిళ్లు ఉంటాయి. ఇవి నలకలు రాకుండా నిరోధిస్తాయి. ట్యాంకరుకు ఇరుపక్కల ఉండే రెక్కలు నాజిళ్ల ద్వారా చెట్లపైకి మందును పిచికారీ చేస్తాయి. పుల్లీలను మార్చటం ద్వారా కంప్రెషర్ మందు పిచికారీ చేసే వేగాన్ని పెంచటం తగ్గించటం చేయవచ్చు. పండ్ల తోటల్లో చెట్ల వరుసల మధ్య ఉండే దూరం పొలానికి పొలానికి మారుతుంది. అలాంటపుపడు చెట్ల మధ్య దూరాన్ని బట్టి ట్రాక్టరుకు ఇరువైపులా ఉండే రెక్కలకు పంపు నాజిళ్లను అమర్చుకుంటే చాలు. దానికి తగినట్టుగా కంప్రెషర్ వేగాన్ని తగ్గించటం పెంచటం చేయవచ్చు. పండ్ల తోటల్లో ట్రాక్టరుకు రెండు వైపులా కలిపి 36 అడుగుల దూరం వరకు, మెట్ట పైర్లలో 50 అడుగుల దూరం వరకు పిచికారీ చేస్తుంది. చెట్ల ఎత్తును బట్టి రెక్కలకు నాజిళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న మొక్కలకు ఒక నాజిల్ వాడితే పదడుగులు పెరిగిన చెట్టుకు నాలుగు నాజిళ్లు వాడతారు. దీని తయారీకి రూ. 75 వేలు ఖర్చయినట్టు సుభానీ తెలిపారు. రెయిన్ గన్లా ఉపయోగించవచ్చు. నాజిళ్లు మార్చుకుంటే చాలు తుంపర సేద్యం చేయవచ్చు. నీరు తుంపర్లుగా పొలం అంతటా సమానంగా పడుతుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పందివానిపల్లె గ్రామానికి చెందిన బత్తుల నారాయణ రెడ్డి 50 ఎకరాల పండ్ల తోటలో ఈ స్ప్రేయర్‌ను విజయవంతంగా వాడి చూశారు.– షేక్ నూరుద్దీన్, సాక్షి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా పండ్ల తోట రైతుల కోసమే తయారు చేశా... ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న స్ప్రేయర్లు పండ్లతోటలకు అంతగా సూటు గా లేవు. పల్లె సృజన సౌజన్యంతో గతంలో నేను తయారు చేసిన స్ప్రేయర్‌ను అభివృద్ధి చేసి దీన్ని రూపొందించాను. రైతులకు శ్రమ తగ్గాలి.. ఖర్చు ఆదా కావాలనే ఈ స్ప్రేయర్‌ను తయారు చేశా. ఎల్తైన చెట్లు ఉన్నా సులభంగా పిచికారీ చేసుకోవచ్చు. కావాలంటే 10 రోజుల్లో తయారు చేసి ఇస్తా. – సుభాని (98486 13687), రైతు శాస్త్రవేత్త, నాగభైరవ వారిపాలెం, గుంటూరు జిల్లా సుభానీ స్ప్రేయర్ బాగా పనిచేస్తోంది.. 50 ఎకరాల్లో నిమ్మ, దానిమ్మ, బత్తాయి తోటలను పెంచుతున్నా. అంతరపంటగా కంది వేశా. సుభానీ యంత్రంతోనే జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నాం. బాగా పనిచేస్తోంది. 30 మంది కూలీలు చేసే పని ఇద్దరితో పూర్తవుతోంది. కంప్రెషర్ ఫోర్సుగా పనిచేస్తుండటం వల్ల కొమ్మలు పూర్తిగా తడిసి చీడపీడలను దరిచేరనివ్వడంలేదు. – బత్తుల నారాయణరెడ్డి (94923 20316), రైతు, పందివానిపల్లె, ప్రకాశం జిల్లా -
10 రోజుల పనికి 103.50 కోట్లా?!
⇒ రెయిన్ గన్లపై రైతు సంఘాల నేతల విస్మయం ⇒ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం సాక్షి, అమరావతి: గత ఖరీఫ్ సీజన్లో కేవలం 10 రోజులు వినియోగించిన రెయిన్ గన్ల నిర్వహణకు రూ.103.50 కోట్లు ఖర్చు చేశారా? రెయిన్ గన్లకు నిర్వహణ నిజంగా అంత ఖర్చవుతుందా? అని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు నివ్వెరపోతున్నారు. ఒక్క ఎకరం పంటనైనా కాపాడలేకపోయిన ఈ చినుకు తుపాకుల పేరిట ఖర్చు చేసిన సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందోనని చర్చించుకుంటున్నారు. ‘చినుకు తుపాకుల చిల్లర ఖర్చు రూ.103.50 కోట్లు’ పేరిట ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ( ‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు ) ఇంత అన్యాయమా? ప్రజాధ నాన్ని మింగేస్తారా? అంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్ గన్ల కొనుగోలుకు రూ.163 కోట్లు కాగా, నిర్వహణ, ఇతరత్రా అవసరాలకు రూ. 103.50 కోట్లు వెచ్చించడం ఏమిటని మండిపడ్డారు. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెయిన్గన్ల కొనుగోలు, నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేసి, రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏపీ రైతు సంఘం నేత రామారావు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. -
‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు
-
‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు
రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో స్వాహాకు రంగం సిద్ధం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడా ఒక్క ఎకరం పంటను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం.. రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో తాజాగా మరో భారీ దోపిడీకి తెర తీసింది. రెయిన్గన్ల నిర్వహణ, రబ్బర్లు, ట్యూబుల కోసమంటూ రూ.103 కోట్లు విడుదల చేసింది. చిన్న చిన్న పరికరాల మరమ్మతుల పేరుతో భారీగా నిధులు గత ఏడాది జూలై 9న రాసిన లేఖకు ఈ ఏడాది జనవరి 31న ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర విపత్తుల విభాగం ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేసింది. సూక్ష్మ నీటి పారుదల పరికరాల సంస్థల సాంకేతిక సిబ్బందికి, స్పింకర్లు, ఆయిల్ ఇంజన్లు, పంపులు, గుర్తించిన కరవు పీడిత గ్రామాల్లోని పొలాలకు నీటిని తోలే ట్రక్కుల నిర్వహణకు ఈ నిధులు వాడుకోవచ్చు. ట్రాక్టర్ల అద్దె, పైపులకు అవసరమైన రబ్బర్ వాషర్లు, క్లాంపులు, తాళ్లు, మోకులు, పని ముట్లు, ఇంజిన్ ఆయిల్, తదితర వస్తువుల కోసం కూడా ఈ నిధులు వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ రెయిన్గన్లు, పరికరాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయో వ్యవసాయ శాఖ అధికారులకే సరిగా తెలియదు. అలాంటి వాటి నిర్వహణకు ఈ నిధులు కేటాయించడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి ప్రజా ధనాన్ని దోచిపెట్టడానికేనని రైతు సంఘాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ఏ గన్ను ఎక్కడుందో తెలీదు.. గత ఖరీఫ్‌లో కరువులో చిక్కుకున్న పది లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 13,650కి పైగా రెయిన్గన్లను రూ.163 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇచ్చింది. కొనుక్కుంటా మన్న రైతులకు సబ్సిడీపై సరఫరా చేసింది. ఎకరాకు నీటిని పిచికారి చేసేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని ఖరారు చేసింది. ఇందులో సగం అంటే రూ.1,500లను సబ్సిడీగా ప్రకటించింది. ఇప్పుడవి ఎక్కడు న్నాయో తెలియదు. సీఎం చేసిన హడా వుడి తర్వాత రెయిన్గన్ల ఆచూకీ లేకుండా పోయింది. కొన్ని రైతుల వద్ద ఉండి పోగా, మ రికొన్ని వ్యవసాయ శాఖ వద్ద.. ఇంకొన్ని గిడ్డం గుల్లో, ఆ శాఖ కార్యా లయాల్లో పోగుపడ్డాయి. ఏ గన్ను ఎక్కడుందో తెలియ కుండా సిబ్బందిని నియమిస్తామనడం విడ్డూరం. ఎవరి కోసం.. ఎందు కోసమంటే.. కోర్టు కేసులు, పరస్పర ఆరోపణలు, లోకాయుక్తాలో ఫిర్యాదుల అనంతరం అప్పట్లో రెయిన్గన్లు తెరపైకి వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండరు ఏపీకి చెందిన ఓ సంస్థకు దక్కాల్సి ఉండగా సూక్ష్మ నీటి పారుదల విభాగంలో కీలక వ్యక్తి చక్రం తిప్పి మహారాష్ట్ర సంస్థకు దక్కేలా చేశారు. దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందని, భారీగా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత.. ఆ రెయిన్గన్ల వల్ల ఎక్కడా పంట చేతికందకపోయినా.. నిర్వహణ ఖర్చంటూ ఇపుడు మైక్రో ఇరిగేషన్ సంస్థలకు ఈ నిధుల్ని కట్టబెట్టి తద్వారా ముడుపులు తీసుకునేందుకేనని రైతులు ఆరోపిస్తున్నారు. కింది నుంచి పై వరకు అందరూ అంతో ఇంతో పంచుకునేందుకే ఈ నిధుల మంజూరు అని ఓ ప్రముఖ రైతు నాయకుడు పేర్కొన్నారు. 4 లక్షల ఎకరాల్ని కాపాడారా? రెయిన్ గన్లతో 4 లక్షల ఎకరాల్లో పంటల్ని.. ప్రత్యేకించి వేరుశనగను కాపాడామని సాక్షాత్తు సీఎం చెబితే వంతపాడడంలో ముందుండే రాష్ట్ర సమాచార మంత్రి 7 లక్షల ఎకరాలంటూ పల్లవి అందుకున్నారు. ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్ని లక్షల ట్రాక్టర్లు కావాలో, ఎన్ని లక్షల ట్యాంకర్లు కావాలో, ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు కావాలో కూడా యోచించకుండా అర్థం పర్థం లేని వాదనలు చేశారు. పూటకో మాట చెప్పి ప్రజల్ని తప్పు దోవ పట్టించినా ఎక్కడా ఒక్క ఎకరం కాపాడలేకపోయారన్నది నగ్నసత్యం. రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టు 28 నాటికి 309 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్షలాది ఎకరాల్లో మెట్ట పంటలు వాడుముఖం పట్టాయి. దీనిపై అంతకు ముందెన్నడూ దృష్టి సారించని ముఖ్యమంత్రి.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా పంట ఎండిన తర్వాత రెయిన్‌గన్‌లంటూ హడావుడి చేశారు. కరవును జయించామని ప్రకటించారు. వేరుశనగ పూత.. పిందె దశలో ఉన్నప్పుడు ఎకరానికి కనీసం 25 మిల్లీమీటర్ల మేర వర్షం (నీళ్లు) కావాలి. జూలై 15 నుంచి ఆగస్టు 28 వరకు వర్షం లేక కాయ ఊరడం ఆగిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. రెయిన్గన్లతో రక్షిత తడి కల్పించినా అది 5 – 6 మిల్లీమీటర్లకు మించలేదు. 20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడివో చెప్పండి? ఎకరంలో పంటను కాపాడేందుకు నాలుగు పదున్లు అసవరమవుతాయి. ఒక పదును అంటే 25 మిల్లీమీటర్ల వర్షం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్లతో ఇచ్చిన నీళ్లు కేవలం 5 మిల్లీమీటర్ల మేర మాత్రమే. అంటే కళ్లాపి జల్లినట్టు అన్నమాట. వాస్తవానికి ఇది అసంబద్ధం. ఈ నీళ్లతో పంటను బతికించుకోలేం. ఈ లెక్కన 5 మిల్లీమీటర్ల వర్షం మేర నీళ్లివ్వాలనుకుంటే ఒక్కో ఎకరాకు 25 వేల లీటర్లు కావాలి. ఒక ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా అత్యధికంగా 5 వేల లీటర్లు సరఫరా చేశారనుకున్నా 25 వేల లీటర్ల సరఫరాకు 5 ట్రాక్టర్లు కావాలి. అదే లక్ష ఎకరాలకైతే 5 లక్షల ట్రాక్టర్లు కావాలి. ముఖ్యమంత్రి చెప్పినట్టు 4 లక్షల ఎకరా>లకైతే 20 లక్షల ట్రాక్టర్లు కావాలి. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్రాక్టర్లు ఉండవు. అయినా ముఖ్యమంత్రి మాత్రం 4 లక్షల ఎకరాలకు రెయిన్గన్ల ద్వారా నీరిచ్చి కరవును జయించామని పదే పదే టముకు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కల ప్రకారం లక్ష ఎకరాలకైతే 250 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఆ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా వానలు పడలేదు. ఏ చేలోనూ పంట కుంటలు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చినట్టు? ఈ నీటి సరఫరాకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు వారం నుంచి పది రోజులు. ఈ గడువు లోపల 20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ఎవరికీ అంతుబట్టని విషయం. మరో మాటలో చెప్పాలంటే కరువును జయించామంటున్న ముఖ్యమంత్రికే తెలియాలి. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రెయిన్గన్లతో కాపాడామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా నిర్వహణకు రూ.103.5 కోట్లను విడుదల చేశారంటే దీని వెనకున్న నిగూడార్ధం ముడుపులేనని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. రెయిన్ గన్స్ అంటే... బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే ఇదీనూ. నిజానికిదో సూక్ష్మ నీటి పారుదల పరికరం. తక్కువ నీటిని ఎక్కువ ప్రాంతానికి విరజిమ్మవచ్చు. ఆరడుల ఎత్తున ఓ రెయిన్‌గన్‌ను అమర్చితే దాని చుట్టుపక్కల సుమారు 45 మీటర్ల వరకు నీటిని విరజిమ్మ వచ్చు. 45 సెంట్ల పొలాన్ని తడిపేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. 5 హెచ్‌పీ ఇంజిన్ కావాలి. ఇందుకోసం ప్రతి రెయిన్ గన్‌కు ఒకటి చొప్పున రూ.23 కోట్లతో ఆయిల్ ఇంజన్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీళ్లున్న చోటు నుంచి రెయిన్ గన్ వరకు సరఫరా చేసేందుకు హెచ్‌డీపీఇ, క్యూపీసీ పైపులను ఉపయోగిస్తారు. ఏ పంటకు నీళ్లు చల్లుతున్నామనే దాన్ని అనుసరించి రెయిన్ గన్ స్టాండ్లను అమర్చుతారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి వంటి వాటికైతే రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లు అమర్చి వాటికి రెయిన్గన్లను పెట్టి నీటిని పిచికారి చేస్తారు. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. ‘తుక్కు’గన్లు! రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రెయిన్గన్లు, డీజిల్ ఇంజన్లు, స్ప్రింక్లర్ సెట్లు, పైపులను అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన రైతులు తుక్కు కింద అమ్మేసుకుంటున్నారు. గత ఖరీఫ్ లో వాటిని దక్కించుకున్న వారిలో 80 మంది టీడీపీ సానుభూతిపరుతే. మళ్లీ వ్యవసాయ శాఖకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ‘ప్రభుత్వం మాది.. ఆ పరిక రాలు కూడా మావే’ అని తేల్చి చెబుతు న్నారు. మరికొందరు పాత పరికరాలను అప్పగిస్తున్నారు. అప్పట్లో సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా పరికరాలను సరఫరా చేయడంతో రికార్డుల్లో వివరాలు సరిగా లేవు. మాకు పరికరాలు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయా? మా సంతకాలు చూపించండి? అని రైతులు ప్రశ్నిస్తుండ టంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. కొన్నిచోట్ల రెయిన్ గన్లు చోరీకి గురయ్యాయి. పంపిణీ చేసిన పరికరా లకు లెక్క తేలలేదని.. సగం పరికరాలు అందవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి పరికరాలను తిరిగి రాబట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసా య శాఖల అధికారులతో కమిటీని నియమించినా ఫలితం లేదు. ‘ప్రభుత్వం రైతులకు సరఫరా చేసిన రెయిన్గన్లను వారి నుంచి తిరిగి సేకరించే బాధ్యత ఆయా జిల్లా అధికారులదే. ఏ జిల్లాల్లో ఎంతవరకు రైతుల నుంచి రాబట్టారో మాకు తెలియదు. రూ.86 కోట్ల విలువైన రెయిన్గన్లను మేము సరఫరా చేశాం’ అని ఏపీ ఎంఐపీ ఓఎస్డీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
శివన్న పంటా పోయింది!
అమడగూరు : స్వయాన సీఎం చంద్రబాటు రక్షకతడులను ప్రారంభించిన రైతు శివన్న పొలంలోనే వేరుశనగ పంట ఎత్తిపోయింది. చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిది ఎకరాల పంట పూర్తిగా పోయిందని, పెట్టుబడి కోసం చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలోనని వాపోతున్నాడు. అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో ఆగస్టు 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లతో రక్షకతడులు ప్రారంభించారు. ఇక తన పంట పండినట్టేనని రైతు ఆశపడ్డాడు. పంటను శనివారం ట్రాక్టరుతో దున్నించేశాడు. దిగుబడి ఏమాత్రమూ లేదు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ శేషూరెడ్డి తదితరులు రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా అతను గోడు వెళ్లబోసుకున్నాడు. ‘టీడీపీ నాయకులు వచ్చి నీ పొలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.. రక్షకతడుల ద్వారా పంటను కాపాడతారని చెప్పారు. సీఎం వచ్చిన రోజు కాసేపు రెయిన్గన్లు బిగించారు. ఆయన వెళ్లగానే అదే రోజు సాయంత్రం ఫారంపాండ్లోని కవరు, రెయిన్గన్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. పంటంతా ఎండిపోయింద’ని వాపోయాడు. సీఎం వచ్చి రెయిన్గన్లను ప్రారంభించిన పంట పొలమే పూర్తిగా ఎండిపోతే..ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షక తడుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారే కానీ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశికళ, నాయకులు సుధాకర్‌రాజు, రషీద్, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, అంజినప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘గన్’ రైతుది..ట్రిగ్గర్ టీడీపీది!
కర్షకుల ‘కన్నీటితడి’ – టీడీపీ నాయకుల చేతుల్లో రెయిన్గన్లు – వారు చెప్పిన వారికే రక్షక తడులు – ఆదోని వ్యవసాయ డివిజన్లో అధికార పార్టీ నేతల హవా – సీఎం వచ్చి వెళ్లిన తరువాత పెరిగిన ‘పచ్చ’పాతం రెయిన్ గన్..వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ఆదుకునేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తున్న పరికరం. ఎండుతున్న పైర్లకు ప్రాణం పోయాల్సింది పోయి.. అధికార పార్టీ నాయకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రాజకీయమే లక్ష్యంగా ఈ గన్ పేలుతోంది. పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సిన రక్షకతడి కార్యక్రమం పక్కదోవ పట్టి కర్షకుల ‘కన్నీటితడి’ గా మారింది. ఆదోని వ్యవసాయ డివిజన్ ఇందుకు కేంద్రమైంది. కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావం వల్ల ఎండుతున్న పంటలకు రక్షక నీటి తడులు ఇచ్చే కార్యక్రమం ఆదోని వ్యవసాయ డివిజన్లో అధికార తెలుగుదేశం నాయకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ కార్యక్రమం కింద మంజూరు చేసిన రెయిన్గన్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సెక్రటరీలు, వీఆర్ఓల ఆధీనంలో ఉండాలి. అయితే టీడీపీ నాయకుల చేతుల్లో ండిపోయాయి. అధికార పార్టీ నాయకులు సూచిస్తున్న రైతుల పంటలకు అధికారులు నీటితడులు ఇస్తున్నారు.‘‘ మా నియోజకవర్గానికి 400 రెయిన్గన్లు, 400 స్ప్రింక్లర్లు , 100 ఆయిల్ ఇంజన్లు సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ మా ఆధీనంలోనే ఉంచాలి’’అని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్‌్జల నుంచి జిల్లా అధికారులు ఫోన్లు వస్తున్నాయంటే వాస్తవం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హడావుడి సరే..అమలేది? జిల్లాలో కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో ఆగస్టు నెలలో వర్షాలు లేవు. కర్నూలు డివిజన్లో కొంతవరకు కొన్ని మండలాల్లో వర్షాలు కురిసినా ఆదోని డివిజన్లో చినుకు జాడ లేదు. సెప్టెంబర్ నెలలో పది రోజులు గడచినా వాన ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికే వేరుశనగ పూర్తి దెబ్బతినగా.. మిగిలిన పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 రోజులుగా రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా.. నిజంగా వర్షాభావం వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడటంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏం జరిగిందంటే.. ఎండు పంటటన్నింటికీ నీటితడులు ఇచ్చే విధంగా ముందుగా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. కొన్ని పంటలకు నీటి తడులు కూడా ఇచ్చారు. అయితే ఆలూరు మండలం అరికెర గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి వెళ్లిన తర్వాత నీటి తడులు ఇవ్వడంలో మార్పు వచ్చింది. రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు టీడీపీ నాయకుల ఆధీనంలోకి వెళ్లాయి. గ్రామాలవారీగా ఏయే రైతుల పంటలకు నీటితడులు ఇవ్వాలో అధికార పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్లో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. దేశం కార్యకర్తలకు చెందిన పంటలకు మాత్రమే నీటి తడులు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కరువులో ‘పచ్చ ’పాతం చూపవద్దని గట్టిగా హెచ్చరించారు. అనుకూరులకే.. ‘‘ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన రైతుల భూములకే నీటితడులు ఇస్తున్నారు.. ఇది నిజమే కదా’’ అంటూ ఆదోని, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో పంటలకు రక్షక తడులు ఇచ్చే విధులు నిర్వహిస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయి... రెయిన్గన్ల ద్వారా నీటి తడులు ఇవ్వండని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. టీడీపీ నాయకులు సూచిస్తున్న కార్యకర్తల పంటలను ఆగమేఘాల మీద తడిపేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు దేశం కార్యకర్తల పంటలను కాపాడేందుకే రెయిన్గన్లు తీసుకొచ్చారా అని కొందరు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పంట ఎండుతున్నా పట్టించుకోవడం లేదు నాది మూడెకరాల చేను. మెట్ట భూమి. ఈ ఏడు ఉల్లి నాటిన. చేను పక్కనే పెద్ద వంక ఉంది. పంట ఎండుతోంది.. రెయిన్గన్లను ఇవ్వాలని అధికారులను అడిగితే.. కొంతమంది టీడీపీ నాయకులు వాటిని తీసుకెళ్లనారని, వారిని అడిగి తీసుకోవాలని చెబుతున్నారు. వారి దగ్గరికి మేము వెళ్లి అడిగితే బాగుండదు సార్.. అని పదేపదే ప్రాధేయపడుతున్నా పట్టించుకోవడం లేదు. – సూరి, పెద్దహోతూరు రైతు మా దృష్టికి రాలేదు రెయిన్గన్లు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నాయకులు చేతుల్లో ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా ఇలా జరుగుతున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – జేడీఏ ఉమామహేశ్వరమ్మ రెయిన్గన్ల పంపిణీ ఇలా.. జిల్లాకు మంజూరైనవి: 4,000 చిత్తూరు జిల్లాకు తరలినవి: 1000 ఆదోని డివిజన్‌కు కేటాయించినవి: 1450 మిగతావి కర్నూలు డివిజన్‌కు కేటాయించారు జిల్లాకు కేటాయించిన రెయిన్గన్లు చాలా వరకు టీడీపీ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. -
ఇక పంట రక్షణులుగా రెయిన్గన్లు
పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడి సాక్షి, అమరావతి: రెయిన్గన్లకు పంట రక్షణులని పేరు పెట్టిన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పంట సంజీవిని, పంట రక్షణులను సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కరువు వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు పడిపోకుండా చూడాలని సూచించారు. నీరు-ప్రగతిపై మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. -
ఎండిన పంటకు నీరిచ్చాం: బాబు
సాక్షి,అనంతపురం/ఆలూరు: సీమలో వర్షాభావం వల్ల ఎండిన పంటకు నీరందించామని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగు రోజుల అనంతపురం జిల్లా పర్యటనను శుక్రవారం ఆయన ముగించారు. చివరిరోజు ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. ప్రపంచంలోనే మొట్టమొదటగా రెయిన్గన్లను ప్రవేశపెట్టి సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. జీవితం లో చాలా కార్యక్రమాలు చేశానని, కానీ రెయిన్గన్లను ప్రవేశపెట్టిన ఆనందం తనకు చాలా తృప్తినిచ్చిందన్నారు. విహారయాత్రకు సీఎం.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు గాను శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు.అక్కడ నుంచి కజికిస్తాన్‌లోని అస్తానా పర్యటనకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో తాను పుణే వెళుతున్నానని కొందరికి చెప్పినట్టు సమాచారం. మరికొందరు మాత్రం గోవా పర్యటనకు వెళ్లారని అంటున్నారు. బాబు పర్యటనల విషయాన్ని ఈ మధ్యకాలంలో రహస్యంగా ఉంచుతున్నారు. ఉన్మాదులుగా మారుతున్నారు ‘సాక్షి’ ప్రతినిధిపై సీఎం అసహనం సాక్షిప్రతినిధి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసుపై ప్రశ్నించినందుకు ‘సాక్షి’ ప్రతిని ధిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాల కోసం మీరూ ఉన్మాదులుగా మారుతున్నారంటూ విలేకరిపై అసహనం ప్రదర్శించారు.బాబు గురువారం రాత్రి అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసులో హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని, విచారణ ఎదుర్కోవచ్చు కదా అని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆయన ‘‘ఏయ్ కూర్చోవయ్యా. వాళ్లు ఉన్మాదులు. మిమ్మల్నీ అలాగే మారుస్తున్నారు. సాక్షి పత్రికలో ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. ఆ పత్రికలో జీతాల కోసం మీరు కూడా ఉన్మాదులుగా మారుతున్నారు. వాళ్లకు బుద్ధి లేకపోయినా (మేనేజ్మెంట్) మీకైనా తెలివి ఉండాలి కదా? నన్ను చెప్పుతో కొట్టాలని అన్నారు. నా అనుభవం అంత వయసు లేదు. మొదటిసారి ఎమ్మెల్యే. ఇంకా నేర్చుకోవాలి. అలాంటిది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గోరంట్లలో వేరుశెనగ రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వేరుశెనగ రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్ వ్యవస్థ పదేళ్లుగా అందుబాటులో ఉన్నా తానే సృష్టించినట్లు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పంట ఎండిపోయే వరకూ బాబు స్పందించలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. 18వేల ఎకరాల్లోనే పంట ఎండిపోయినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. నెలరోజులుగా ఎండిన పంటలను కాపాడటంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి రైతులు నిండా మునిగిపోయారని వైఎస్ జగన్ విమర్శించారు. రెయిన్ గన్ లతో పంటను కాపాడామని ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పంటను ఎలాగూ కాపాడలేకపోయిన ప్రభుత్వం కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
రెయిన్గన్ల వాడకంలో విద్యార్థుల సాయం
కర్నూలు(అగ్రిల్చర్): రెయిన్గన్ల వాడకంలో ప్రభుత్వం విద్యార్థుల సాయం తీసుకుంటోంది. బుధవారం మూడు ప్రత్యేక బస్సుల్లో రాయలసీమ యూనివర్సిటీ, ఉస్మానియా కళాశాల, బి.క్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 150 మంది ఆలూరు, ఆస్పరి, పత్తికొండ మండలాలకు తరలివెళ్లారు. ముందుగా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వీరికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యూ వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల రెయిన్గన్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి రెయిన్గన్లతో పంటలు తడుపుకోవడంలో రైతులకు సహకరించాలన్నారు. రాయలసీమ వర్సిటీ రిజిష్ట్రార్ అమర్నాథ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, ప్రణాళిక శాఖ సహాయ సంచాలకులు రమణప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం గోలయ్యా బాబూ...??
అనంత, చిత్తూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు హడావుడి 600 పైగా వాటర్ ట్యాంకర్లు కావాలంటూ రవాణా శాఖపై ఒత్తిడి గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 200 ట్యాంకర్లు ఏర్పాటు తలలు పట్టుకుంటోన్న రవాణా శాఖ అధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులు వాటర్ ట్యాంకర్ల వేటలో పడ్డారు. ట్యాంకర్లు ఎక్కడ కనిపించినా వదిలి పెట్టడం లేదు. వాటిని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపుతున్నారు. మూడ్రోజుల పాటు సాగునీటి సరఫరా కోసం పురమాయిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి 200, నెల్లూరు జిల్లా నుంచి 50 ట్యాంకర్లు అనంత, చిత్తూరు జిల్లాల బాట పట్టాయి. మొత్తం 600 ట్యాంకర్లు అవసరమని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక కోస్తా జిల్లాల్లోని ఆర్టీవోలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజనులో అనంతపురం,చిత్తూరు జిల్లాల రైతులు అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా అనంతలో 6 లక్షలు, చిత్తూరులో 1.20 లక్షల హెక్టార్ల పంట ఎండుముఖం పట్టింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని కరువు నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో రెయిన్‌గన్స్ పంపిణీ చేసిన ప్రభుత్వం వాటి ద్వారా పంటలను కాపాడతామనీ, ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని చెబుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఈ రెండు జిల్లాల్లో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. రెండు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తే ఆయా నీటితో వేరుశెనగ పంటను కాపాడవచ్చని సర్కారు అభిప్రాయపడుతోంది. ఇందుకోసం కోస్తా జిల్లాల నుంచి వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు సరఫరా చేయించాలని సీఎం చంద్రబాబు రవాణా శాఖను ఆదేశించారు. దీంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రవాణా శాఖ అధికారులు సోమవారం నుంచి నీళ్ల ట్యాంకర్ల వేటలో పడ్డారు. పట్టణాల్లో నీళ్లు సరఫరా చేసే ప్రయివేటు ట్యాంకర్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా సంస్థలు, పరిశ్రమలకు చెందిన వాటర్ ట్యాంకర్ల వివరాలను తెప్పించుకుని ఆయా ట్యాంకర్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రోజువారీ బాడుగ కింద రూ.1200 ఇవ్వడమే కాకుండా లారీలకు డీజిల్ కొట్టించే బాధ్యతను ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్, మైనర్ ఇరిగేషన్, ఉద్యాన వన శాఖలకు అప్పగించారు. బుధవారం సాయంత్రానికి 600 ట్యాంకర్లను సమకూర్చాలని రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడంతో వివిధ జిల్లాల్లోని ఆర్టీవోలు, ఎంవీఐలు ట్యాంకర్ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. గురువారం నుంచి నీటి సరఫరా జరగాలన్నది ఆలోచన. అదృష్టం బాగుండి బుధవారం నుంచి రెండు జిల్లాల్లోనూ వర్షాలు పడితే రైతుల పాటు తామూ బతికిపోతామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రెండు జిల్లాలకూ మంత్రులు ... ఇదిలా ఉండగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రభుత్వం మంత్రులను ఇన్చార్జులుగా వేసింది. వేరుశెనగ పంట ఎండకుండా సకాలంలో సాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దీంతో చిత్తూరు జిల్లాకు మంత్రులు పల్లె ర ఘునాథరెడ్డి, నారాయణ, బొజ్జల, శిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తిలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. -
పేలని రెయిన్ గన్..!
– జిల్లాకు 4,742 మంజూరు – గోదాములకే పరిమితం – విడుదల కాని మార్గదర్శకాలు – కనిపించని టెక్నీషియన్లు – ఎండుతున్న పంటలు – పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): రూ.150 కోట్లతో రెయిన్గన్లను సిద్ధం చేశాం. ఒక్క ఎకరాలో కూడ పంట ఎండకూడదు. ఎండితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రెయిన్ గన్లు పది రోజులు క్రితమే వచ్చాయి. పంటలు తడపడానికి ఇప్పటి వరకు సరైన మార్గదర్శకాలు లేవు. సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న కంపెనీలు ఇంతవరకు టెక్నీషియన్లను నియమించుకోలేదు. ఎండుతున్న పంటలు కాపాడటం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉంది. రెయిన్గన్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాకు 4,742 రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, పైపులు పది రోజుల క్రితమే వచ్చాయి. వాడితో పంటలకు ప్రాణం పోస్తున్నారా..అంటే లేదు. వాటిని మార్కెట్ యార్డ్ గోదాముల్లో భద్రంగా ఉంచారు. ఎండుతున్న పంటలను చూసి రైతులు గగ్గోలు పెడుతుంటే అదిగో రెయిన్ గన్..ఇదిగో అంటూ హడావుడి చేయడం తప్ప కార్యాచరణ కనిపించడం లేదు. వివిధ మండలాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో లక్షకు పైగా హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం 24వేల హెక్టార్లే అని చెబుతున్నారు. అతిపెద్ద డ్రై స్పెల్ .. వర్షానికి, వర్షానికి మధ్య పది రోజుల వరకే ఎడం ఉండాలి. లేదంటే పైర్లు దెబ్బతింటాయి. ఈ సారి 25 రోజులుగా వానల్లేవు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇంతవరకు 22.1 మిమీ మాత్రమే వర్షం కురిసింది. దీంతో భూమిలో తేమ శాతం రోజురోజుకు పడిపోతోంది. పైర్లు వాడుముఖం పట్టి ఎండిపోతున్నాయి. జూలై నెలలో కూడా పలు మండలాల్లో వర్షాలు తూతూ మంత్రంగానే కురిశాయి. ఆగస్టులో చినుకు జాడ కరువైంది. పైగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో పైర్లు మాడిపోతున్నాయి. కొద్ది రోజులుగా వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కొర్ర, మినుము తదితర పైర్లను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తర్వులేవీ? రెయిన్గన్లతో పైర్లనుతడపడానికి రైతులే నీళ్లు సమకూర్చాలి. ‘తాగడానికే నీళ్లులేవు.. రెయిన్గన్లకు ఎక్కడి నుంచి తేవాలి’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లకు, డీజిల్‌కు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కాని ఇంతవరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాలేదు. ఒక్క ఎకరా భూమిని తడపాలంటే కనీసం 40 వేల లీటర్ల నీరు అవసరం. డోన్, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, అలూరు, దేవనకొండ, పెద్దకడుబూరు. వెల్దుర్తి, కష్ణగిరి తదితర మండలాల్లో చుట్టూ 20 కిలో మీటర్ల పరిధిలో నీళ్లు లేవు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు సమకూర్చాలంటే ఎకరాకు కనీసం రూ.5వేలు వ్యయం చేయాల్సి ఉంది. సబ్సిడీ వస్తుందా... లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆయిల్ ఇంజిన్లు ఎవరిస్తారు? పైర్లను రెయిన్గన్ల ద్వారా తడపాలంటే అయిల్ ఇంజన్లు అవసరం. ఒకవైప పైర్లు ఎండుతూ..రైతులు అల్లాడుతున్నా జిల్లాకు ఒక్క అయిల్ ఇంజిన్ కూడ రాలేదు. అయిల్ ఇంజన్లు రాకపోతే పైర్లను తడపడం ఎలా అనేది ప్రభుత్వానికే తెలియాలి. రెయిన్గన్లు, స్ప్రింకర్లు వచ్చినా... అయిల్ఇంజన్లు రాకపోవడంతో పంటలను కాపాడటం ప్రశ్నార్థకం అయింది. ఎండుతున్న పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు కూడా వర్షాభావం వల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొంటున్నారు. =========== పెట్టుబడి మట్టిపాలు: రంగన్న, గాజులదిన్నె, గోనెగండ్ల మండలం నేను ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ వేసింటి. ఇప్పటి వరకు 80వేల రూపాయల పెట్టుబడైంది. చెట్టు కాయలొచ్చే టయానికి వాన లేకపాయె. ఒక్క వాన పడినా ఆశలు పండేటేవి..మా దురదష్టం.. చెట్టుకు రెండు, మూడు కాయలు కూడ లేవు. చేలో తేమ లేక కాయలు కూడ లొట్టలయితున్నాయి. పెట్టుబంతా మట్టిపాలైంది. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాల. ===================== సాగు వివరాలు (హెక్టార్లలో) సాధారణం: 6.21 లక్షలు ఈ ఏడాది సాగు: 4.73 లక్షలు పత్తి: 1.49 లక్షలు వేరుశనగ: 94,999 కంది: 85,300 ఉల్లి : 19,157 మిరప: 17,146 మొక్కజొన్న: 22,929 కొర్ర: 10,017 మినుము: 11,032 వరి: 14,407 ============== ఇప్పటి వరకు ఎండిన పంటలు: లక్ష హెక్టార్లు అధికారిక లెక్కలు: 24 వేల హెక్టార్లు =============== -
కాకి లెక్కలతో అధికారుల మోసం
ధర్మవరం రూరల్ : రెయిన్ గన్ల ద్వా రా లక్షలాది ఎకరాలకు నీటిని అందిం చి పంటలను కాపాడామని అధికారులు కాకి లెక్కలు చెప్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. శనివారం ఆ పార్టీ నాయకులతో కలసి మండల పరిధిలోని గొళ్లపల్లిలో ఎండిపోతున్న వేరుశనగ పొలాలను పరిశీలించారు. రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షలా 96 వేల హెక్టార్లలో రైతులు వేరుశనగ పంటను సాగు చేశారన్నారు. అయితే ఊడలు దిగే సమయంలో వర్షం రా కపోవడంతో పంట పూర్తిగా ఎండిపోతోందన్నారు. ఇలాంటి సమయంలో పొరుగు రైతులతో మాట్లాడి, ఫారంపాండ్లలో ఉన్న నీటిని అందించి, లక్షలాది ఎకరాలను కాపాడామని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని మభ్యపెట్టి రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా తదితర సబ్సిడీలు రాకుండా చేయడానికే ఇలాంటి నివేదికలు అన్నారు. వాస్తవంగా వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు అందించారో.. ఎన్నివేల హెక్టార్లలో పంట ఎండిపోతోందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజనేయులు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎస్‌హెచ్ బాషా, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి జేవీ రమణ, పట్టణ అధ్యక్షుడు పోలా లక్ష్మినారాయణ, ఎస్ఎఫ్ఐ నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.