– జిల్లాకు 4,742 మంజూరు
– గోదాములకే పరిమితం
– విడుదల కాని మార్గదర్శకాలు
– కనిపించని టెక్నీషియన్లు
– ఎండుతున్న పంటలు
– పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): రూ.150 కోట్లతో రెయిన్‌గన్‌లను సిద్ధం చేశాం. ఒక్క ఎకరాలో కూడ పంట ఎండకూడదు. ఎండితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం.
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జిల్లాకు రెయిన్ గన్‌లు పది రోజులు క్రితమే వచ్చాయి. పంటలు తడపడానికి ఇప్పటి వరకు సరైన మార్గదర్శకాలు లేవు. సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న కంపెనీలు ఇంతవరకు టెక్నీషియన్లను నియమించుకోలేదు. ఎండుతున్న పంటలు కాపాడటం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉంది. రెయిన్‌గన్‌ల వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాకు 4,742 రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు, పైపులు పది రోజుల క్రితమే వచ్చాయి. వాడితో పంటలకు ప్రాణం పోస్తున్నారా..అంటే లేదు. వాటిని మార్కెట్ యార్డ్ గోదాముల్లో భద్రంగా ఉంచారు. ఎండుతున్న పంటలను చూసి రైతులు గగ్గోలు పెడుతుంటే అదిగో రెయిన్ గన్..ఇదిగో అంటూ హడావుడి చేయడం తప్ప కార్యాచరణ కనిపించడం లేదు. వివిధ మండలాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో లక్షకు పైగా హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం 24వేల హెక్టార్లే అని చెబుతున్నారు.
అతిపెద్ద డ్రై స్పెల్ ..
వర్షానికి, వర్షానికి మధ్య పది రోజుల వరకే ఎడం ఉండాలి. లేదంటే పైర్లు దెబ్బతింటాయి. ఈ సారి 25 రోజులుగా వానల్లేవు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇంతవరకు 22.1 మిమీ మాత్రమే వర్షం కురిసింది. దీంతో భూమిలో తేమ శాతం రోజురోజుకు పడిపోతోంది. పైర్లు వాడుముఖం పట్టి ఎండిపోతున్నాయి. జూలై నెలలో కూడా పలు మండలాల్లో వర్షాలు తూతూ మంత్రంగానే కురిశాయి. ఆగస్టులో చినుకు జాడ కరువైంది. పైగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో పైర్లు మాడిపోతున్నాయి. కొద్ది రోజులుగా వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కొర్ర, మినుము తదితర పైర్లను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఉత్తర్వులేవీ?
రెయిన్‌గన్‌లతో పైర్లనుతడపడానికి రైతులే నీళ్లు సమకూర్చాలి. ‘తాగడానికే నీళ్లులేవు.. రెయిన్‌గన్‌లకు ఎక్కడి నుంచి తేవాలి’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లకు, డీజిల్‌కు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కాని ఇంతవరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాలేదు. ఒక్క ఎకరా భూమిని తడపాలంటే కనీసం 40 వేల లీటర్ల నీరు అవసరం. డోన్, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, అలూరు, దేవనకొండ, పెద్దకడుబూరు. వెల్దుర్తి, కష్ణగిరి తదితర మండలాల్లో చుట్టూ 20 కిలో మీటర్ల పరిధిలో నీళ్లు లేవు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు సమకూర్చాలంటే ఎకరాకు కనీసం రూ.5వేలు వ్యయం చేయాల్సి ఉంది. సబ్సిడీ వస్తుందా... లేదా అనే దానిపై స్పష్టత లేదు.
ఆయిల్ ఇంజిన్లు ఎవరిస్తారు?
పైర్లను రెయిన్‌గన్‌ల ద్వారా తడపాలంటే అయిల్ ఇంజన్‌లు అవసరం. ఒకవైప పైర్లు ఎండుతూ..రైతులు అల్లాడుతున్నా జిల్లాకు ఒక్క అయిల్ ఇంజిన్ కూడ రాలేదు. అయిల్ ఇంజన్‌లు రాకపోతే పైర్లను తడపడం ఎలా అనేది ప్రభుత్వానికే తెలియాలి. రెయిన్‌గన్‌లు, స్ప్రింకర్లు వచ్చినా... అయిల్‌ఇంజన్‌లు రాకపోవడంతో పంటలను కాపాడటం ప్రశ్నార్థకం అయింది. ఎండుతున్న పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు కూడా వర్షాభావం వల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొంటున్నారు.
===========
పెట్టుబడి మట్టిపాలు:
రంగన్న, గాజులదిన్నె, గోనెగండ్ల మండలం
నేను ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ వేసింటి. ఇప్పటి వరకు 80వేల రూపాయల పెట్టుబడైంది. చెట్టు కాయలొచ్చే టయానికి వాన లేకపాయె. ఒక్క వాన పడినా ఆశలు పండేటేవి..మా దురదష్టం.. చెట్టుకు రెండు, మూడు కాయలు కూడ లేవు. చేలో తేమ లేక కాయలు కూడ లొట్టలయితున్నాయి. పెట్టుబంతా మట్టిపాలైంది. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాల.
=====================
సాగు వివరాలు (హెక్టార్లలో)
సాధారణం: 6.21 లక్షలు
ఈ ఏడాది సాగు: 4.73 లక్షలు
పత్తి: 1.49 లక్షలు
వేరుశనగ: 94,999
కంది: 85,300
ఉల్లి : 19,157
మిరప: 17,146
మొక్కజొన్న: 22,929
కొర్ర: 10,017
మినుము: 11,032
వరి: 14,407
==============
ఇప్పటి వరకు ఎండిన పంటలు: లక్ష హెక్టార్లు
అధికారిక లెక్కలు: 24 వేల హెక్టార్లు
===============