రెయిన్ గన్‌ల ద్వా రా లక్షలాది ఎకరాలకు నీటిని అందిం చి పంటలను కాపాడామని అధికారులు కాకి లెక్కలు చెప్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు.
ధర్మవరం రూరల్ : రెయిన్ గన్‌ల ద్వా రా లక్షలాది ఎకరాలకు నీటిని అందిం చి పంటలను కాపాడామని అధికారులు కాకి లెక్కలు చెప్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. శనివారం ఆ పార్టీ నాయకులతో కలసి మండల పరిధిలోని గొళ్లపల్లిలో ఎండిపోతున్న వేరుశనగ పొలాలను పరిశీలించారు. రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షలా 96 వేల హెక్టార్లలో రైతులు వేరుశనగ పంటను సాగు చేశారన్నారు. అయితే ఊడలు దిగే సమయంలో వర్షం రా కపోవడంతో పంట పూర్తిగా ఎండిపోతోందన్నారు.
ఇలాంటి సమయంలో పొరుగు రైతులతో మాట్లాడి, ఫారంపాండ్లలో ఉన్న నీటిని అందించి, లక్షలాది ఎకరాలను కాపాడామని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని మభ్యపెట్టి రైతులకు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా తదితర సబ్సిడీలు రాకుండా చేయడానికే ఇలాంటి నివేదికలు అన్నారు. వాస్తవంగా వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు అందించారో.. ఎన్నివేల హెక్టార్లలో పంట ఎండిపోతోందో తెలుస్తుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజనేయులు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎస్‌హెచ్ బాషా, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి జేవీ రమణ, పట్టణ అధ్యక్షుడు పోలా లక్ష్మినారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.