కనిగిరి: దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా అభివృద్ధి పేరితో ప్రధానిమోదీ, సీఎం చంద్రబాబు దేశాన్ని, రాష్ట్రాన్ని మూడున్నరేళ్లుగా దోచుకుంటున్నారని సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఎం జిల్లా 12వ మహాసభలు సోమవారం రాత్రి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంగణంలో సయ్యద్ హనీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణంగా విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా కొడుకు మూడేళ్ల క్రితం కేవలం రూ. 50 వేల పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అతని ఆదాయం రూ.85 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాదపాలన సాగిస్తూ. ఆర్‌ఎస్‌ఎస్ వంటి దృష్టశక్తులను పోషిస్తోందని ఘాటుగా విమర్శించారు.
జన్మభూమి కమిటీలను నిలదీయాలి
రాష్ట్రంలోని జన్మభూమి కమిటీలు దోపిడీ కమిటీలని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగట ఆడుతున్నాయని, బీజేపీ, టీడీపీ కలిసి తెలుగు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. తాగేందుకు నీళ్లు ఇవ్వకుండా.. మద్యం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలను రద్దు చేస్తేనే రాష్ట్రానికి మోక్షం కలుగుతుందని చెప్పారు. జన్మభూమి సభల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఆ పాపం చంద్రబాబుదే
రక్షిత మంచినీరు లేకనే జిల్లాలో 423 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని, ఆ పాపం చంద్రబాబునాయుడిదేనని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. బాబు వస్తే జాబు వస్తోందని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి లోకేష్ బాబుకు అధికారం అనే జాబు ఇప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు. నిమ్జ్ పేరుతో సేకరిస్తున్న పేదల భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు «ధరల కోసం చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
ప్రత్యామ్నయ శక్తికోసం సీపీఎం కృషి
దేశంలో ప్రత్యామ్నయ శక్తి ఏర్పాటు కోసం సీపీఎం అందరి సహకారంతో ముందుకు సాగుతోందని శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై సీపీఎం నిరంతర పోరాటాలు చేస్తోందన్నారు. సీపీఎం ప్రజల గొంతుకై ప్రజా పోరాటాలు సాగిస్తోందని చెప్పారు. ప్రజావ్యతిరేక పార్టీలపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మోదీ, బాబుకు నైతిక విలువలు లేవు
కనీస నైతిక విలువలు లేని మోదీ, చంద్రబాబులు విలువల గూర్చి మాట్లాడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వైంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీట్లు తక్కువగా వచ్చినా నిస్సిగ్గుగా గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ గోవా, మణిపూర్‌లో అధికారం చేపట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు మరి బరితెగించి సిగ్గు లేకుండా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి మంత్రి పదవులిచ్చాడని ఘాటుగా విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, జిల్లా నాయకులు పి. హనుమంతరావు, షేక్.మాబు, చీకటి శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, పీసీ కేశవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment