జన్మభూమి కమిటీల పేరిట అధికార పార్టీ కార్యకర్తలతో గ్రామాల్లో అలజడి సృష్టించిన సీఎం చంద్రబాబు వీరి ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో కొత్త ఎత్తుగడకు తెరలేపారు. పథకాల ప్రచారం, సమస్యల పరిష్కారం కోసమంటూ జన్మభూమి కమిటీల తరహాలోనే గ్రామాల్లో తమకు అనుకూలురైన వారిని సాధికార మిత్రలుగా నియమించుకుంటున్నారు. వారిని పార్టీ ప్రచారానికి బూత్ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
పర్చూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను కాదని, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు అధికారం కట్టబెట్టింది. కమిటీ సభ్యులు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. దీంతో అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అధికార దర్పంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కమిటీలు కొన్నాళ్లకే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నాయి. మరో వైపు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఉలిక్కిపడిన టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అధికారమే పరమావధిగా భావించిన టీడీపీ నాయకులకు ఈ నిర్ణయం రుచించలేదు. దీంతో జన్మభూమి కమిటీల స్థానంలో సాధికార మిత్ర, కల్యాణ మిత్ర, బీమా మిత్రలు ఇలా రకరకాల పేర్లతో టీడీపీ ప్రచార మిత్రలను నియమించింది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీరిని ఉపయోగించుకోనుంది.పార్టీ ప్రచారం కోసం పక్కా ప్రణాళిక...
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే నెపంతో ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల్లో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలను సాధికారమిత్రలు, పశుమిత్రలు, కల్యాణ మిత్రలు, బీమా మిత్రలుగా ఎంపిక చేసింది. వారికి ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. కేవలం టీడీపీ కార్యకర్త అయితే చాలు. వారిని ప్రతి నెల గౌరవ వేతనం పేరుతో కొంత మొత్తాన్ని ఇస్తూ పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రతీ 35 కుటుంబాలకు ఒక సాధికారమిత్ర చొప్పున పార్టీ కార్యకర్తలను నియమించింది. డ్వాక్రా సంఘాల మహిళలను సాధికారమిత్ర, కల్యాణమిత్ర, బీమా మిత్రలుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కావాల్సిన దరఖాస్తుల నుంచి అర్హుల ఎంపిక వరకు అంతా వీరే చూసుకుంటారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి మొండి చేయి చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కమీషన్ ఇస్తేనే పథకాలు మంజూరు...
జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 26,571 మంది సాధికారమిత్రలు, మండలానికి ఇద్దరేసి చొప్పున 112 మంది కల్యాణమిత్రలు, 112 మంది బీమా మిత్రలను నియమించారు. వీరంతా అధికార పార్టీ కార్యకర్తలే. పింఛన్లు, గ్రూపు రుణాలు మంజూరు కావాలన్నా, చంద్రన్న బీమా పరిహారం అందాలన్నా. ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయాలన్నా ఆయా మిత్రలకు కమీషన్ ఇవ్వాల్సిందే. కమిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు కావు.
Comments
Please login to add a commentAdd a comment