ఆత్మకూరు: ప్రజాపంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదరి రాంభూపాల్ విమర్శించారు. మండల కేంద్రంలో సీపీఎం 6వ మండల మహాసభల్లో భాగంగా శనివారం ఆయన ఆత్మకూరు పాత సిండికేట్ బ్యాంకు వద్ద సీపీఎం జెండాను ఆవిష్కరించి సీపీఎం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మహాసభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల రేషన్ దుకాణాలుండగా వాటిలో 6,500 దుకా ణాలను రిలయన్స్ ఫ్యూచర్ కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటగా మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోందని, వాటిలో అనంతపురం కూడా ఉందని తెలిపారు.
రేషన్ దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద మాత్రం తక్కువ ధరలకే కొనుగోలు చేస్తారన్నారు. 36 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి 30 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి ప్రైవేటు విద్యను పరిమితిలో ఉంచాలన్నారు. అంతేకాకుండా జిల్లాలో రూ.113 కోట్ల ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ప్రస్తుతం రూ.41.13 కోట్లు మాత్రమే కూలీలకు వచ్చాయన్నారు. కోటికి పైగా బిల్లులు అందాల్సిన మండలాలు 17 వరకు ఉన్నాయన్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కూలీల బిల్లులు కోట్లలో పెండింగ్‌లో ఉండటం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి , నియోజకవర్గ నాయకుడు రామాంజినేయులు, మండల నాయకులు శివశంకర్, శివ, సోము, రాము, వలి, జయమ్మ, రాజేశ్వరమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment