తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక రానున్నవన్నీ మంచి రోజులేనని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ పెనుమల్లి మధు వ్యాఖ్యానించారు. మే డే సందర్భంగా విజయవాడ పటమటలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన .. ఆ తర్వాత సభలో మాట్లాడారు. టీడీపీతో జత కట్టడం వల్లే సీపీఎం బలహీన పడిందని అన్నారు. చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులంతా సంఘటితం కావాలని, చంద్రబాబు కార్మిక సంక్షేమాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో తాగేందుకు నీళ్లు లేనప్పుడు ప్రపంచస్థాయి రాజధాని ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తే పటమటలో కలుషిత నీటిపై దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమాధిపతుల కోసం చంద్రబాబు శాంతిభద్రతల జపం చేస్తున్నారన్నారు. కమ్యూనిజానికి, సోషలిజానికి మరణం లేదని, దేశంలో వామపక్షాలను మట్టుపెట్టాలనుకుంటున్న వారికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. కార్మిక వర్గాలను అణగదొక్కాలని యాజమాన్యాలు చూసినా.. ఐకమత్యంగా ఉన్నన్నాళ్లు కార్మికలోకానికి మరణం లేదని మధు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను చంద్రబాబు తన ప్రచార అర్భాటాలకు వాడుకోవడం సరికాదని హితవు పలికారు.
'టీడీపీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి'
Published Mon, May 1 2017 10:02 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement