నష్టపోయిన రైతు శివన్నను చూపిస్తున్న వైఎస్ జగన్
నల్లమడ (అనంతపురం): పిట్టలదొర తరహాలో చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తూ.. అబద్ధాలు చెప్తూ.. బూటకపు హామీలు ఇస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కరువుసీమ అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్ పేరిట సాగునీరు అందిస్తానంటూ చంద్రబాబు చేసిన ఆర్భాటం వెనుక ఉన్న అసలు బండారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. అబద్ధాలను చెప్తూ ప్రజలను ఏమార్చే పిట్టలదొర కథను ఉదాహరణగా చెప్తూ.. చంద్రబాబు రెయిన్‌గన్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు రెయిన్‌గన్ ఆర్భాటానికి నిలువునా మోసపోయిన పేదరైతు శివన్న కథను నల్లమడ ప్రజలకు వినిపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ చేరుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అశేష ప్రజాసమూహం నల్లమడలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికింది. భగవాన్ సత్యసాయిబాబా పుట్టిన పుట్టపర్తి ప్రాంతం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
నిజమైన పిట్టలదొర ఎవరు?
'చంద్రబాబు పాలన పూర్తయి నాలుగేళ్లు అవుతోంది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మనమంతా చూశాం. ఈ నాలుగేళ్ల పాలనలో మేం సంతోషంగా ఉన్నామని మీలో ఎవరైనా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలరా? లేదు. చంద్రబాబు పాలన గురించి ఓ చిన్న కథ, పిట్టలదొర కథ చెప్తాను. అనగనగా ఓ పిట్టలదొర.. ఆ పిట్టల దొర అంటే ఉన్నదిలేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కథలు చెప్పేవాడు. ప్రజలను వీడు ఎంతగొప్పగా మోసం చేశాడు.. వీడు పిట్టలదొరరా బాబు అనేలా చేస్తాడు. మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే గుండువారిపల్లెలో శివన్న అనే రైతన్న ఉంటాడు. ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది. అప్పులు చేసి.. రూ. 90వేలు ఖర్చుచేసి ఆయన తన పొలంలో వేరుశనగ పంట వేశాడు. అసలే అనంతపురంజిల్లాలో కరువు.. అందులోనూ చంద్రబాబు సీఎం అయ్యారు.. ఇంకా ఈ ఏడు వర్షాలు పడలేదు. దీంతో సాగునీరు లేక అల్లాడుతున్న శివన్న వద్దకు పిట్టలదొర వచ్చి.. దేవుడ్ని నమ్ముకోకు.. నన్ను నమ్ముకో నీ పొలంలోకి నీళ్లు తెప్పిస్తానని చెప్పాడు. పిట్టలదొర మాటలు ఆ శివన్న నమ్మాడు. ఆ పిట్టలదొర తనకు 9 ఏళ్లు అనుభముందని చెప్పాడు.
నా దగ్గర గన్ ఉంది. అది రెయిన్ గన్.. దానితో వర్షాలు తెప్పిస్తానని పిట్టల దొర చెప్పాడు. శివన్న సరే సర్ అన్నాడు. పిట్టలదొర వస్తున్నాడని.. అధికారులు శివన్న పొలంలో పెద్ద గుంత తవ్వి.. టార్పన్ కవర్‌ను ఆ గుంతలో పరిచి.. ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చి.. అందులో పోశారు. ఈ నీళ్లతో పొలంలో రెయిన్ గన్ ఏర్పాటుచేశారు. పిట్టల దొర వచ్చి నీళ్లు చిమ్ముతున్న రెయిన్ గన్ దగ్గర మీడియాకు ఫోజులు ఇచ్చాడు. రెయిన్‌గన్ ఆన్ చేయగానే అలాఅలా నీళ్లు వచ్చాయి. శివన్న ఏదో సంతోషపడ్డాడు. ఆ తర్వాత పిట్టలదొర వెళ్లిపోయాడు. శివన్నకు భోజనానికి వెళ్లాడు. ఇలా శివన్న భోజనానికి వెళ్లాడో లేదో గంట సమయంలోనే టార్పన్ కవర్ చుట్టుకొని.. రెయిన్ గన్‌ను ఎత్తుకొని అధికారులు వెళ్లిపోయారు' అంటూ ఆనాడు రెయిన్ గన్‌తో చంద్రబాబు శివన్న అనే రైతుపొలంలో హడావిడి చేసిన ఫొటోలను ప్రజలకు చూపించారు. నాడు రెయిన్‌గన్లతో కరువుసీమ అనంతపురానికి నీళ్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు బండారాన్ని బయటపెడుతూ.. ఆ తతంగానికి నష్టపోయిన రైతు శివన్న బహిరంగ సభ వేదికపైకి పిలిచి ప్రజలకు చూపించారు. చంద్రబాబు రెయిన్‌గన్లతో హడావిడి చేసి వెళ్లిపోవడంతో శివన్న వేరుశనగ పంట చేతికి రాలేదని, ఆ ఏడు కేవలం అరబస్తా మాత్రమే పంట పండిందని తెలిపారు. దీంతో వ్యవసాయం కోసం తీసుకొచ్చిన రూ. 90వేల అప్పు తీర్చేందుకు శివన్న ఊరూరు తిరిగి వొడియాలు, బూరెలు అమ్ముకుంటున్నారని రైతు దీనగాథను వివరించారు. శివన్న భార్య కూడా అప్పు తీర్చేందుకు హోటల్‌లో పనిచేస్తోందని తెలిపారు.
ఇంత దారుణంగా చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల్ని క్షమిస్తే.. ఈసారి చిన్న చిన్న అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరేమోనని, ఇంకా పెద్ద మోసాలకు దిగుతారని, ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ కారు కొనిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగలరని మండిపడ్డారు. 'ఇలా ప్రజలను మోసం చేసే వ్యక్తులు పోవాలి. బంగాళాఖాతంలో కలిసిపోవాలి. ఇందుకు జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ వస్తాయి' అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి రావాలని అన్నారు.
ఈసారి చంద్రబాబుకు ఓటు వేయకండి: శివన్న
ఈ సందర్భంగా నష్టపోయిన రైతు శివన్న మాట్లాడుతూ.. చంద్రబాబు తమను లేనిపోని ఇబ్బంది పెట్టారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేయకండి అని అన్నారు. మనకు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు చాలు.. ఆయననే గెలిపిద్దామని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు తాను ఓటేశానని, బ్యాంకుల్లో రుణాలు కూడా మాఫీ కాలేదని తెలిపారు.
పుట్టపర్తిని చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్
- పుట్టపర్తికి చాలా హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారు
- పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు
- పుట్టపర్తిలో విమానాల నిర్వహణ మరమ్మతుల కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు
- పుట్టపర్తిని ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. బుక్కపట్నం-కొత్త చెరువును కలుపుతూ రిగ్‌రోడ్ వేస్తామన్నారు
- బుక్కపట్నంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుచేస్తామన్నారు
- ఇన్ని హామీల్లో ఒక్కటీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు
- హామీలిచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు
- మాట ఇస్తే నిలబడాలి.. లేకుంటే రాజీనామా చేయాలి
బీసీలపై ప్రేమ అంటే ఇది..!
- మీ అందరి ఆశిర్వాదంతో మన ప్రభుత్వం వచ్చాక నవరత్నాల పథకాన్ని అమలుచేస్తాం
- నవరత్నాల్లో మార్పులు చేర్పులు.. సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి
- ఎన్నికలు రాగానే బీసీలపై చంద్రబాబు ఎక్కడాలేని ప్రేమను కురిపిస్తారు
- బీసీలపై ప్రేమంటే ఇస్ట్రీ పెట్టేలు, కత్తెరలు ఇవ్వడమేనా?
- బీసీలపై నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పి చూపిస్తా
- నాన్నగారు, దివంగత నేత వైఎస్సార్ పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు
- ఆ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు
- నాన్నగారి పరిపాలనలో పేదలు చదువుల కోసం ఇబ్బందిపడకూడదని ఒక్క అడుగు ముందుకేశారు
- నవరత్నాల్లో భాగంగా చదువుకున్న పిల్లల కోసం నేను రెండు అడుగులు ముందుకువేస్తాను
- మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం
- మీ పిల్లలను దగ్గరుండి నేను ఇంజినీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివిస్తాను
- అంతేకాకుండా మెస్‌చార్జీలు, హాస్టల్ చార్జీల కోసం ప్రతి పిల్లాడికి ఏటా రూ. 20వేల చొప్పున ఇస్తాం
- తల్లులు తమ పిల్లలను చదివించాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి
- పిల్లలను బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు ఇస్తాను
- ఆ చిట్టిపిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి.. ఇది బీసీల మీద ప్రేమ అంటే..
- ఇదే పేదవాడి కోసం నవరత్నాల్లో భాగంగా నాలుగు అడుగులు ముందుకువేశాం
- ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పెన్షన్ రూ. 2వేలకు పెంచుతాం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కాచెల్లెమ్మలకు పెన్షన్ రూ. 2వేలు ఇవ్వడం కాదు.. పెన్షన్ వయస్సు 45 ఏళ్లకు తగ్గిస్తాం
Comments
Please login to add a commentAdd a comment