జగన్ పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో...
ఒక్క అడుగు లక్షలాది అడుగులకు స్ఫూర్తినిచ్చింది.ఒక్కడిగా మొదలైన పయనం..జగమంత కుటుంబాన్ని ఒక్కటి చేసింది.అభిమానం గూడుకట్టుకుంటే..అచ్చం వైఎస్ జగన్‌లాగే ఉంటుందనే సత్యం అడుగడుగులో కనిపించింది.అక్కచెల్లెమ్మల ఆప్యాయత..అన్నదమ్ముల అనురాగం..అవ్వాతాతల మమతానురాగం..పల్లె ముంగిట్లో పండుగ వాతావరణం..పట్టణాల్లో కోలాహలం.. అన్న రాకఓ సంబరం.చీకట్లను చీల్చుకుంటూ.. కుట్రలకుఎదురొడ్డి నిలుస్తూ..నవోదయానికి నాంది పలుకుతూ..అదిగో జగనన్న..మొక్కవోని ఆశయం దిశగా విజయదుందుభి.
అనంతపురం టౌన్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2017 డిసెంబర్ 4న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దాటి జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామంలోకి ప్రవేశించింది. 25 రోజుల పాటు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 15 మండలాల గుండా 278.6 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్ర సాగిన పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపించారు. ప్రతి పల్లెలోనూ జగనన్న వస్తున్నాడంటూ ఆడపిల్లలను, బంధువులను ఇళ్లకు పిలిపించుకున్నారు. ఇంటిముందు కల్లాపి చల్లి, ముగ్గులు వేసి రోడ్డుపై బంతిపూలు పరిచి ఘన స్వాగతం పలికారు.
ఆసక్తికరమైన విశేషాలెన్నో..
♦ యాత్రకు ప్రజలతో పాటు అన్ని కులాలు, ప్ర జా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగసంఘాలు మద్దతు ప్రకటించాయి. హైకోర్టు న్యాయవాదులు చెన్నారెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది న్యాయవాదులు ప్రత్యేక బస్సులో వచ్చి గార్లదిన్నెలో జగన్‌ను కలిసి యాత్రకు సంఘీభావం ప్రకటించారు.
♦ పుట్టపర్తి నియోజకవర్గం రామాపురంలో రష్యా తో పాటు పలుదేశాలకు చెందిన విదేశీయులు కలిశారు. ప్రతి గ్రామంలో నెలకొల్పిన వైఎస్ విగ్రహాలు చూసి ఆరా తీయగా, ఆ మహానేత గొప్పతనం తెలిసిందని, ఆయన కుమారుడు పాదయాత్ర చేస్తున్నారని తెలిసి చూసేందుకు వచ్చామంటూ జగన్‌తో వారు అన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి ఉన్నారు.
♦ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోకి చేరగా నే కళ్యాణదుర్గం నియోజవకర్గం కుందుర్పికి చెందిన మహిళలు జగన్‌ను కలిసి ఆయన చేతిలో ఓ మూట పెట్టారు. ‘ఏంటి తల్లి ఇదీ?’అంటూ జగన్ అడగ్గానే ‘అన్నా ఇద్దరమూ కూలి పనికి వెళ్లి దాచుకున్న సొమ్ములో కొంత చిల్లర తెచ్చాం. పాదయాత్ర విజయవంతమయ్యేందుకు మా వంతు భాగంగా ఈ మొత్తాన్ని ఇస్తున్నాం’ అని వారు చెప్పగానే ఆ అభిమానానికి జగన్ కళ్లు చెమర్చాయి.
♦ శింగనమల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి అనే రైతు కలిసి భారీ ఇత్తడి నాగలి బహుకరించారు. ‘సార్! నాకు చదువు రాదు. ఫ్లెక్సీలు వేయించలేను. పేపర్లో ప్రకటనలు ఇస్తే ఆ రోజుతోనే ఆ జ్ఞాపకం పోతుంది. అందుకే ఈ నాగలిని ఇస్తున్నా’ అంటూ అతను అభిమానాన్ని చాటుకున్నాడు.
♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2017డిసెంబర్ 21న పుట్టిన రోజు వేడుకలను పుట్టపర్తి నియోజకవర్గంలో జరుపుకోగా.. క్రిస్మస్ పండుగను కదిరి నియోజకవర్గంలో జరుపుకున్నారు.
ప్రారంభం నుంచి..
అమడగూరు మండలం జేకేపల్లి పంచాయతీ ఇద్దేవాండ్లపల్లికి చెందిన తాటిమల్లెల నంజుండు 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభంలో పాలు పంచుకున్నాడు. అప్పటి నుంచి అన్ని జిల్లాల్లోనూ అన్నతో కలసి అడుగేస్తూ ముందుకు సాగాడు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర నుంచి సాక్షితో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ.. పాదయాత్రకు, బహిరంగ సభలకు వస్తున్న జనాదరణ చూస్తే రాబోవు ఎన్నికల్లో జగనన్న సీఎం అవడం ఖాయమని పేర్కొన్నాడు. – అమడగూరు
మరువలేని రోజులు
ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకూ జగనన్నతో కలిసి అడుగు వేశాం. పాదయాత్రలో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల ను వినడమే కాకుండా.. వాటికి శాశ్వత పరిష్కారాలను ఆయన అన్వేషించారు. రైతులు సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలనే ఆంశాలపై రైతులనే అడిగి తెలుసుకున్నా రు. అధికారంలోకి రాగానే రైతులు అందజేసిన ప్రతి సూచనను అమలు చేస్తానంటూ అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నిం పారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడంతోపా టు, వారి సమస్యలు అంతే ఓపికగా విన్నారు. జగనన్నతో కలిసి నేను వేసిన ప్రతి అడుగు జీవితంలో ఎన్నటికీ మరువలేను. – ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
జగన్ వెన్నంటే..
కొత్తచెరువు గ్రామానికి చెందిన వాల్మీకి శంకర్.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం నుంచి జగన్ వెంటనే నడుస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి సాక్షితో ఫోన్‌లో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహనిర్మాణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేవాడిని. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తప్పించారు. కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా లక్ష్యం. అందుకే పాదయాత్రలో జననేత వెంటే ఉన్నా. జగన్ సీఎం కావడం తథ్యం. – కొత్తచెరువు
జగన్‌ను సీఎంగా చూడాలి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో 12 నెలల పాటు ఆయనతో పాటు కలిసి నడిచా. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నా. జగన్నను ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక. ఈ జన్మకు ఇది చాలు. నా భార్య, తల్లి కూడా పూర్తిగా సహకరించారు. – రాంభూపాల్‌రెడ్డి పాపంపేట, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment