సాక్షి, గన్నవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ల ఎదుటే ఇసుక మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షల టన్నుల ఇసుక తరలిపోతున్నా... సీఎం మాత్రం కళ్లు మూసుకుని ఉన్నారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇసుకాసురులు, మట్టికాసురులు ఉన్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు.
144వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘కలియుగం చంద్రబాబుతోనే మొదలైందని రైతులు అంటున్నారు. మట్టితో డబ్బులు సంపాదిస్తారని తాము ఎప్పుడూ అనుకోలేదని, అలాంటిది మా ఖర్మ కాలి చంద్రబాబు హయాంలో ఈ దుస్థితి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు-చెట్టు పేరుతో దోచుకుంటున్న చెరువు దగ్గరకు రైతులు నన్ను తీసుకెళ్లారు. చెరువులో ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. సీఎం హోదాలో ఉండికూడా చంద్రబాబు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. మట్టి నుంచి మద్యం వరకూ అన్నింటిలో స్కామ్‌లే. రేషన్ కార్డు కావాలన్నా లంచమే. పెన్షన్ కావాలన్నా లంచం.
రైతన్నలు కేవలం వ్యవసాయం మీద బాగుపడరని, రైతన్న బాగుండాలంటే పాడి కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో కృష్ణావేణి కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో పాల ధరలు లీటర్ 23 నుంచి 56 రూపాయలు వరకూ వెళ్లాయి. ఇవాళ చంద్రబాబు అధికారంలోకి రాగానే కృష్ణవేణి డెయిరీ మూతపడింది. ఇక వరి, మినుము సహా ఏ పంటలకు మద్దతు ధరలు లేవు. వైఎస్‌ఆర్‌కు పేరు వస్తుందని పులిచింతల ప్రాజెక్ట్‌ను పట్టించుకోవడం లేదు. మినుము దిగుబడి తగ్గినా మద్దతు ధర రాని పరిస్థితి. వరికి మద్దతు ధర రూ.1500 అయితే, ఇప్పుడు కనీసం రూ.1200 కూడా ఇవ్వడం లేదు.
వచ్చే ఎన్నికల్లో మనకు ఎలాంటి నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించాలి. నాలుగేళ్ల చంద్రబాబు పాలన.. వైఎస్‌ఆర్ పాలన చూశారు. రైతు రుణాలు, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట తప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. నోటీసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. రుణాలన్ని మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబును మోసగాడు అనాలా?. 420 అనాలా? చంద్రబాబు పాలనలో కన్నీరు పెట్టని మహిళ ఉందా?. ఒక్క రూపాయి కూడా అక్కాచెల్లెమ్మలకు మాఫీ కాలేదు. ఇప్పటివరకూ ఒక్క ఇల్లు కట్టలేదు. కానీ ఏడాదిలో 10 లక్షల ఇళ్లు కడతాడట.
గెలవడానికి చంద్రబాబు ఎవరినైనా వెన్నుపోటు పొడస‍్తాడు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి కింద ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.96వేలు బకాయిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని కులాలకు అనేక హామీలిచ్చి, ఇప్పుడు గాలికొదిలేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని అంటాడు. కేజీ బంగారంతో పాటు బెంజ్‌కారు కూడా ఇస్తా అంటాడు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి.
ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రాజీనామా చేసి ఇంటికి పోయే వ్యవస్థ రావాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే...రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందే. హోదాతోనే పరిశ్రమలు వస్తాయి. స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతాయి. రాష్ట్రానికి చెందిన 25మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఎంపీలందరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది.
మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలను తీసుకొస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. వైఎస్‌ఆర్ పేదల కోసం ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకు వేస్తా. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత అప్పుంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వడ్డీ లేకుండా రుణాలిస్తాం. అవ్వా,తాతలకు పెన్షన్ వయస్సును 65 నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తాం. వారికి నెలకు రెండువేలు పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్. నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment