
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. వైఎస్ జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో(బుధవారం) ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు.పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.
గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా దుశ్చర్యలు చేయబోతున్నారని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు. స్వామి వారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం చంద్రబాబు అలవాటేనని విమర్శించారు. యాత్ర అనంతరం వైఎస్ జగన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారని వివరించారు. ఇదే అదనుగా వైఎస్ జగన్ పై దుష్ర్సచారం చేయించేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. దేవ దర్శనం సమయంలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దింపారని ఆరోపించారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు తెగించారని, ప్రజలే వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.