సాక్షి, పొన్నూరు (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతి రోజూ తాను కలలోకి వస్తున్నట్లు ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన గురించి వైఎస్ జగన్ చిన్న కథ చెప్పారు. ‘ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ రోజు మంచి జరగాలని కోరుకుంటాం. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి ఇలా అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా కోరుకోరు. ఉదయాన్నే లేచిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎలా మాట్లాడాలి? అని ఆయన ఆలోచిస్తారు.
అసెంబ్లీలో ప్రసంగ సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడరు. నోరు తెరిస్తే.. జగన్.. జగన్.. జగన్ అనే పేరునే ఆయన జపిస్తారు. బహుశా ప్రతిరోజు ఆయనకు కలలో కూడా నేను వస్తున్నానేమో అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. అసెంబ్లీలో ఆయన తీరు ఎలా ఉందంటే.. ఒక దొంగ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మరొకరిని దొంగా.. దొంగా.. అని అరుస్తున్నట్లు ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు అరుపుల తర్వాత మరునాడు ఉదయం ఆయనకు సంబంధించిన పేపర్లు, టీవీలు కూడా ఆయన మాదిరే దొంగా.. దొంగా అని అరుస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇదే జరుగుతోంది. చంద్రబాబు మాదిరిగా నీచ రాజకీయాలు చేసేవారిని ఏమనాలి?. సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచి.. చివరకు ఆయన ప్రాణాలు పోయే వరకూ వదిలిపెట్టలేదు చంద్రబాబు. కోట్లాది రూపాయల నల్లధనాన్ని పంచుతూ ఓట్లుకు నోట్లు ఇస్తూ దొరికిన బాబును ఏమంటారు?. రాష్ట్రాన్ని అవినీతి బారి నుంచి కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇసుక నుంచి మొదలు ఏది దొరికితే అది మేస్తున్న బాబును ఏమంటారు?.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కోక్కరికి రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. దగ్గరుండి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను ఎన్నికలకు తీసుకెళ్లే ధైర్యం లేక, గెలిపించుకునే సత్తా లేక రాజీనామాలు చేయించలేదు. ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి పాలనను బట్టి పరిపాలన బావుంటే బాగుందని చెప్తాం. ఆ పరిపాలన బాగోలేకపోతే ఎప్పుడెప్పుడు పోతాడా అని ఆశగా ఎదురుచూస్తాం.’
Comments
Please login to add a commentAdd a comment