‘సీన్‌ కట్‌.. యాక్షన్‌ అనగానే.. కళ్లలోంచి నీళ్లు కార్చారు’ | YS Jagan Slams Chandrababu At Ponnur Meet | Sakshi
Sakshi News home page

‘సీన్‌ కట్‌.. యాక్షన్‌ అనగానే.. కళ్లలోంచి నీళ్లు కార్చారు’

Published Wed, Mar 14 2018 6:41 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

YS Jagan Slams Chandrababu At Ponnur Meet - Sakshi

సాక్షి, పొన్నూరు (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్కార్‌ రేంజ్‌లో యాక్షన్‌ కట్‌ అనగానే.. కళ్లలోంచి నీళ్లు కార్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ఆయన ఎండగట్టారు.

ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వరట. హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించరట. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మరోవైపు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఇటీవల ప్రకటించిన 90 ఆస్కార్‌ అవార్డుల్లో పేపర్లు తిరగేస్తే చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించలేదు. ఇదేంటబ్బా అని ఆలోచిస్తే.. ఆస్కార్‌ను అందించేది విదేశీ సంస్థలు కాబట్టి వాళ్లు మన రాష్ట్రాన్ని గమనించలేదు. మన అసెంబ్లీలో చంద్రబాబు నడిపించిన డ్రామాను చూడలేదు.

ఆస్కార్‌ అవార్డును ప్రధానం చేసే స్థాయిలో అసెంబ్లీలో నటించారు చంద్రబాబు. సీన్‌ కట్‌.. యాక్షన్‌ అనగానే.. ఆయన కళ్లలోంచి నీరు కారినట్లు అద్భుతంగా నటించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను చంద్రబాబు అన్నివిధాలా మోసగించారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చి ఉంటే రాష్ట్రానికి ఇప్పటికే హోదా వచ్చి ఉండేది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను విడగొడుతూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది.

2014 జూన్‌ 2వ తేదీన కేంద్ర కేబినేట్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీర్మానాన్ని చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయిన ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఆమోద ఫైలు ప్లానింగ్‌ కమిషన్‌లో ఏడు నెలల పాటు అలానే పడి ఉంది. జూన్‌లో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కేంద్రంతో చంద్రబాబు హానీమూన్‌ను సాగిస్తూ.. హోదాను పట్టించుకోలేదు. కీలక సమయంలో హోదాను గురించి పట్టించుకోకుండా చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?

2015లో 14 వ ఆర్థిక సంఘ సూచనలు అమలులోకి వచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఒత్తిడి కనుక చేసి ఉంటే.. 13 వ ఆర్థిక సంఘ సూచనల్లో ఉన్న ప్రత్యేక హోదాను మనకు ప్రకటించేవారు. 14వ ఆర్థిక సంఘ సూచన్లో ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే సూచన ఎక్కడా లేదు. 13వ ఆర్థిక సంఘం హయాంలోనే హోదా ఫైలు ఆమోదం పొందిన విషయం వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వద్దని, ఇవ్వొద్దని కేంద్రం ప్రకటించేలా చేసింది చంద్రబాబే. కేంద్రం ఏం చెప్పినా ఆయన గంగిరెద్దులా తలకాయ అటూ ఇటూ ఊపారు.

తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటన హోదాకు అనుకూలంగా లేదని, తన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజానికి 2016 సెప్టెంబర్‌ 8న జైట్లీ అర్ధరాత్రి చేసిన ప్రకటనకు.. తాజా ప్రకటనకు మధ్య తేడా శూన్యం. ఆ రోజు అర్ధరాత్రి జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన విషయం వాస్తవం కాదా? ఆ మరునాడు అసెంబ్లీలో జైట్లీ, మోదీలను అభినందిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయలేదా?. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల్లో చెప్పిన ఈ పెద్ద మనిషికి.. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించానని చెప్పుకునే దమ్ముందా?

కరెంటు, పెట్రోల్‌, డీజిల్‌, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు ఇలా అన్ని తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తై నాలుగేళ్లు గడిచాయి. వీటన్నింటినీ పెంచకుండా తగ్గించానని చెప్పుకునే ధైర్యముందా బాబుకు? కనీసం వ్యవసాయానికి పగలు ఏడు గంటల కరెంటును కూడా అందించలేకపోవడం దారుణం. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఏటా 6 శాతం వృద్ధిరేటు సాధిస్తుండగా.. ఏపీ మాత్రం 12 శాతం గ్రోత్‌ రేటుతో పరుగులు పెడుతోందని చంద్రబాబు ఊదరగొట్టారు. ఒకవైపు చదువుకున్న పిల్లలు ఉద్యోగులు రాక పొరుగు రాష్ట్రాలకు వలసపోతుండగా.. విశాఖపట్టణంలో సదస్సులు పెట్టి వందల సంఖ్యలో ఒప్పందాలు జరిగాయని చెబుతూ.. సూటుబూటు వేసుకున్న.. అనామకులతో సంతకాలు చేయించారు.

దేశ తలసరి ఆదాయం కన్నా.. ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందంటూ చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? హోదా ఇవ్వకపోయినా రాష్ట్రం బాగుందన్న భావనను కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబే కల్పించాడు. టీడీపీ చేసిన ఈ రాజీనామాలేవో 2016 సెప్టెంబర్‌ 8న అరుణ్‌ జైట్లీ ప్రకటన అనంతరం చేసి ఉంటే ఇప్పటికి కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే నన్ను ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు అరెస్టు చేయించాడు. ప్రధాని మోదీ వస్తున్నారనే సాకుతో.. నా నిరాహార దీక్షను పోలీసులతో భగ్నం చేయించారు.

హోదా కోసం బంద్‌లు నిర్వహిస్తే.. చంద్రబాబు దగ్గరుండి బస్సులు నడిపించి.. వాటిని విఫలం చేసేందుకు ప్రయత్నించారు. హోదా కోసం యువభేరికి హాజరైన విద్యార్థులపై పీడీ యాక్టులు పెడతామని బెదిరించారు. ఇన్నిచేసి ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా నెపాన్ని వేయాలని చూస్తున్నారు. ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ ఒక్కటే అడుగుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి?

అబద్ధాలు చెప్పేవాళ్లు నాయకులుగా కావాలా? మోసాలు చేసేవాళ్లు.. నాయకులుగా కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి? ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయతకు అర్థాన్ని తీసుకురావాలంటే జగన్‌కు మీ అందరి మద్దతు కావాలి. పొన్నూరు నియోజకవర్గంలో పండిన పంటలకు కనీస మద్దతు ధర కరువు అవుతోంది. రబీ కాలంలో గుంటూరు జిల్లాలో మొక్కజొన్నను రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు చేస్తారు. అలాంటి పంటకు క్వింటాకు కనీసం రూ. 1150 కూడా అందడం లేదు. ఇందుకు కారణం రైతన్నల దగ్గర నుంచి దళారీల వద్దకు వెళ్లే వరకూ సరకు ధరలు తక్కువగా ఉంటున్నాయి.

ఆ తర్వాతి నుంచి సరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హెరీటేజ్‌ ఫుడ్స్‌ పేరుతో చంద్రబాబు ప్రారంభించిన కంపెనీ నుంచి సరకులను సాధరణ ధరలకు మూడు, నాలుగు రెట్లు అధికంగా అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద దళారీగా మారారు. కృష్ణా డెల్టాలో భాగమైన పొన్నూరు ప్రాంతంలో ఉన్న పురాతన కాలువలు మరమ్మతులకు నోచుకోలేదు. రైతన్నలకు చివరి ఎకరా వరకూ కూడా నీరు అందించేందుకు వైఎస్‌ఆర్‌ కృషి చేశారు.

పొన్నూరులో పేదవారికి 2,600 ఫ్లాట్లు కడుతున్నామని ప్రభుత్వం ఊదరగొడుతోంది. 3,600 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించే ఒక్కో ఫ్లాట్‌ను అక్షరాల ఆరు లక్షలకు అమ్ముతారట. జీ+3 బిల్డింగ్‌లకు లిఫ్ట్‌ లేకుండా ఫ్లాట్లు కడితే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి కాంట్రాక్టర్లను అడగండి. కనీసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చుకాని చదరపు అడుగుకు రూ. 2 వేలు చెల్లించాలని పేదలతో బాబు చెబుతున్నారు. ఇంటి నిమిత్తం ఖర్చు అయ్యే ఆరు లక్షల్లో మూడు లక్షలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. మిగిలిన రూ. 3 లక్షలను రుణంగా ఇచ్చి ఇరవై ఏళ్ల పాటు రూ. 3 వేల చొప్పున నెలనెలా కట్టమని పేదవాడికి చెబుతున్నారు.

రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలకు ఇప్పటివరకూ ఒక్క ఇటుకా పడలేదు. రాజధానిలో అసెంబ్లీ, ప్రభుత్వ భవనాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. రాజధానిలో కట్టడాల కోసం అడుగుకు రూ. 10 వేలు ఇచ్చారు చంద్రబాబు. ఇంతటి దారణ పరిపాలనను సాగిస్తున్న చంద్రబాబు.. త్వరలో ఎన్నికల ప్రచారానికి మీ వద్దకు వస్తారు. మళ్లీ అధికారాన్ని కట్టబెట్టాలని కోరతారు. అలవిగానీ, సాధ్యం కానీ హామీలతో గాలిలో మేడలు కడతారు. ఆయన చేస్తున్న వాగ్ధానాలను ప్రజలు నమ్మరని ఆయనకూ తెలుసు. అందుకే ఓటుకు రూ. 3 వేలు చేతిలో పెడతారు.

చాలదంటూ ఇంకా ఇవ్వండని రూ.5 వేలు లాగండి. అదంతా మన డబ్బే. చంద్రబాబు మనందరి నుంచి దాన్ని దోచేశారు. కానీ ఓట్లు వేసేప్పుడు మనస్సాక్షిని నమ్మి వేయండి. అబద్దాలు చెప్పే వాళ్లను, మోసగించే వాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. రేపొద్దున మీ ఆశీర్వదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని నింపుతాం.

పేదవాడి చదువు కోసం..
పేద బిడ్డలు డాక్టర్‌, ఇంజనీరింగ్‌ చదువులు చదవాలంటే తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. ఏళ్ల పాటు చదువుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. ఒక్కసారి ఆ దివంగత నేత వైఎస్‌ఆర్‌ పాలనను గుర్తు తెచ్చుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు ప్రేమ అంటారు చంద్రబాబు. ఆయన ప్రేమ నాలుగు కత్తెరలకు మాత్రమే పరిమితం. నిజంగా బీసీల మీద ప్రేమను చూపించింది వైఎస్‌ఆరే.

పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్‌, ఇంజనీర్‌, కలెక్టర్‌ అయినప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తారని నాన్నగారు బలంగా నమ్మారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్కసారి పరిస్థితిని గుర్తు చేసుకోండి. మన పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్‌ చేయాలంటే భారీగా ఖర్చు అవుతోంది.

ప్రతి పేదవాడికి చెబుతున్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకేశారు. జగన్‌ పేదవాడి కోసం రెండు అడుగులు ముందు వేస్తాడని చెబుతున్నా. మీ పిల్లల్ని వారికి నచ్చిన చదువులు చదివించండి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరించేలా చేస్తాను. పిల్లలు చదువుకునే సమయంలో మెస్‌ చార్జీలకు కూడా ప్రభుత్వమే ఏడాదికి రూ. 20 వేలు ఇస్తుంది.

పిల్లలు ఇంజనీరింగ్‌ వంటి పెద్ద చదువులు చదవాలంటే పునాదుల నుంచి చదువులు బలంగా ఉండాలి. పిల్లలను బడులకు పంపించండని ప్రతి తల్లిని కోరుతున్నా. అలా పంపినందుకు ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. 2011 సెన్సెస్‌ ప్రకారం.. 32 శాతం మంది నిరక్షరాస్యులు రాష్ట్రంలో ఉన్నారు. వారందరినీ చదువుకు చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నవరత్నాల్లో మార్పులు, చేర్పులకు మీరు సలహాలు ఇవ్వండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement