పాదయాత్రగా వచ్చిన వైఎస్ జVýæన్‌మోహన్‌రెడ్డికి హారతి ఇస్తున్న మహిళలు (ఫైల్)
మరో రెండు రోజుల్లో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి‘ప్రజాసంకల్పయాత్ర’ ముగియనుంది. ఇంకో మూడునెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా సాగిన పాదయాత్ర ముగింపునకు చేరిన నేపథ్యంలో పాదయాత్రకు ముందు, తర్వాత రాజకీయపరిస్థితులు ఎలా మారాయి...? ఏ పార్టీవైపు ప్రజలు ఉన్నారు..? ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు...? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ క్రమంలో ‘అనంత’లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ముందు పరిస్థితి, పాదయాత్ర జరిగిన తీరు, ఆపై మారిన రాజకీయపరిస్థితులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
సాక్షిప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక ఓటుబ్యాంకు ఉన్న రెండు వర్గాలను ప్రభావితం చేసేందుకు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో రైతులు, మహిళలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇచ్చే వరకూ నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు కూడా ఆకర్షితులయ్యారు. ఇలాంటి అలవిగాని హామీలు ఎన్నో ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి అన్ని వర్గాలనూ మోసం చేశారు. రైతులకు ఇప్పటి వరకూ తెలీని ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను తెరపైకి తెచ్చి అరకొర రుణమాఫీ చేశారు. డ్వాక్రా సంఘాలకురుణమాఫీని పూర్తిగా విస్మరించారు. దీంతో ప్రభుత్వ తీరుతో మోసపోయామని అన్ని వర్గాలు గ్రహించాయి. ముఖ్యంగా వరుస కరువుతో ఏటా కుదేలవుతున్న ‘అనంత’రైతులు రుణమాఫీపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకునే జిల్లా కావడంతో అప్పులు మాఫీ అయితే అంతకంటే ఇంకేంకావాలి? అని ఆశపడ్డారు. జిల్లాలో 2 ఎంపీస్థానాలతో పాటు 12 అసెంబ్లీ, 10 మున్సిపాలిటీల్లో టీడీపీని గెలిపించారు. కానీ ప్రభుత్వం చిల్లర విదిల్చి వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ అమలు చేయడంతో ‘చంద్రబాబు ప్రభుత్వం’చేతిలో మోసపోయామని గ్రహించారు.
‘యాత్ర’తర్వాత భారీగా చేరికలు
పాదయాత్ర తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో ‘అనంత’లో జేసీ పూర్తిగా పట్టుకోల్పోయారు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురం నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన కడపల శ్రీకాంత్‌రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. రాయదుర్గంలో ముల్లంగి బ్రదర్స్, పెనుకొండలో పలువురు మాజీ సర్పంచ్‌లు వైఎస్సార్‌సీపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటన్నారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో ప్రతీ మండలం నుంచి భారీగా వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాప్తాడులో పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు వేపకుంట రాజన్న కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక తాడిపత్రిలో జేసీని వ్యతిరేకిస్తూ టీడీపీని కాపాడుతూ వచ్చిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, గుత్తా వెంకటనాయుడు, ఫయాజ్‌బాషా లాంటి గట్టి లీడర్లు టీడీపీకి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతున్నాయి. దీనికి తోడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు సాగించిన అవినీతిపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చి ఎన్నికల్లో డబ్బులు వెదజల్లాలనుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. పత్రికల్లో కూడా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు సాగించిన అవినీతికాండపై ససాక్ష్యాలతో కథనాలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు నేతలపై కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. ఇవన్నీ కూడా వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారాయి. ఈ అంశాలపైనే హోటళ్లు, రచ్చకట్టలతో పాటు ఎక్కడ నలుగురు గుమికూడినా చర్చ సాగిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే 2014తో పోలిస్తే ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది.
రుణమాఫీ మోసంపై నిలదీసిన విపక్షనేత
రుణమాఫీ చేస్తామని మాట తప్పడంతో అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారని, ఇది దారుణమని విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో సర్కారును నిలదీశారు. ఆత్మహత్యలు జరగలేదని ప్రభుత్వం బుకాయించగా... ‘‘రైతు భరోసాయాత్ర’’ పేరుతో ఒక్క ‘అనంత’లోనే ఐదు విడతల్లో ఆత్మహత్య చేసుకున్న 83 మంది రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. నేటికి ఆ సంఖ్య 264కు చేరింది. ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. అప్పట్లో ‘భరోసాయాత్ర’పేరుతో నెలరోజులు జిల్లాలో గడిపారు. ప్రభుత్వాన్ని దాదాపు నాలుగేళ్లపాటు నిలదీసి హామీలు అమలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎంత ఒత్తిడి తెచ్చినా సర్కారులో చలనం లేకపోవడంతో 2017లో పాదయాత్రకు ఉపక్రమించారు. డిసెంబర్ 4 జిల్లాలో ప్రవేశించిన ప్రజాసంకల్ప పాదయాత్ర 25 రోజుల పాటు 278.6 కిలోమీటర్లు మేర సాగింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో 15 మండలాల్లోని జగన్ నడిచారు.
అప్పటికే ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదనే అభిప్రాయంలో ఉన్న ‘అనంత’వాసులు...జగన్ రాకను పెద్ద ఎత్తున స్వాగతించారు. పల్లెపల్లెనా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు జగన్‌కు స్వాగతం పలకగా.....వారి కష్టాలన్నీ విన్న జననేత వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. రాజకీయంగా ఏ వర్గాలు వెనుకబడ్డాయి..? ఎవరికి అన్యాయం జరుగుతోందనేది గ్రహించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ‘అనంత’, కర్నూలు జిల్లాల నుంచి బోయ సామాజికవర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థిని నిలబెడతానన్నారు. శాలివాహనులు, రజకులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని మరో జిల్లాలో పర్యటించారు. ముస్లింలు, చేనేతలు, కురబలు ఇలా వెనుకబడిన అన్ని వర్గాల సమస్యలను ఆలకించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపట్ల జగన్ స్పందించిన తీరుతో... ప్రజలంతా ఆయన అభిమానులుగా మారారు. జగన్ కష్టపడే తత్వం, ఇచ్చిన మాటను నిలుపుకోవాలనే నైజం, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో లబ్ధిపొందిన వైనం.. వెరసి ప్రజాసేవకుడే రాష్ట్రనాయకుడు కావాలని ప్రజలంతా జగన్‌వైపు మొగ్గు చూపారు. ఒక్క అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment