ఆయన.. ప్రజాహితుడు..ప్రజల సంక్షేమం కోరే పథకుడు..జన సంకల్పానికి నిలువెత్తు రూపం..మహానేత రాజన్న ప్రతిరూపం..అభ్యాగులకు అభయం..అంతకంతకూ పెరుగుతోన్న ప్రజాభిమానంఅధికార పార్టీకదే అసహనంఅందుకే హత్యాయత్నం.. ఆగిన ప్రజాసంకల్పం..‘అనంత’లో పెల్లుబుకుతోంది ఆవేశంత్వరగా కోలుకోవాలనేది అందరి అభిమతంనాటి పాదయాత్రను తలచుకుంటోంది అభిమానగణంసంకల్పం నెరవేరాలని కోరుతోంది ప్రతి హృదయం.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎండనక.. వాననక... అలుపెరుగక.. జనమే కుటుంబంగా.. ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్ప యాత్ర’కు నేటికి సరిగ్గా ఏడాది. అయితే ఇటీవల కొంతమంది చేసిన కుట్రలతో పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రజల కోసం చేపట్టిన ఈ పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని ‘అనంత’ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొందర్లోనే కోలుకుని తిరిగియాత్ర ప్రారంభించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కాంక్షిస్తున్నారు. ‘అనంత’లో 24 రోజుల పాటు సాగిన జననేత పాదయాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
మనవడు.. మంచికోరే వాడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది వైఎస్సార్ జిల్లా అయినప్పటికీ ‘అనంత’తో ఆయనకున్న అనుబంధం ఎనలేనిది. ‘అనంత’ మనవడే కాదు.. జిల్లా సమస్యలను ఆకళింపు చేసుకున్న జననేత. అందుకే ‘నేనున్నానని’ భరోసానిచ్చారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసిన ఆయన ఇక్కడి రైతుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు దన్నుగా నిలవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఆత్మహత్యలు బూటకమని వ్యాఖ్యానించిన సీఎంకు వాస్తవాలను చూపించేందుకు ‘రైతుభరోసా యాత్ర’ చేపట్టారు. 5 విడతల్లో 32 రోజుల పాటు 82 రైతు కుటుంబాలను పరామర్శించారు. దేశచరిత్రలో ఓ రాజకీయనేత చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతన్నల ఇళ్లకే వెళ్లి బాధితులకు భరోసానిచ్చారు. ఆపై పాదయాత్ర పేరుతో మరో 24 రోజులు జిల్లాలో గడిపారు. ఇందులో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లోని 176 గ్రామాల్లో 278.6 కిలోమీటర్లు యాత్ర చేశారు.
అనుకోని ముప్పుతో ఆగిన యాత్ర
‘అనంత’లో జగన్ అడుగిడిన 176 గ్రామాల్లో మహిళలు హారతిపట్టి, దిష్టితీసి, విజయ తిలకం దిద్ది ‘విజయోస్తు’ అని దీవించారు. యాత్రలో వేలాదిమంది మధ్య సాధారణ వ్యక్తిలాగా తిరిగేవాడు. ఎక్కడా, ఎవ్వరూ, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే నడిచే నమ్మకంలా...ప్రేమను పంచే శిఖరంలా...ఇంట్లో అన్నలా...ఆత్మబంధువులా కన్పిస్తారు. జగన్ ఆహార్యాన్ని చూస్తే శత్రువు కూడా ప్రేమిస్తాడు. అందుకే ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగలేదు. కానీ పక్కా ప్రణాళికతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో జగన్‌ను మట్టుపెట్టేందుకు హత్యాయత్నం చేయించారు. ఈ ఘటన యావత్ రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన జగన్‌మోహన్‌రెడ్డి.. గాయం మానేవరకూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నేటితో యాత్ర ఏడాదికి చేరుతున్న సందర్భంలో ‘అనంత’ గుండెలు జగన్‌ను తలుచుకుంటున్నాయి. ఆయన చూపిన ప్రేమ.. పంచిన ఆప్యాయత.. ఇచ్చిన భరోసాను గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. జనహితం కోసం కష్టపడుతూ పాదయాత్ర చేస్తుంటే...ఆయన్ను చంపాలనుకున్నారా దుర్మార్గులు’ అని ఒకరు.. ‘జనాదరణ చూసి ఓర్వలేక పథకం ప్రకారం హత్యకు కుట్రపన్నారు.. అలాంటి వారి పాపం పండుతుంది’ అని మరొకరు వేదన పడుతున్నారు...కారకులపై మండిపడుతున్నారు. తుదిగా దేవుడి దయతో తొందరల్లోనే కోలుకుని తిరిగి ప్రజల్లోకి వచ్చి యాత్ర చేయాలని కాంక్షిస్తున్నారు.
స్వయంగా చూసి.. చలించి
‘ఓదార్పుయాత్ర’తో వైఎస్ రాజశేఖరరెడ్డిని.. ఆయన కుటుంబాన్ని ‘అనంత’ ఎలా ఆదరిస్తుందో పల్లెగడపలు తొక్కి తెలుసుకున్నారు. పదిమందికి అన్నంపెట్టే అన్నదాతలు.. తాము పస్తుండి ఎలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారో.. ఓ విపక్షనేతగా ‘రైతు భరోసా యాత్ర’తో వాస్తవాలను తెలుసుకుని చలించిపోయారు. ప్రభుత్వ మోసపూరిత మాటలతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ముసలీ ముతక అనే తేడా లేకుండా అన్ని వర్గాలు దగాపడిన తీరును.. తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలను ‘ప్రజాసంకల్పయాత్ర’లో అర్థం చేసుకున్నారు. అందుకే అనంత ప్రజానీకం ఆయన పట్ల అంత అభిమానం చూపుతోంది.
రూ.కోట్లు పెట్టినా కొనలేని అభిమానం
ప్రజాసంకల్పయాత్ర వాస్తవానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగలేదు. కానీ అక్కడున్న వారంతా ఎక్కడోచోట జగన్‌మోహన్‌రెడ్డిని చూసి సంబరపడ్డారు. రాజన్న బిడ్డను కళ్లారా చూసి దీవించారు. ఈ క్రమంలోనే కుందుర్పికి చెందిన ఇద్దరు మహిళా కూలీలు కదిరి వరకూ వచ్చి జగన్‌ను కలిసి చేతిలో ఓ మూటపెట్టారు. ‘అన్నా! రోజు కూలికి వెళ్లి కొంత చిల్లర పోగు చేశాం. మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. తీసుకో అన్నా’ అన్నారు. రూ.కోట్లు కుమ్మరించినా కొనలేని వీరి అభిమానానికి జగన్ కళ్లు చెమర్చాయి. ఇలాంటి అభిమాన, అనుభవాల మూటలెన్నిటినో ఇక్కడి నుంచి విజయం నగరం దాకా తనతో తీసుకెళ్లారు అలుపెరుగని బాటసారి.
Comments
Please login to add a commentAdd a comment