హత్యకు కుట్ర.. ఆగ్రహిస్తున్న జనం ప్రజా సమస్యలే అజెండాగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండనకా..వాననకా, చలి అనకా పాదయాత్ర సాగిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలను నేరుగా కలుసుకుని.. వారి బాగోగులను తెలుసుకుంటున్నారు. ప్రతిచోట భారీగా జనం వస్తుండడంతో ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన యాత్ర ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. విశేష ప్రజాదరణ చూసి ఓర్వలేక జననేతను అంతమొందించడానికి కుట్ర పన్నారు. అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తి కాదని, ఒక శక్తి అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ అధికార పార్టీ పన్నాగాలపై ప్రజలు మండిపడుతున్నారు. ఉక్కు సంకల్పంతో పాదయాత్రను కొనసాగించేందుకు సన్నద్ధమవుతున్న జననేతకు జనం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నాయకుడంటే...జనం గుండెచప్పుడు వినాలి. వారిలో ఒకడిలా మెలగాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా వారి కోసమే నిలబడాలి. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రజాశ్రేయస్సునే కాంక్షించాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నాయకులు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజా సమస్యలే అజెండాగా ఆయన అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ఉక్కు ‘సంకల్పం’తో ముందుకు సాగుతున్నారు. జనం కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారి సంక్షేమాన్ని విస్మరించిన పాలకులకు కనువిప్పు కల్గించడానికి ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి(మంగళవారం)తో సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 3,211 కిలోమీటర్ల మేర కొనసాగింది. కర్నూలు జిల్లాలో గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు 18 రోజుల పాటు 263 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.
జనంతో మమేకం.. కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 14వ తేదీ ప్రారంభమై డిసెంబర్ మూడో తేదీ వరకు ఏడు నియోజకవర్గాల్లో కొనసాగింది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో జననేత పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడికక్కడ పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి చెప్పుకొని ఉపశమనం పొందారు. ప్రజాకంఠక టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడానికి మహిళలు, వృద్ధులు, అన్నదాతలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కూలీలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
జిల్లాకు బాసటగా జననేత హామీలు
ప్రస్తుత పాలనలో జిల్లా అభివృద్ధి పదేళ్లు వెనక్కి పోయిందని ప్రజలు భావిస్తున్నారు. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే పనులపై పూర్తి సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని నమ్ముతున్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి జననేత ఇచ్చిన హామీలతో పాటు ‘నవరత్నాలు’ ఎంతగానో తోడ్పతాయని అంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సత్వరమే చర్యలు తీసుకుంటామని, నాపరాయి పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు మూడు టీఎంసీలను తీసుకెళ్లాలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కోడుమూరు తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎస్‌ట్యాంకు నిర్మాణం, ఎమ్మిగనూరులో చేనేతలకు బాసటగా క్లస్టర్ పార్కు ఏర్పాటు, హంద్రీనదిపై గోరంట్ల– ఎర్రగుడి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం, మండలాలకో కోల్డ్ స్టోరేజీ తదితర హామీలను ఇచ్చారు. వీటితో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి భరోసా ఇచ్చారు.
చంపేందుకు కుట్ర పన్నారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కచ్చితంగా చంపాలనే కుట్ర పన్నారు. దేవుడి దయతో ఆయన బయటపడ్డారు. సీఎం చంద్రబాబు దారుణంగా తయారయ్యారు. వైఎస్ జగన్‌పై అభిమానే దాడి చేశారని చెప్పడం ఘోరం. ఎక్కడైనా అభిమానులు చంపుతారా? ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అభిమానులకు ప్రేమను పంచడం తప్పా ద్వేషించడం తెలియదు. ఈ కేసు నుంచి టీడీపీ పెద్దలు బయట పడడానికే అభిమాని నాటకం ఆడుతున్నారు. – విజయలక్ష్మీ, రిటైర్డ్ లెక్చరర్, మద్దూర్ నగర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment