సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు పాలనలో సమస్యలు పరిష్కారం కాక అష్టకష్టాలు పడుతున్న జనం సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడాన్ని పార్టీల కతీతంగా జనం ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండిచక పోవడాన్ని తప్పు పడుతున్నారు. అందుకే ఇది ప్రభుత్వం చేయించిన చర్యే అన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఇక తమ అధినేతపై హత్యాయత్నం జరగడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించమన్నందుకు ఇంతటి దురాగతానికి పాల్పడతారా.. ఏకంగా ప్రతిపక్ష నేతనే అంతమొందించే కుట్రకు దిగుతారా అంటూ మండి పడుతున్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమై నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా యాత్ర సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. ఆయనపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగాఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు.
గత ఏడాది నవంబర్ 6న వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర కర్నూలు, అనంతపురం,చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా,పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం వరకూ సాగింది. మంగళవారంతో యాత్ర ప్రారంభమై సరిగ్గా ఏడాది అవుతుంది. ప్రకాశం జిల్లాలో 22 రోజులపాటు జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగింది. ఈ యాత్రకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజలు స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. దివంగత నేత వైఎస్ పాలనలో వైఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను నేతలు, ప్రజలు జగన్ కు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో వరుస కరువులను ఏకరువు పెట్టారు. సాగు,తాగునీరందక పడుతున్న ఇబ్బందులను చెప్పారు. గిట్టు బాటు దరలు లేవన్నారు. దివంగత నేత చేసిన ప్రాజెక్టు పనులుతప్ప బాబు ఏమీ చేయలేదన్నారు.సంక్షేమ ఫలాలు అధికారపార్టీ కార్యకర్తలకు తప్ప అర్హులకు అందలేదన్నారు. అన్ని కష్టాలను జగన్ ముందుంచారు. వైఎస్ జగన్ అందరి కష్టాలను విన్నారు. అడుగడుగునా జనం కన్నీళ్లు తుడిచారు.
నున్నానంటూ భరోషా ఇచ్చారు. అందరి దయతో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. జగన్ హామీలపై జనానికి నమ్మకం పెరిగింది. జగన్ యాత్ర ఇంకా జిల్లా వాసుల కళ్లముందు మెదులుతునే ఉంది. ఇంతలో గత నెల 25న జగన్ పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది.శ్రీనివాసరావు అనే యువకుడు ఏకంగా విమానాశ్రయంలోనే జగన్ పై దాడికి దిగి కత్తితో పొడిచాడు. ప్రమాదం తృటిలో తప్పింది. ఈ వార్తతో పార్టీ శ్రేణులతో పాటు జనం హతాశులయ్యారు. కన్నీటి పర్యంత మయ్యారు. తమ నేతను అంతమొందించే కుట్రకు దిగడాన్ని సహించ లేకున్నారు. ముఖ్యమంత్రి తో సహ అధికారపార్టీ పై మండి పడుతున్నారు. సర్వత్నా హత్యాయత్నాన్ని ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా వాసులు జగన్ పాదయాత్ర,ఆయన ఇచ్చిన భరోసా ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ప్రకాశంలో 278.1 కి.మీ యాత్ర..
2018 ఫిబ్రవరి 16న జగన్ ప్రజా సంకల్ప యాత్ర కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మండలం కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. తొలిరోజు యాత్ర 1200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ రామకృష్ణాపురం వద్ద మొక్కను నాటి వాకమళ్లవారిపపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్ధంకి, పర్చూరు, చీరాల 9 నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలు, 124 గ్రామాల గుండా 22 రోజుల పాటు 278.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మార్చి 12 ఉదయం∙యాత్ర బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొండపి నియోజక వర్గంలో రైతు సదస్సు నిర్వహించగా మిగిలిన 8 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు.
⇔ తొలిరోజు కందుకూరు నియోజకవర్గ ప్రజలు రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్ దృష్టికి తెచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ, సోమశిల ఉత్తర కాలువ నిర్మాణం పూర్తి అయితే తాగు, సాగునీరు లభిస్తుందని తెలిపారు.
⇔ కొండపి నియోజకవర్గంలో పొగాకు రైతులు, పాడి రైతులు తమ బాధలను జగన్ ముందు ఏకరువు పెట్టారు. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న ఒంగోలు డైయిరీ రైతులను వంచించిందని వాపోయారు.
⇔ సురక్షిత తాగునీరు అందక ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలు జగన్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. దివంగత నేత వైఎస్ ఇచ్చిన సాగర్ జలాలే దిక్కయ్యాయన్నారు.
⇔ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీరు అందక అష్ట కష్టాలు పడుతున్నామని మార్కాపురం ప్రాంత వాసులు జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు. వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు 65 శాతం పూర్తి అయితే చంద్రబాబు పాలనలో 10 శాతం పనులు కూడా చేయలేదని ఆరోపించారు.
⇔ ప్రభుత్వం జీఎస్‌టీ, విద్యుత్ ఛార్జీలు పెంచడంతో గ్రానైట్ పరిశ్రమలు నిర్వీర్యమైనాయని చీమకుర్తి ప్రాంతానికి చెందిన గ్రానైట్ వ్యాపారులు జగన్‌కు తమ కష్టాలను చెప్పుకున్నారు. వైఎస్ కట్టిన రామతీర్థం ప్రాజెక్టు వల్లే గుక్కెడు నీళ్లు దొరుకుతున్నాయని చెప్పుకున్నారు.
⇔ చంద్రబాబు సర్కారు చెప్పినట్లు దొనకొండలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికి ఉద్యోగం రాలేదని దర్శి ప్రాంత ప్రజలు జగన్ దృష్టికి తెచ్చారు.
⇔ వైఎస్ హయాంలో భవనాసి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు నిధులు కేటాయించగా ఆయన మరణంతో పనులు నిలిచి పోయాయని, చంద్రబాబు దానిని పట్టించుకోలేదని అద్ధంకి వాసులు జగన్ దృష్టికి తెచ్చారు.
⇔ అధికార పార్టీ నేతలు పేదల భూములను, స్థలాలను కబ్జా చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పర్చూరు ప్రాంత వాసులు జగన్ దృష్టికి తెచ్చారు.
⇔ చేనేతల కష్టాలతో పాటు కాల్వల ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నామని చీరాల ప్రాంతవాసులు జగన్ దృష్టికి తెచ్చారు. తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
జిల్లాలో మైలురాళ్లు
⇔ తొలిరోజు యాత్ర 1200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ రామకృష్ణాపురం వద్ద మొక్కను నాటి వాకమళ్లవారిపపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
⇔ 1300 కిలోమీటర్లు యాత్ర పూర్తి అయిన సందర్భంగా నందమారెళ్ల వద్ద జగన్ మొక్కను నాటారు.
⇔ వైఎస్ జగన్ పాదయాత్ర 100వ రోజు సందర్భంగా చీమకుర్తిలో భారీ పైలాన్‌తో పాటు వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
⇔ మార్చి 3వ తేదిన దర్శి నియోజకవర్గంలోని కొర్రపాటివారిపాలెం క్రాస్ వద్ద జగన్ ఢిల్లీ ప్రత్యేక హోదా ధర్నాకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వాహన శ్రేణికి జెండా ఊపారు.
⇔ చివరి రోజు మార్చి 12న చీరాల నియోజకవర్గం ఈపూరుపాలెం వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment