బహుళ ప్రయోజనాల సుభాని స్ప్రేయర్‌ | Multi-purpose subhani sprayer | Sakshi
Sakshi News home page

బహుళ ప్రయోజనాల సుభాని స్ప్రేయర్‌

Published Tue, May 30 2017 3:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

బహుళ ప్రయోజనాల సుభాని స్ప్రేయర్‌

బహుళ ప్రయోజనాల సుభాని స్ప్రేయర్‌

► అరగంటకు ఎకరం పండ్ల తోటలో పిచికారీ
► 10 అడుగుల ఎత్తున్న చెట్లపైకి, జీవామృతం, ద్రావణాలు పిచికారీ
►   చెట్ల పాదుల్లో నీరు పోసేందుకు..
►  రెయిన్‌ గన్‌లా తుంపర సేద్యానికి కూడా వాడుకోచ్చు


ట్రాక్టర్‌ హయ్యర్‌ బ్లాస్ట్, ఎయిర్‌ బ్లాస్ట్‌ స్ప్రేయర్లతో జీవామృతం, కషాయాలు, పురుగు మందులు పిచికారీ చేయడంలో పండ్ల    తోటల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహుళ ప్రయెజనాలను నెరవేర్చే స్ప్రేయర్‌ను రూపొందించడం ద్వారా వీరి  ఇబ్బందులకు రైతు శాస్త్రవేత్త సయ్యద్‌ సుభానీ చక్కని పరిష్కారం చూపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవవారిపాలెం ఆయన స్వగ్రామం.

డ్రైవరొక్కడు చాలు.. కూలీల అవసరం లేదు
దానిమ్మ నిమ్మ, బత్తాయి వంటి పండ్ల తోటల్లో సులభంగా శ్రమ లేకుండా.. కూలీల అవసరం లేకుండా.. డ్రైవర్‌ ఒక్కడే మందులు పిచికారీ చేసుకునేలా రూపొందించారు. ఒక్కసారి ట్యాంకరులో మందు ద్రావణం కలిపి స్ప్రేయర్‌ను స్టార్ట్‌ చేస్తే చాలు.. ట్యాంకరు వెనుక భాగంలో అమర్చిన గన్నులే నిర్దేశిత దిశలో తగు మోతాదులో మందును పిచికారీ చేస్తాయి. ఈ స్ప్రేయర్‌ ద్వారా పండ్లతోటలు, మెట్లపైర్లలో సులభంగా జీవామృతాన్ని లేదా మందు ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు.

పండ్లతోటలు.. మెట్ట పైర్లు..పిచికారీ సులభం..
ప్రకృతి సేద్యం చేసే రైతులు జీవామృతం, కషాయాలను ఈ యంత్రం సహాయంతో  ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా పిచికారీ చేయవచ్చు. ఒక మనిషి ఈ యంత్రం సహాయంతో రోజుకు 50 ఎకరాల  మెట్ట పైర్ల పైన.. 30 ఎకరాల పండ్ల తోటల్లోను సునాయాసంగా మందులు పిచికారీ చేసుకోవచ్చని సుభానీ తెలిపారు. సంప్రదాయ స్ప్రేయర్ల కన్నా అధిక పీడనంతో మందును పిచికారీ చేయటం వల్ల కొమ్మలు, ఆకులు పూర్తిగా తడుస్తాయి. 10 అడుగుల ఎత్తు వరకు మందులను పిచికారీ చేసి చెట్ల తలకొమ్మలను మందు ద్రావణంతో పూర్తిగా తడపగల సామర్థ్యం దీని సొంతం. కావాలంటే దీన్ని 20 అడుగుల వరకు పెంచుకోవచ్చు.  

పత్తి, మిర్చి, శనగ, కంది వంటి మెట్ట పైర్లలోనూ మందు ద్రావణాన్ని లేదా జీవామృతాన్ని పిచికారీ చేయవచ్చు. ముఖ్యంగా పండ్లతోటల రైతులకు కూలీల అవసరం, శ్రమ తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది. సకాలంలో పిచికారీ పూర్తవుతుంది. 600 పీఎస్‌ఐ సామర్థ్యం గల కంప్రెషర్, పుల్లీలు, బెల్ట్‌లు, డెలివరీ పైపులు, నాజిళ్లూ, షూటర్‌ నాజిళ్లు, జింక్‌పైపులు, యాంగ్లేర్లు, చానల్స్‌ను ఈ పిచికారీ యంత్రం తయారీలో వాడారు. కంప్రెషర్‌ను ట్రాక్టర్‌ ఇంజిన్‌ పీటీఓ సాఫ్ట్‌కు పుల్లీల ద్వారా అనుసంధానం చేస్తారు. నీటి ట్యాంకరుకు ఇరువైపులా 15 అడుగుల పొడవైన రెక్కలను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్‌ స్టార్ట్‌ చేయగానే కంప్రెషర్‌ కూడా పనిచేయటం మొదలవుతుంది.

మూడు పిస్టన్లు ట్యాంకు నుంచి మందు ద్రావణాన్ని తోడి ప్రెజర్‌తో మందును పిచికారీ చేసే రెక్కల్లోకి సరఫరా చేస్తాయి. ట్యాంకులో ఉండే ఫుట్‌బాల్‌కు పైనా కింద షూటర్‌ నాజిళ్లు ఉంటాయి. ఇవి నలకలు రాకుండా నిరోధిస్తాయి. ట్యాంకరుకు ఇరుపక్కల ఉండే రెక్కలు నాజిళ్ల ద్వారా చెట్లపైకి మందును పిచికారీ చేస్తాయి. పుల్లీలను మార్చటం ద్వారా కంప్రెషర్‌ మందు పిచికారీ చేసే వేగాన్ని పెంచటం తగ్గించటం చేయవచ్చు.

పండ్ల తోటల్లో చెట్ల వరుసల మధ్య ఉండే దూరం పొలానికి పొలానికి మారుతుంది. అలాంటపుపడు చెట్ల మధ్య దూరాన్ని బట్టి ట్రాక్టరుకు ఇరువైపులా ఉండే రెక్కలకు పంపు నాజిళ్లను అమర్చుకుంటే చాలు. దానికి తగినట్టుగా కంప్రెషర్‌  వేగాన్ని తగ్గించటం పెంచటం చేయవచ్చు. పండ్ల తోటల్లో ట్రాక్టరుకు రెండు వైపులా కలిపి 36 అడుగుల దూరం వరకు, మెట్ట పైర్లలో 50 అడుగుల దూరం వరకు పిచికారీ చేస్తుంది. చెట్ల ఎత్తును బట్టి రెక్కలకు నాజిళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

చిన్న మొక్కలకు ఒక నాజిల్‌ వాడితే పదడుగులు పెరిగిన చెట్టుకు నాలుగు నాజిళ్లు వాడతారు. దీని తయారీకి రూ. 75 వేలు ఖర్చయినట్టు సుభానీ తెలిపారు. రెయిన్‌ గన్‌లా ఉపయోగించవచ్చు. నాజిళ్లు మార్చుకుంటే చాలు తుంపర సేద్యం చేయవచ్చు. నీరు తుంపర్లుగా పొలం అంతటా సమానంగా పడుతుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పందివానిపల్లె గ్రామానికి చెందిన బత్తుల నారాయణ రెడ్డి 50 ఎకరాల పండ్ల తోటలో ఈ స్ప్రేయర్‌ను విజయవంతంగా వాడి చూశారు.– షేక్‌ నూరుద్దీన్, సాక్షి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

పండ్ల తోట రైతుల కోసమే తయారు చేశా...
ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న స్ప్రేయర్లు పండ్లతోటలకు అంతగా సూటు గా లేవు. పల్లె సృజన సౌజన్యంతో గతంలో నేను తయారు చేసిన స్ప్రేయర్‌ను అభివృద్ధి చేసి దీన్ని రూపొందించాను.  రైతులకు శ్రమ తగ్గాలి.. ఖర్చు ఆదా కావాలనే ఈ స్ప్రేయర్‌ను తయారు చేశా. ఎల్తైన చెట్లు ఉన్నా సులభంగా పిచికారీ చేసుకోవచ్చు.  కావాలంటే 10 రోజుల్లో తయారు చేసి ఇస్తా.
– సుభాని (98486 13687), రైతు శాస్త్రవేత్త, నాగభైరవ వారిపాలెం, గుంటూరు జిల్లా  

సుభానీ స్ప్రేయర్‌ బాగా పనిచేస్తోంది..
50 ఎకరాల్లో నిమ్మ, దానిమ్మ, బత్తాయి తోటలను పెంచుతున్నా. అంతరపంటగా కంది వేశా. సుభానీ యంత్రంతోనే జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నాం. బాగా పనిచేస్తోంది. 30 మంది కూలీలు చేసే పని ఇద్దరితో పూర్తవుతోంది. కంప్రెషర్‌ ఫోర్సుగా పనిచేస్తుండటం వల్ల కొమ్మలు పూర్తిగా తడిసి చీడపీడలను దరిచేరనివ్వడంలేదు.
– బత్తుల నారాయణరెడ్డి (94923 20316), రైతు, పందివానిపల్లె, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement