ఎండిన పంటకు నీరిచ్చాం: బాబు
సాక్షి,అనంతపురం/ఆలూరు: సీమలో వర్షాభావం వల్ల ఎండిన పంటకు నీరందించామని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగు రోజుల అనంతపురం జిల్లా పర్యటనను శుక్రవారం ఆయన ముగించారు. చివరిరోజు ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. ప్రపంచంలోనే మొట్టమొదటగా రెయిన్‌గన్‌లను ప్రవేశపెట్టి సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. జీవితం లో చాలా కార్యక్రమాలు చేశానని, కానీ రెయిన్‌గన్‌లను ప్రవేశపెట్టిన ఆనందం తనకు చాలా తృప్తినిచ్చిందన్నారు.
విహారయాత్రకు సీఎం..
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు గాను శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు.అక్కడ నుంచి కజికిస్తాన్‌లోని అస్తానా పర్యటనకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో తాను పుణే వెళుతున్నానని కొందరికి చెప్పినట్టు సమాచారం. మరికొందరు మాత్రం గోవా పర్యటనకు వెళ్లారని అంటున్నారు. బాబు పర్యటనల విషయాన్ని ఈ మధ్యకాలంలో రహస్యంగా ఉంచుతున్నారు.
ఉన్మాదులుగా మారుతున్నారు
‘సాక్షి’ ప్రతినిధిపై సీఎం అసహనం
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసుపై ప్రశ్నించినందుకు ‘సాక్షి’ ప్రతిని ధిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాల కోసం మీరూ ఉన్మాదులుగా మారుతున్నారంటూ విలేకరిపై అసహనం ప్రదర్శించారు.బాబు గురువారం రాత్రి అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసులో హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని, విచారణ ఎదుర్కోవచ్చు కదా అని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆయన ‘‘ఏయ్ కూర్చోవయ్యా. వాళ్లు ఉన్మాదులు. మిమ్మల్నీ అలాగే మారుస్తున్నారు. సాక్షి పత్రికలో ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. ఆ పత్రికలో జీతాల కోసం మీరు కూడా ఉన్మాదులుగా మారుతున్నారు. వాళ్లకు బుద్ధి లేకపోయినా (మేనేజ్‌మెంట్) మీకైనా తెలివి ఉండాలి కదా? నన్ను చెప్పుతో కొట్టాలని అన్నారు. నా అనుభవం అంత వయసు లేదు. మొదటిసారి ఎమ్మెల్యే. ఇంకా నేర్చుకోవాలి. అలాంటిది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.