
సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్): బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ఒక్కసారిగా మెరిసిపోయింది. యార్డు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బుధవారం రికార్డు స్థాయి ధర లభించింది. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.6,025 మద్దతు ధర ప్రకటించగా.. ఏకంగా గరిష్టంగా రూ.8,829 పలికింది. కనిష్టంగా రూ.6,830 ధర లభించింది. కనిష్ట ధరలు కూడా మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడం విశేషం.
బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రైతు శ్రీను తీసుకొచ్చిన పత్తికి అత్యధిక ధర వచ్చింది. ఇక మిగిలిన పంట ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యానికి గరిష్టంగా రూ.2,009 ధర రాగా, కనిష్టంగా రూ.1,409 పలికింది. హంసకు గరిష్టంగా రూ.1,679, కనిష్టంగా రూ.1,409, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,552, రాగులకు రూ.2,562, కందులకు గరిష్టంగా రూ.5,829, కనిష్టంగా రూ.5,014, ఆముదాలకు గరిష్టంగా రూ.5,400, కనిష్టంగా రూ.5,249 ధరలు కేటాయించారు.
కిటకిటలాడిన మార్కెట్
పంట దిగుబడుల క్రయవిక్రయాలతో బాదేపల్లి మార్కెట్ కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి 1,922 బస్తాల పత్తి యార్డుకు విక్రయానికి వచ్చింది. అదేవిధంగా 2,200 బస్తాల ధాన్యం, 881 బస్తాల మొక్కజొన్న, 365 బస్తాల వేరుశనగ, 271 బస్తాల కందులు విక్రయానికి వచ్చింది. మరోవైపు రైతులకు ఆశించిన ధరలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల యార్డుకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 1180 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టం రూ. 8174, కనిష్టం రూ. 4866, సరాసరి రూ.7200 ధరలు వచ్చాయి. 3 క్వింటాళ్ల ఆముదం రాగా, క్వింటాలుకు గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4510 ధరలు పలికాయి. 512 క్వింటాళ్ల వరి (సోన) రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 1929, కనిష్టం రూ. 1406, సరాసరి రూ. 1914 పలికింది. 41 క్వింటాళ్ల కంది రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 5266, కనిష్టం రూ. 4506, సరాసరి రూ. 5206 ధరలు లభించాయి.