సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ విత్తనాల దందాపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుండడంతో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నకిలీ పత్తి విత్తుకు కేరాఫ్‌గా నిలిచిన గద్వాల జిల్లా సీడ్ ఆర్గనైజర్ల మా ఫియా అలర్ట్ అయ్యింది. ఇటీవల సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించేసి వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచినట్లు సమాచా రం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త ఎత్తుగడ
ధనార్జనే ధ్యేయంగా పలువురు సీడ్ ఆర్గనైజర్లు ప్రతి ఏటా సీజన్‌లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఫెయిల్యూర్ విత్తనాలతో పాటు నాసిరకం సీడ్స్‌ను సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేవారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల టాస్క్‌ఫోర్స్ దాడులు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుంటూ వ్యాపారులపై పీడీ యాక్ట్ సైతం ప్రయోగిస్తున్నారు. దీంతో గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంత మేర నిల్వ ఉన్న నకిలీ విత్తనాలను పలువురు సీడ్ ఆర్గనైజర్లు దహనం చేశారు. గద్వాల పట్టణ శివారులోని పలు మిల్లులు, మల్దకల్, ధరూర్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న నకిలీ విత్తనాలను ఎవరికి వారే స్వయంగా కాల్చివేశారు. ఆ తర్వాత కొత్త ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళికతో సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించారు. గద్వాల జిల్లా సరిహద్దు అయిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ పరివాహకంలో లింగ్‌సుగుర్, మట్మారి, అమరేశ్వర వంటి తదితర క్యాంప్‌లలో పెద్ద ఎత్తున నిల్వ చేసినట్లు తెలిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ సరిహద్దులో కర్ణాటకకు చెందిన ఆదులాపూర్‌లో సైతం డంప్ చేసినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల నుంచి రాయచూర్, మాన్వి, సింధనూర్‌తో పాటు పలు ప్రాంతాల రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
గద్వాల జిల్లాలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించిన సందర్భంగా పట్టుబడిన నకిలీ విత్తనాలకు సంబంధించిన నింది తులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సీడ్ ఆర్గనైజర్ల మాఫియా జిల్లా నుంచి పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు తరలించి నిల్వ చేసినట్లు బయటపడింది. గద్వాల జిల్లా గట్టు మండలంలోని బల్గెర చెక్‌పోస్టు గుండా 1,500 క్వింటాళ్ల వరకు నకిలీ విత్తనాలను రాయచూర్ జిల్లాకు తరలించి వివిధ ప్రాంతాల్లో డంప్ చేశారని వారు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగం లోకి దింపింది. కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం తో నకిలీ విత్తన నిల్వ కేంద్రాలపై ఆరా తీస్తోంది.
ఎవరినీ వదిలిపెట్టం
జిల్లాలో ఇప్పటివరకు 180.71 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి 74 మంది నిందితులపై 54 కేసులు నమోదయ్యాయి. నకిలీ దందాపై డేగ కళ్లతో నిఘా పెట్టాం. అక్రమార్కులు ఎక్కడ ఉన్నా, ఎవరైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల
Comments
Please login to add a commentAdd a comment