నకిలీ పత్తి విత్తుల ఖిల్లాగా మారిన గద్వాల జిల్లా  | Fake Seeds Mafia In Telangana Sakshi Special | Sakshi
Sakshi News home page

కల్తీ విత్తులతో కొల్లగొడతారు

Published Mon, Apr 26 2021 11:20 AM | Last Updated on Mon, Apr 26 2021 11:37 AM

Fake Seeds Mafia In Telangana Sakshi Special

హైదరాబాద్‌లో అదొక త్రీస్టార్‌ హోటల్‌... ఇటీవల వ్యవసాయ శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి అక్కడకు చేరుకున్నాడు. పక్కన ఎవరూ లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత పావు గంటకు ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఒక రూమ్‌ బుక్‌ చేసి ఉండటంతో ఆ అధికారి, మరో ఇద్దరు వ్యక్తులు అందులో దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ వెళ్తూ వ్యవసాయ అధికారికి రూ.50 లక్షలున్న పెద్ద సూట్‌ కేసు ఇచ్చారు. ఆ వ్యక్తులు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా గ్యాంగుకు చెందినవారు కావడం విస్మయం కలిగించే అంశం. 

ఆయనొక ముఖ్య ప్రజాప్రతినిధి... అధికారులను ప్రభావితం చేయగలరు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా విత్తన కంపెనీలు సహకరిస్తుంటాయి. అలాగే అవసరమైనప్పుడల్లా కోటి, రెండు కోట్ల రూపాయలు సర్దుతుంటాయి. ఇందుకు బదులుగా నకిలీ విత్తనాల సరఫరా చేసేందుకు ఆయా కంపెనీలకు ఆ ప్రజాప్రతినిధి సహకరిస్తుంటారు. ఎక్కడైనా ఆ కంపెనీలు నకిలీ విత్తనాలతో పట్టుబడితే ఈ నేత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతుంటారు. ముందే మామూళ్లు అందుకున్న పోలీసులు, అధికారులు ఓకే అనేస్తుంటారు. గతేడాది, ఈ ఏడాది నకిలీ విత్తనాలతో పట్టుబడిన కొన్ని కంపెనీలకు ఈ ప్రజా ప్రతినిధే సహకరించాడని ఓ కంపెనీ ఉద్యోగి వెల్లడించాడు. 

అది గద్వాల జిల్లా. నకిలీ పత్తి విత్తనాలకు దశాబ్దంన్నర కాలంగా కేంద్ర బిందువుగా ఉంది. నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా ముఠాలో సీడ్‌ ఆర్గనైజర్లు కీలకం. జిల్లాలో 23 పత్తి జిన్నింగ్‌ మిల్లులున్నాయి.  ప్రముఖ వ్యాపారులు సీడ్‌ ఆర్గనైజర్ల పేరిట మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి ప్రధానంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తున్నారు. వీరే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల నేతలకు రూ.కోట్లలో ఫండింగ్‌ చేస్తుంటారు. మరోవైపు ఈ ముఠాలో జిల్లాకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

గద్వాల జిల్లాలో ఈ నెల 8వ తేదీన నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి టాస్క్‌ఫోర్స్, నిఘా విభాగం అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్‌ శివారులో 40 సంచుల నాసి రకం సీడ్‌ విత్తనాలను పట్టుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులు జాగ్రత్త పడినట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. దీనిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో దాదాపు 50 మంది రైతులు 200 ఎకరాల్లో కలాఫ్‌ కంపెనీకి చెందిన బంగారం రకానికి చెందిన మిర్చి విత్తనాలను గత అక్టోబర్‌లో జిల్లా కేంద్రంలో కొనుగోలు చేసి పంట సాగు చేశారు. ఒక ప్యాకెట్‌కు రూ.600 నుంచి రూ.700 వరకు వెచ్చించారు. ఎకరాకు 12 నుంచి 15 ప్యాకెట్ల వరకు విత్తారు. నెలలు గడిచినా పూత రాకపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నకిలీ విత్తనాలుగా గుర్తించి లబోదిబోమంటూ డీలర్లను నిలదీసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ‘సాక్షి’కి తెలిపారు. పైగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. అయితే ఆ తర్వాత జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు మొక్కుబడిగా గుంతకోడూరు సందర్శించినట్లు తెలిసింది. 

నకిలీ విత్తనాలు దశాబ్దాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని అరిగోస తీయిస్తున్నాయి. నకిలీ విత్తనాలతో అన్నదాతలైన రైతుల నోట్లో మట్టి కొడుతూ అక్రమార్కులు తమ జేబుల్లో కాసుల పంట పండించుకుంటున్నారు. దిగుబడి రాక నష్టపోతున్న రైతులు అదేమని నిలదీస్తే విత్తన మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నారు. విత్తన చట్టంలో ఉన్న లొసుగులు, మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారం ఏళ్ల తరబడి నిరాటంకంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఉన్నా, ఎన్నో కేసులు నమోదవుతూ అరెస్టులు జరుగుతున్నా.. నకిలీ దందాను నిర్వహించే కంపెనీ యజమానుల్లో ఏ ఒక్కరికీ గత 20 ఏళ్లలో జైలు శిక్ష పడలేదని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో పత్తి, సోయా, మిర్చి, వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు సాగవుతాయి. దీంతో ఈ పంటలకు సంబంధించిన నాసిరకపు విత్తనాలే ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తుంటాయి. అయితే నకిలీ విత్తన దందాలో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. కాగా సోయా, మిర్చి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతుండడంతో నకిలీ విత్తన మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ భారీ దందాకు తెర లేపినట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. ఈ మకిలీ దందాకు ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, మరో కీలక అధికారి అండ తోడవడంతో.. సీడ్‌ ఆర్గనైజర్లు, దళారులు, దుకాణదారులతో కూడిన పటిష్ట నెట్‌వర్క్‌ నకిలీ విత్తన విక్రయాలు జరిపేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించి అమల్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తనం మళ్లీ రాష్ట్ర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వ్యాపారులు, దళారులు నిరాటంకంగా అమాయక రైతాంగానికి వీటిని అంటగడుతున్నారు.

అసలు నకిలీ విత్తనాలంటే..
జెనెటిక్‌ ప్యూరిటీ లేనివన్నీ (మొలకెత్తే శాతం నిర్దేశిత మొత్తానికన్నా తక్కువ ఉండటం) నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ చెబుతోంది. సాధారణంగా రైతులు తాము పండించిన పంటనే విత్తనాలుగా వాడి మళ్లీ పంటలు పండిస్తుంటారు. అయితే మొలకెత్తే శాతం తగ్గడం, తద్వారా దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విత్తన తయారీ అనేది మొదలయ్యింది. వ్యవసాయ శాఖతో పాటు (ప్రభుత్వ), ప్రైవేటు కంపెనీలు కూడా ఈ విధంగా విత్తనోత్పత్తిని చేస్తున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, కంపెనీలు ఫౌండేషన్‌ సీడ్‌ (మూల విత్తనం) ఎప్పటికప్పుడు రైతులకిస్తాయి. వారు ప్రత్యేకంగా విత్తనోత్పత్తి చేసి తిరిగి ప్రభుత్వానికి, కంపెనీలకు అందజేస్తారు. ఆ విత్తనాలనే వ్యవసాయ శాఖ, ప్రైవేటు కంపెనీలు రైతులకు విక్రయిస్తుంటాయి. 

లేబొరేటరీల్లో పరీక్షించాలి
రైతులు ఆయా పంటలను వేర్వేరు దూరాల్లో పండించాలి. ఈ దూరం రెండు మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది. వరిలోనైతే రెండు మీటర్ల దూరంలో వేర్వేరు వెరైటీలు పండించాలి. పత్తి విత్తనో త్పత్తిలో వేర్వేరు వెరైటీల మధ్య కనీసం 25 మీటర్లు ఉండాలి. ప్రభుత్వ విత్తనోత్పత్తిలో అయితే ఈ దూరంగా సరిగ్గా ఉందా లేదా అని వ్యవసాయ అధికారి మూడుసార్లు తనిఖీ చేస్తారు. ఈ పంటలను ప్రత్యేకంగా కోసి ప్రాసెసింగ్‌కు తీసుకురావాలి. వీటిని డీఎన్‌ఏ టెస్టులో, లేదా గ్రోఔట్‌ టెసు ్టల్లో పరీక్షించి నాణ్యతను (జెనెటిక్‌ ప్యూరిటీ) నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా, 98–99 శాతం నాణ్యత లేకపోయినా  అది నాసిరకం కిందకు వస్తుంది. విత్తనాల్లో మొలక శాతం 65 నుంచి 90 వరకు ఉండాలి. పత్తిలో మొలకశాతం 75 ఉండాలి. అంతకంటే తక్కువుంటే నాసిరకం లేదా నకిలీ కింద లెక్క. అలాగే పత్తిలో బీటీ ప్రొటీన్‌ 90 శాతం ఉండాలి. ఈ మేరకు నాణ్యత ఉన్న వాటినే కంపెనీలు రైతులకు విక్రయించాలి.

విత్తనాల ప్యాకెట్ల లేబుల్‌పై ఆ విత్తనం నిర్దేశిత ప్రాంతానికి సరిపోతుందో లేదో రాయాలి. నాణ్యత శాతం, మొలక, తేమ శాతం, పత్తికి బీటీ ప్రొటీన్‌ శాతం పేర్కొనాలి. లాట్‌ నెంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. పత్తికి జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ (జీఈఏసీ) ధ్రువీకరణ ఉండాలి. ఇవి ఉంటేనే నాణ్యమైన విత్తనంగా గుర్తిస్తారు. జనరల్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం ప్రైవేట్‌ వెరైటీలకు ఆయా కంపెనీల స్వీయ ధ్రువీకరణ చేసుకుంటే చాలు. లైసెన్స్‌ వచ్చినట్టే. ఆ విధంగా విత్తన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది.

స్వీయ ధ్రువీకరణ, విత్తనోత్పత్తి మీద నియంత్రణ విత్తన చట్టంలో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కంపెనీలు నకిలీ విత్తన దందాకు తెరతీస్తూ రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారంలేని విత్తనాలను, గడువు ముగిసిన విత్తనాలను, స్థానికంగా తయారు చేసిన విత్తనాలను పెద్దయెత్తున రైతులకు అంటగడుతూ విత్తన మాఫియా జేబులు నింపుకుంటోంది. ప్రభుత్వ విత్తనాలు చాలినన్ని లభించకపోవడం, నకిలీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వీటి వైపు మొగ్గుచూపుతూ మోసపోతున్నారు.

పత్తిదే సింహభాగం
ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రాష్ట్రంలో రూ.1,000 కోట్లకు పైనే సాగుతోంది. ఒక్క నకిలీ పత్తి విత్తన దందానే దాదాపు రూ. 500 కోట్లు ఉంటుందని తేలింది. ఈసారి పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో రానున్న ఖరీఫ్‌లో 75 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఏ విత్తనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందో ఆ విత్తనాలకు సంబంధించే నకిలీ విత్తనాలు పుట్టుకొస్తుంటాయి. ఉదాహరణకు ఒక ఎకరాలో పత్తి సాగుకు ఏకంగా రూ.1,500 విలువైన విత్తనాలను విత్తాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఈ పంటకు సంబంధించి తక్కువ ధరతో నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. రైతులు కూడా ఎప్పటికప్పుడు ధర తక్కువగా ఉంది కదా అని వాటినే కొనుగోలు చేస్తూ దిగుబడి రాక మోసపోతున్నారు.

ఈసారి పత్తి సాగు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. మరోవైపు బీజీ–3 పత్తి విత్తనాలపై నిషేధం ఉన్నా.. తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులు దీనిని సాగు చేస్తుంటే, అధిక లాభాల కోసం కక్కుర్తి పడుతూ వ్యాపారులు వీటిని అక్రమ మార్గాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ పత్తి గద్వాలలో పండిస్తారు. అయితే పత్తి నకిలీ విత్తనాలకు సంబంధించి 150 మంది ‘ఆర్గనైజర్లు’ ఉన్నారు.

రైతులకు, కంపెనీలకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా ఎక్కువగా సాగుతోంది. ఎస్‌ఆర్‌ సీడ్స్, రజనీ సీడ్స్, పల్లవి, పావని, అరుణోదయ, కావ్య, శ్రీపావని పేరుతో విక్రయాలు చేస్తున్నారు. ఫర్టిలైజర్‌ దుకాణ నిర్వాహకులు కల్తీ విత్తనాలను అంటగ డుతున్నారు. వేల క్వింటాళ్ల విత్తనాలు లూజ్‌ సంచుల్లో తీసుకువచ్చి, ఆకర్షణీయ సంచుల్లో ప్యాక్‌ చేసి రైతులకు అంటగడుతున్నారు. 

మిర్చి, సోయా, కంది విత్తనాల్లోనూ..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో రైతులు సోయాబీన్‌ సాగు చేస్తుంటారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది. ఇందుకు గాను 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వ పరంగా 35 వేల క్వింటాళ్లే అందుబాటులో ఉండటంతో మిగిలిన విత్తనాల కోసం రైతులు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని అనేక కంపెనీలు నకిలీ సోయా విత్తన దందాకు దిగాయి.

గతంలో కొన్ని కంపెనీలు సరఫరా చేసిన నకిలీ సోయా విత్తనంలో 10 నుంచి 15 శాతం కూడా మొలకెత్తలేదని రైతులు తెలిపారు. మరోవైపు పాలమూరు జిల్లాలో కంది విత్తన మాఫియా తన కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక ఖమ్మం జిల్లాలో మిర్చి నకిలీ విత్తన వ్యవహారం జోరుగా సాగుతోంది. గతంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు.

అన్నీ ప్రైవేట్‌ కంపెనీలే..
మొక్కజొన్న, పత్తి, మిర్చి నూటికి నూరు శాతం ప్రైవేట్‌ కంపెనీలే సమకూర్చు తున్నాయి. ఇక కంది, వరిలో 50 శాతం కూడా ప్రైవేట్‌ విత్తనమే. ఇవన్నీ కూడా చట్టం పరిధిలోకి రావు. చిన్నా పెద్దా కంపెనీలు నాసిరకం అమ్ముతున్నాయి. రాష్ట్రంలో పత్తి విత్తనాలను అమ్మే కంపెనీలు 50 ఉంటే, అందులో 20 వరకు చిన్నాచితక కంపెనీలు ఉన్నాయి. ఎక్కువగా వీటి ద్వారానే నాసిరకపు విత్తనం, బీజీ–3 విత్తనం రైతులకు చేరుతున్నాయి. 

  • అక్రమ దందా ఇలా..: నకిలీ విత్తన మాఫియా పలు రకాలుగా విత్తనాలు, వాటి ప్యాకెట్లను మార్చుతుంది. ప్యాక్‌ చేయకుండా విత్తనాలు లూజ్‌గా అమ్ముతారు. వీటిలో నాసిరకానివి కలుపు తారు. అనధికారికంగా విత్తనాలను ప్యాక్‌ చేస్తారు. నకిలీ లేబుళ్లు ముద్రించి విక్రయిస్తారు. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేస్తారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా స్థానికంగా తయారు చేస్తారు, దళారుల ద్వారా మార్కెట్‌లోకి పంపుతారు. 
  • రీ సై‘కిల్లింగ్‌’..: గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్‌ (పుచ్చులు వంటి వాటిని తొలగించి తిరిగి ప్యాక్‌ చేయడం) చేసి వాటినే రైతులకు అమ్ముతూ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలా విక్రయిస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్‌ దాడుల్లో ఇది బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయి అండదండలు ఉండటంతో వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. గతంలో 15 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్‌ వ్యవహారం బయటపడింది. 
  • లక్షలాది ఎకరాల్లో నిషేధిత బీజీ–3 సాగు..: బీజీ–3 పత్తిపై నిషేధం ఉంది. ఈ పంటలో కలుపు తీసేందుకు గైల్‌పోసైట్‌ అనే ప్రమాదకరమైన మందు వాడతారు. దానివల్ల కూలీల ఖర్చులు ఎకరానికి రూ. 8 వేల వరకు మిగులుతాయి. గైల్‌పోసైట్‌ చల్లటం వల్ల కలుపు పోతుంది కానీ, వాతావరణం, జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అందువల్లే దీనిపై నిషేధం ఉంది. కానీ రాష్ట్రంలో బ్లాక్‌లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంది. తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. బీజీ–3 పత్తిని ఎక్కువగా మంచిర్యాల, భువనగిరి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వేస్తున్నారు. ఒక విత్తన డీలర్‌ ఒక సాధారణ పత్తి విత్తన ప్యాకెట్‌ అమ్మితే రూ. 25– రూ. 30 లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ. వెయ్యి చొప్పున మిగులుతాయి. దీంతో అక్రమంగా వ్యాపారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి సాగు అవుతుందని సమాచారం. ఈసారి మరింతగా మార్కెట్‌ని ముంచెత్తుతాయని అంచనా.

ఎన్ని కేసులో..

  • నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో గత ఏడాది  34 కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్‌ శివారులో 42 సంచుల (26.10 క్వింటాళ్లు) నాసి రకం విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్‌కు చెందిన సీడ్‌ వ్యాపారి గాజుల శ్రీనివాస్, పత్తి మిల్లు యజమాని ధర్మారెడ్డి, మిల్లులో పని చేసే గుమాస్తా రఫీక్, డీసీఎం డ్రైవర్‌ మనోజ్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
  • ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో 2020 జూన్‌ 18వ తేదీన 25 కేజీల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. మల్దకల్‌ మండలం కర్తిరావుల చెర్వు గ్రామానికి చెందిన పరశురాములు విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. 
  • ఉండవల్లి మండల కేంద్రంలో 2020 జూన్‌ 27వ తేదీన ఇద్దరు వ్యక్తులు లూజ్‌ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేసి 53 కేజీల విత్తనాలు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 
  • మానవపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రానికి చెందిన వ్యక్తి 2019లో లూజ్‌ విత్తనాలు విక్రయిస్తుండగా.. పోలీసులు కేసుపెట్టారు.
  • 2020లో నల్లగొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మానవపాడు మీదుగా విత్తనాలు తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదైంది.
  • 2020 జూన్‌ 16వ తేదీన రాజోలి మండల కేంద్రానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి వడ్డేపల్లి మండలం బుద్దారెడ్డి పల్లె నుంచి తీసుకొచ్చి స్థానికంగా 20 కేజీల విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
  • అయిజలో 2020 మే 28న కూట్కనూరులో 320 కేజీలు, మూగోనిపల్లిలో 2020 జూన్‌ ఒకటో తేదీన 120 కేజీల లూజ్‌ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొత్తినోనిదొడ్డిలో 2020 జూన్‌ ఒకటో తేదీన 43 కేజీల లూజ్‌ విత్తనాలను అధికారులు సీజ్‌ చేశారు. 2020 జూన్‌ 9వ తేదీన మేడికొండలో 75 కేజీలు, 11న తొత్తినోనిదొడ్డిలో 150 కేజీలు, 17వ తేదీన ఉత్తనూరులో ఒక చోట 35 కేజీలు, మరో చోట 55 కేజీల లూజ్‌ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

ఉత్తుత్తి విత్తన చట్టాలు
నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు 1966 సీడ్‌ యాక్ట్, 1968 సీడ్‌ రూల్స్, 1983 సీడ్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ వంటివి ఉన్నాయి. పత్తికి ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ రూల్స్‌–1989, కాటన్‌ సీడ్‌ యాక్ట్‌–2007 ఉంది. అయితే కంపెనీలు నాసిరకపు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్లో లేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 99 శాతం కేసుల్లో అక్రమార్కులకు కనీస శిక్షలు కూడా పడటం లేదు. వాస్తవానికి నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు సీడ్‌ బిల్‌–2004 పార్లమెంటులో పెట్టినా అప్పటినుంచి అది ఆమోదం రాలేదు. 2020లో మళ్లీ పెట్టినా పాస్‌ కాలేదు. అది పాసైతే సీడ్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని, ఆ విత్తన సామర్థ్యం ఎంత? ఎంత ఉత్పత్తి, ఉత్పాదకత వస్తుంది? చీడపీడలకు ఎంతమేరకు తట్టుకుంటుంది? వంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్‌ సందర్భంగా కంపెనీలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పాత కాలపు విత్తన చట్టాలు మారేంతవరకు నకిలీ, నాసిరకపు విత్తనాలను విక్రయించే, ఉత్పత్తి చేసేవారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి లేదని,  అందువల్ల రాష్ట్రాలు తాత్కాలికంగా చట్టాలు చేసుకుంటే మంచిదని అంటున్నారు. 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తి విత్తన ధరలను నియంత్రణలో ఉంచేందుకు కాటన్‌ యాక్ట్‌ తీసుకురావడాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ విత్తన భాండాగారంగా వెలుగొందుతున్న తరుణంలో రాష్ట్రానికి విత్తన చట్టం ఆవశ్యకత ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

-బొల్లోజు రవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement