ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్‌ను సాక్షి.కాం పలకరించింది.
ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె.
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్‌సబ్జెక్ట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్‌కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.
బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.
చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.
స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్‌లు, ఆర్ట్ టాక్‌లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
పుణేలో పర్యావరణ శిల్పం
పుణేలోని వాకాడ్‌లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్‌ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం.
తెలంగాణా కోసం చార్మినార్
పుట్టింది రాజస్టాన్‌లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర స్క్రాప్‌తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.
చెత్తనుంచే చిత్రమైన కళాకృతులు
పనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.
చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి.
చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.
విద్యార్థుల కోసం గురుకులం
‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలత
మహిళలకో మాట
‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట!
Comments
Please login to add a commentAdd a comment