
సీనియారిటీ జాబితాపై రగడ!
– పీఈటీల కౌన్సెలింగ్ గందరగోళం
– ఫైనల్ సీనియారిటీ జాబితా వచ్చిన తర్వాతా అభ్యంతరాలు
– సరి చేయకపోవడంతో కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న పీఈటీలు
– వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: తొలిరోజు ప్రధానోపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులకు రెండోరోజు ఆదివారం జరిగిన పీఈటీల కౌన్సెలింగ్ షాక్ ఇచ్చింది. సీనియార్టీ జాబితాపై అధికారులు, పీఈటీల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో చివరకు రాత్రి 8.30 గంటల సమయంలో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ ప్రకటించారు. బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, వారి బంధువులు ఉదయం 11 గంటల నుంచే సైన్స్ సెంటర్‌లో ఎదురుచూశారు. వారంతా రాత్రిదాకా పడిగాపులు కాసి ఉసూరుమంటు వెనుదిరిగారు.
సీనియార్టీ జాబితాపై రగడ
తుద సీనియార్టీ జాబితా ప్రకటించడంలో బాగా జాప్యం జరుగుతోంది. వాస్తవానికి కౌన్సెలింగ్‌కు ఒకరోజు ముందు ప్రకటించాల్సిన ఈ జాబితా కనీసం కౌన్సెలింగ్ ప్రారంభ సమయంలో కూడా ప్రకటించకపోవడం విశేషం. ఫలితంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పీఈటీలకు సంబంధించిన తుది సీనియార్టీ జాబితా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రకటించారు. అయితే చాలావరకు తాత్కాలిక జాబితాలో వచ్చిన తప్పిదాలపై ఆధారాలతో సహా ఆన్‌లైన్‌లో కంప్లైట్ చేశారు. వాటిని సరి చేయకుండానే తుది జాబితా వెల్లడించారు. దీంతో పీఈటీలు అభ్యంతరం తెలిపారు. చివరకు సాయంత్రం 6 గంటలకు మరోసారి తుది జాబితా వచ్చింది. ఆ ప్రకారం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో మరోసారి గొడవ చోటు చేసుకుంది.
రంగయ్య అనే టీచరుకు 32 పాయింట్లు రావాల్సి ఉండగా 45 పాయింట్లు నమోదయ్యాయి. అలాగే గంగరాజు అనే మరో టీచరుకు 33 పాయింట్లు రావాల్సి ఉండగా 36 పాయింట్లు వచ్చాయి. శివమ్మ అనే టీచర్‌కు మొత్తం 30.3843 పాయింట్లు రావాల్సి ఉండగా 31.3843 పాయింట్లు వచ్చాయి. దీంతో వరుస సంఖ్యలో వీరందరూ ముందున్నారు. వాస్తవానికి తమకు అదనంగా పాయింట్లు పడ్డాయని వాటిని తొలిగించాలంటూ రాతపూర్వకంగా ఇచ్చారు. కానీ వాటిని సరిచేయలేదు. తమకన్నా తక్కువ పాయింట్లు ఉన్న వారు ముందు వరుసలో ఉన్నారంటూ పలువురు పీఈటీలు అభ్యంతరం తెలిపారు.
కౌన్సెలింగ్ అడ్డుకున్న పీఈటీలు
తుదిజాబితాను అనుసరించి డీఈఓ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని చూడగా...పలువురు పీఈటీలు అడ్డుకున్నారు. అభ్యంతరాలను సరి చేయకుండానే ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారంటూ నిలదీశారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటే తీవ్ర చర్యలుంటాయని డీఈఓ హెచ్చరించారు. అయినా మాట వినకపోవడంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీనియార్టీ జాబితాలో మార్పులు చేస్తేనే కౌన్సెలింగ్ నిర్వహించాలని లేదంటే వాయిదా వేయాలంటూ పట్టుబట్టారు.
ఉన్నతాధికారుల దృష్టికి
కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న వైనంపై డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తుది జాబితాలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు వారు మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను పంపగా...ఉన్నతాధికారులు వాటిని సరి చేశారు. దీంతో సీనియార్టీ జాబితా మరోమారు మారింది. దీంతో పీఈటీలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే రాత్రి 8 గంటల దాటిపోవడంతో మహిళా టీచర్లు అభ్యంతరం తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన డీఈఓ కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేదీ ముందుగా తెలియజేస్తామన్నారు.
నేడు లాంగ్వెజెస్ టీచర్లకు కౌన్సెలింగ్
సోమవారం ఇంగ్లీష్ మినహా తక్కిన లాంగ్వెజెస్ స్కూల్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.