‘‘ఇది విన్నారా? రఘు రావట్లేదంట. యూఎస్ నుంచి ఇందాకే కాల్ చేసి చెప్పాట్ట’’ ఒకింత ఆశ్చర్యంగా ఈ కబురు తెలిపింది నా శ్రీమతి.మోటార్ సైకిల్ పార్క్ చేసి, లోనికి వచ్చి కూర్చుని చెప్పాను‘‘అవునట. నాకూ ఇందాకే తెలిసింది. ఆఫీస్ నుంచి వస్తుంటే దార్లో రంగనాథంగారు కనబడి చెప్పారు’’రఘు రాలేకపోతున్నది ఏదో పెండ్లికో పేరంటానికో కాదు, సాక్షాత్తు తన తల్లి దశదిన కర్మలకి. రఘు అమెరికాలో పనిచేస్తున్నాడు. చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాడు.కుక్కాంటీ అనబడే సరోజ ఆంటీకి రఘు ఒక్కగానొక్క కొడుకు. తన ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని ఐఐటీలో చదవించి, వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టిన కుక్కాంటీ అసలు ఊహించి ఉండదు ఇలాంటి పరిణామం. ఆవిడ చనిపోయిన రోజు కూడా రఘు రాలేకపోయాడు. బిజీగా ఉన్నానని అమెరికా నుంచి ఫోన్ చేశాడు.అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. తల మునకలయ్యేంత పనుల్లో ఉన్నానని, సెలవు దొరకదని, అంత్యక్రియలు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కానివ్వండని, దశదిన కర్మల లోపు వచ్చేస్తానని ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా పనులు కానివ్వండని అభ్యర్థించేటప్పటికి ఎవరూ కాదనలేకపోయారు. అతని కోణం నుంచి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే చేశారు.రంగనాథంగారు సరోజ ఆంటీకి బాగా దగ్గరి వారు. దూరపు చుట్టరికం కూడా ఉందనుకుంటాను. ఆయన బాధ్యత తీసుకుని, అన్ని పనులూ తన తలపై వేసుకుని వ్యవహారం కానిచ్చారు. కాలనీలోని ప్రతి ఒక్కరూ రంగనాథంగారికి సహకరించారు.
సరోజ ఆంటీ అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. ఆవిడ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చిందని అందరూ అనుకున్నారు. తలలో నాలుక అన్నది చాలా చిన్నపదం అవుతుంది ఆవిడ విషయంలో. కాలనీలో అందరినీ తన పిల్లల్లా చూసుకునేది. పెళ్లి, పేరంటం, నామకరణం, పుట్టినరోజు వేడుకలు... ఇలా ఒక్కటేమిటి ఎక్కడ కోలాహలం ఉంటే అక్కడ కుక్కాంటీ ఉంటుందనేది జగమెరిగిన సత్యంగా మారింది.శుభకార్యాలు సరే, ఏ ఇంట్లో విషాదం జరిగినా, ఓదార్చడానికి తానే ముందుండేది. ఆయా ఇండ్లలో ఆ ఇల్లు ఆవిడదేనేమో అన్నట్లుగా తిరిగి అందరినీ ఓదార్చి ఒక పూటో రెండుపూటలో ఉండి వచ్చేది. ఆవిడ ఒక చైతన్యం, ఆవిడ ఒక శక్తి. ఆవిడ ఒక అండ.ఇలా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఆవిడని నేను మొదటిసారి చూసిన సంఘటన గుర్తొచ్చింది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి పరుగులు తీశాయి.ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది.‘‘ఇలా చలిగాలిలో తిరక్కూడదు. కడుపునిండా భోంచేసి చక్కగా ఇంట్లో పడుకోవాలి’’ కాసింత కటువుగా అన్నారెవరో.చలికి ఒకరికొకరం దగ్గరగా అతుక్కుని నడుస్తున్నామేమో, ఈ మాట విని చటుక్కుమని దూరంగా జరిగిపోయాం నేనూ మా ఆవిడా.‘‘అయ్యో! మిమ్మల్ని కాదులెండి. ఈ కుక్కల్ని అంటున్నాను’’ ఈ మాటతో మా అయోమయం ఇంకా ఎక్కువైంది.ఆ మాటలు అంటున్నావిడ కాస్త లావుగా ఉంది. ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని, తెల్లని శరీర ఛాయతో హుందాగా ఉంది. ఆవిడ చేతిలో అన్నం గిన్నె పట్టుకుని, చుట్టూ చేరిన ఐదారు కుక్కలకి అన్నం పెడుతోంది.ఆవిడ ధోరణి మాకు కాస్త విచిత్రంగా అనిపించింది.
మనుషులతో మాట్లాడినంత చనువుగా, ఆప్యాయంగా ఉండుండి ఆ కుక్కలతో మాట్లాడుతోంది. వాటి వాలకాన్ని బట్టి చూస్తే అవన్నీ వీధి కుక్కలని తెలిసిపోతోంది. ఒక్కటి కూడా పెంపుడు కుక్కలా లేదు.అవాక్కయి నిలబడి చూస్తుండిపోయా మేమిద్దరం.‘‘గుడికెళ్తున్నారా? వెళ్లిరండి. హారతి టైమవుతుందనుకుంటాను’’ మమ్మల్ని ఉద్దేశించి ఆ రెండు మాటలూ అనేసి తిరిగి కుక్కలకు వడ్డించడంలో నిమగ్నమైపోయింది. ఆవిడని చూడటం అదే మొదటిసారి. ఆవిడ పేరు సరోజ అని తర్వాత తెలిసింది.ఆవిడని ఆ విధిలో అందరూ కుక్కాంటీ అనే పిలుస్తారని తెలిసింది. ఆవిడ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని మాకు క్రమంగా అర్థమైంది.ఆవిడ వెళుతూ ఉంటే, వెనకాలే కనీసం నాలుగైదు కుక్కులు తోకూపుకుంటూ వెళుతూ కనిపిస్తాయి.మామూలుగా మనం పక్కవీ«ధికి వెళితే పరిచయస్తులు ‘హలో.. హాయ్’ అని పలకరించినట్లు ఆ చుట్టుపక్కల వీధుల్లో ఎక్కడికెళ్లినా ఆయా వీధుల్లోని కుక్కలు ‘కుయ్.. కుయ్’మంటూ ఆవిడ దగ్గరగావచ్చి తమ విశ్వాసం ప్రకటిస్తాయి.నగరానికి నేనొచ్చిన కొత్త రోజులవి. విశ్వవిఖ్యాత దిగ్గజంలాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నాకు నేలపై కాళ్లు నిలబడేవి కావు ఆరోజుల్లో. చేతినిండా డబ్బు. కావలసినంత స్వేచ్ఛ.అమ్మానాన్నల ఇష్టానికి అనుగుణంగా నా మరదలినే పెళ్లి చేసుకుని నగరంలో స్థిరపడ్డాను. నగర కాలుష్యానికి దూరంగా, ఆఫీస్ క్యాంపస్‌కి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుని ఎదుగుతున్న ఆ కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు సొంతం చేసుకున్నాను.
ఆ ఇంటి నిర్మాణం సందర్భంగా ఒకరోజు సాయంత్రం నిర్మాణ నిర్వహణ పనులు ముగించుకుని సతీసమేతంగా గుడికి వెళుతూ కుక్కాంటీగారిని ఇలా చూడటం తటస్థించింది. ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి సాయిబాబా గుడి ఉండటం మాకు చాలా నచ్చింది. వీలైనంత వరకు ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. నగరాల్లోని కాలనీల్లో ఎవరి జీవితం వారిది అనుకుంటూ కాలం గడిపేయడానికి అలవాటు పడిపోయాం అందరమూ. పక్కింటివాడి పేరు తెలియదు. ఏం చేస్తుంటాడో తెలియదు. ఇదో నాగరికత అనే భ్రమలో బతికేస్తుంటాం.ఇలాంటి భ్రమలకు తెరదించింది సరోజ ఆంటీ. నేను ఇంటి స్థలం తీసుకుని, నిర్మాణం పనులన్నీ ముగించి, కొలీగ్స్‌ని, బాగా దగ్గరి బంధువులను, ఆప్తమిత్రులు కొందరిని ఆహ్వానించుకుని ‘హరి ఓం’ అని గృహప్రవేశం చేసుకుంటున్నాను. ఇంతలో ఉరుములేని పిడుగులా సరోజ ఆంటీ ఊడిపడింది.‘‘ఏం నాయనా! నా సైజు చూసి బాగా మెక్కేస్తానని పిలవలేదా ఏంటి? సరిగా మీ ఇంటి వెనుకే ఉంటాను తండ్రీ. నా పేరు సరోజ. మీ అమ్మగారిలా అనుకో. ఇదిగో నా తరఫు నుంచి ఈ చిన్న కానుక. మీరు, మీ తదనంతరం మీ పిల్లలు, మీ మనవళ్లు, మనవరాళ్లు ఈ ఇంట్లో అనేక శత సంవత్సరాలు హాయిగా అనేకానేక శుభకార్యాలు నిర్వహించుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా అషై్టశ్వర్యాలతో తులతూగాలని నా ఆకాంక్ష’’ అంటూ ఆవిడ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా టకటకా చెప్పదలచిన నాలుగు ముక్కలూ చెప్పేసి, కానుక ఇచ్చేసి, అందరితో పరిచయాలు చేసేసుకుని, బలవంతం చేస్తే కొద్దిగా విందు ఆరగించి, ఎలా వచ్చిందో అలా వేగంగా వెళ్లిపోయింది.
మొదటి చూపులోనే ఆవిడ మా వాళ్లందరికీ తెగ నచ్చేసింది. ఆ తర్వాత మా బంధువులంతా నగరానికి ఎప్పుడు వచ్చినా ఆవిడని కలవకుండా వెళ్లేవారు కాదు. మా అక్కయ్యలు, అన్నయ్యలు ఎప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడినా ఆవిడ గురించి కుశల ప్రశ్నలు అడిగిగాని సంభాషణ ముగించేవారు కాదు. అంతగా మా అందరిపై ప్రభావం చూపగలిగిందావిడ. పిచ్చిదానిలా కనిపించిన ఆవిడ, చాలా త్వరలోనే నా దృష్టిలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుందని నాకప్పట్లో తెలియదు. ఆవిడ భర్త ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈవిడంత కలుపుగోరు మనిషి కాదాయన. తన పని తాను చేసుకుపోయేవాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు. ఈవిడ చేసే ఎలాంటి సేవా కార్యక్రమాలకు అడ్డు చెప్పేవాడు కాదాయన. అదే ఆయన చేసే సేవ అని చెప్పవచ్చు. వారికి ఒకే ఒక అబ్బాయి.వాడి పేరు రఘు. మేము ఆ కాలనీలో చేరేటప్పటికి రఘు రెండో తరగతో మూడో తరగతో చదివేవాడు. వాళ్ల ఆశలన్నీ రఘుపైనే. వాడిని బాగా చదివించి అమెరికా పంపించాలనేది ఆవిడ ఆశయంగా ఉండేది. అందరితో అదే మాట చెప్పేది. రఘు కూడా చదువులో మంచి ప్రతిభ చూపేవాడు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్‌గా నిలిచేవాడు.ఇక కుక్కాంటీ విషయానికొస్తే చెప్పుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి.స్వామీ వివేకానంద జన్మదినోత్సవం వస్తోందంటే చాలు, ఈవిడ ఓ హుండీలాంటి డబ్బా ఒకటి పట్టుకుని కాలనీలోని అన్ని ఇళ్లూ తిరిగి చందాలు వసూలు చేసేది. ‘‘మీకు తోచినంత ఇవ్వండి. ఎటువంటి బలవంతం లేదు’’ అనేది. అలా పోగైన డబ్బులన్నీ పట్టుకువెళ్లి మా ఇళ్ల దగ్గర్లో ఉన్న అనాథాశ్రమంలోని పిల్లలకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు కొని ఇచ్చేది.
తన పుట్టినరోజని ఒకసారి, వాళ్లాయన పుట్టినరోజని ఒకసారి, వాళ్లబ్బాయి పుట్టినరోజని ఒకసారి ఇలా ఏదో ఒక సందర్భంలో అనాథాశ్రమం పిల్లలకు తన ఇంటి నుంచి తెచ్చిన విందుభోజనం పెట్టేది.తాను చేసే ఇలాంటి ధర్మకార్యాలకు ఎలాంటి ప్రచారమూ ఆశించేది కాదు. ఊరికి దూరంగా ఉన్న కారణంగా అనుకుంటాను మా కాలనీకి బిచ్చగాళ్లు తక్కువగా వచ్చేవారు. అనుకోకుండా వచ్చే ఒకటీ అరా బిచ్చగాళ్లకు చక్కని సరోజా ఆంటీ ఇంట్లో చక్కని భోజనం, వారి ఇంటి కాంపౌండ్‌లోని వేపచెట్టు కింద నవారుమంచంపై చక్కని నిద్ర దక్కేవి.కాలనీలో రోడ్లు పడ్డా ఆవిడకే ఆనందం, బోరుబావులు తవ్వినాఆవిడకే ఆనందం. చిన్నపిల్లలా అక్కడే ఉండి ఆయా కార్మికులని ఉత్సాహపరుస్తూ వాళ్లకు నీళ్లు, చిరుతిండ్లు తానే సప్లై చేసేది. మా ఇంటి దగ్గరి సాయిబాబా గుడికి ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండింటికి చేరుకునేది. అక్కడ జరిగే అన్నదానంలో ప్రత్యక్షంగా వడ్డన ద్వారా, పరోక్షంగా ఆర్థికసాయం ద్వారా తనవంతు తోడ్పాటు అందించేది. అందరూ తన బంధువులేనేమో అనేంత ఆప్యాయంగా వడ్డించి, ఆకలి తీరిందో లేదో కనుక్కుని మరీ పంపేది. మా కాలనీ అంతా కలిపి వందా నూటయాభై ఇళ్లు ఉండేవి ఆ రోజుల్లో. నెలకోసారి అందర్నీ కలిపేలా చేసి ఏదో ఒక సాంఘిక కార్యక్రమం నిర్వహింపజేసేది ఆవిడ. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ చెత్త లేకుండా చూసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించేది. ఇప్పుడు మా కాలనీలో మంచి మంచి వృక్షాలు ఉన్నాయంటే అదంతా ఆవిడ చలవే.ఇటీవల ఒక టీవీ చానల్ వాళ్ల సర్వేలో తేలిందేమిటంటే రాష్ట్రం మొత్తం మీద సగటు ఉష్ణోగ్రత కంటే మా కాలనీలో ఐదారు డిగ్రీలు తక్కువే ఉంటుందట. ఇవన్నీ ఒక ఎత్తయితే కాలనీలోని ఆడపిల్లలందరినీ సమీకరించి వారికి వేదికనెక్కి ఉపన్యాసం ఇచ్చే కళని పదును పెట్టుకోమని ప్రోత్సహించేది.
మా కాలనీ అమ్మాయిలు చాలామంది ఈవేళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సునాయాసంగా నెగ్గడానికి కుక్కాంటీ చిన్నప్పుడు తమకు ఇచ్చిన శిక్షణే ఎంతో ఉపయోగపడిందని వారంతా ముక్తకంఠంతో చెబుతారు. ఇలా అందరి జీవితాలపై ప్రభావం చూపిన ఆవిడ తన కొడుకు రఘు విషయంలో సహజంగానే మరింత ప్రేమగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.దురదృష్టవశాత్తు రఘుకి ఆవిడ పూర్తిగా అర్థం కాలేదని చెప్పవచ్చు. అర్థం కాకపోతే పోయే. తల్లిదండ్రుల మీద, సొంత దేశం మీద ద్వేషం పెంచుకోవడమే విషాదం.యోగ్యులను దేవుడు పరీక్షలకు గురిచేస్తాడని అనుకునే వారి నమ్మకాన్ని నిజం చేస్తూ దేవుడు సరోజ ఆంటీకి ఒక పెద్ద పరీక్షే పెట్టాడు.రఘు ఇంకా పదో తరగతికి రాక ముందే ఆవిడని విధి చిన్నచూపు చూసింది. రఘు తండ్రిలేని వాడయ్యాడు. ఆవిడ కనీసం పదో తరగతి కూడా పాస్ కాకపోవడంతో భర్త ఉద్యోగం కూడా రాలేదు. కొంత పరిహారం, నెలనెలా అందే పింఛనుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కుదుపు ఆమెలోని కరుణకి ఆనకట్ట వేయలేకపోయింది. తిరిగి మామూలుగానే ఆమె సేవా కార్యక్రమాలకి నడుం బిగించింది. చిత్రంగా ఆమె మరింత సమయాన్ని సేవా కార్యక్రమాలకి వెచ్చించడం మొదలుపెట్టింది. బహుశ తన దుఃఖాన్ని ఈ విధంగా మర్చిపోయే ప్రయత్నం చేసేదనుకుంటా. అలాగని కొడుకు బాధ్యతలని, ఇంటి పనులని నిర్లక్ష్యం చేయలేదు. భర్త మరణం తర్వాత రఘు చదువుపై ఎక్కువ సమయాన్ని వెచ్చించేది.వాడు ఇంటర్‌కు వచ్చాక వేకువనే బ్రహ్మీముహూర్తంలో లేచి, నాలుగు నాలుగున్నరకల్లా వాడిని నారాయణగూడలోని ఐఐటీ కోచింగ్ సెంటర్‌లో దిగబెట్టి రావడంతో ఆవిడ దినచర్య ప్రారంభమయ్యేది. కోచింగ్ సెంటర్‌కీ, జూనియర్ కాలేజీకి, సాయంత్రం మరో కోచింగ్ సెంటర్‌కి తిరగడంతో ఆవిడకి కాలం వేగంగా గడిచినట్లు అనిపించేది. వేళకి రఘుకి టిఫన్‌లు, భోజనాలు ఏర్పాటు చేయడంలో ఆ జీవి ఎంత అలసిపోయేదో ఆ కర్మసాక్షికి మాత్రమే తెలుసు. రఘు గురించి ఆమె కన్న కలలన్నీ నిజమయ్యాయనే చెప్పవచ్చు. సహజంగా తెలివైన కుర్రాడు కావడం, చక్కని కోచింగ్ లభించడంతో రఘుకి ముంబై ఐఐటీలో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచీలో సీటు రావడం, అక్కడ కూడా దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసుకుని, చూస్తుండగానే చక్కని కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.కథ ఇక్కడి వరకే అయితే ‘సుఖాంతం’ అని చెప్పి చేతులు దులిపేసుకునేవాడిని నేను కూడా. అసలు కథ ఇక్కడే మొదలైంది మరి. రఘు ఐఐటీలో చేరిన కొత్తలో ఆవిడ ఇంటింటికీ తిరిగి తన పుత్రుడి గురించిన విశేషాలను చెప్పుకుంటూ ఆనందం పంచుకునేది. క్రమంగా ఆవిడలో ఆ ఉత్సాహం సన్నగిల్లింది. రఘు గురించిన ప్రస్తావన తానై తేవడం మానేసింది. ఎవరైనా అడిగితే ముక్తసరిగా చెప్పి ముగించేది ఆ సంభాషణ.వాడు ఐఐటీలో చేరింది లగాయతు మహా అంటే ఒకట్రెండు సార్లు వచ్చి ఉంటాడు ఇంటికి. ఇక అమెరికాకి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటి మొహం చూసిన పాపానపోలేదు. వాడి దగ్గర ఉన్న స్టాక్ సమాధానం ‘బిజీగా ఉన్నాను’.
ఎప్పుడూ చైతన్యానికి ప్రతీగా ఉండే కుక్కాంటీ డల్‌గా ఉండటం ఎవరూ ఎన్నడూ చూడలేదు. ఈ ప్రపంచంలోని ఆనందం, ఉత్సాహం తాలూకు కేరాఫ్ అడ్రస్సా ఈవిడ అన్నట్లు ఉంటుంది ఆవిడ ప్రవర్తన.అలాంటావిడ వెక్కివెక్కి ఏడ్వడం నేను చూడాల్సి వచ్చింది ఓసారి. అసలేం జరిగిందంటే...ఒకరోజు సాయంత్రం గుడికెళ్తూ అనుకోకుండా వారింటికి వెళ్లాను. ముందు గదిలో లైట్ కూడా వేసుకోకుండా కూర్చుని ఆవిడ వెక్కివెక్కి రోదిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకించింది.ఆవిడ భర్త పోయినప్పుడు కూడా ఎంతో హుందాగా వ్యవహరించింది. అలాంటావిడ ఇలా ఏడ్వడం నాకు బాగా దుఃఖాన్ని కలిగించింది. ‘‘ఏమైంది ఆంటీ..?’’ నోరు పెగుల్చుకుని అడిగాను.ఆవిడ మౌనంగా ఓ ఎయిర్‌మెయిల్ ఉత్తరం నా చేతిలో పెట్టింది. లైట్ ఆన్ చేసి చదవడం ప్రారంభించాను. అది రఘు నుంచి.నేరుగా ఆవిడకి రాయలేదు. రంగనాథంగారికి రాశాడు.‘‘డియర్ అంకుల్‌బాగున్నారా? మీరంతా బాగున్నారని ఆశిస్తాను.నాకిక్కడ జీవితం ఆనందంగా గడిచిపోతోంది. అనేకమంది పరిచయమయ్యారు. రోజులు బాగా వేగంగా నడిచిపోతున్నాయి. నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు క్రమంగా అర్థమవుతోంది. నేను కోల్పోయినదంతా తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను.నేనేం కోల్పోయానో తెలుసా అంకుల్? జీవితం కోల్పోయాను. అవునంకుల్ నేను బాల్యం కోల్పోయాను. స్కూల్‌డేస్ తాలూకు ఆనందం కోల్పోయాను. కాలేజ్ డేస్ తాలూకు వేగం కోల్పోయాను.
బాల్యం అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పుస్తకాలు, పరీక్షలు. స్కూల్ అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పోటీ, ర్యాంకులు, పరుగులు. కాలేజీ లైఫ్ మరీ ఘోరం అంకుల్. ఒక బందిఖానా నయం దానికంటే. పేపర్లలో ప్రకటనల కోసం మమ్మల్ని సమిధలుగా వాడుకున్నారు ఆ జూనియర్ కాలేజీ వాళ్లు. వాళ్ల దృష్టిలో మేం ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాలం. మాకంటూ కొన్ని మనోభావాలుంటాయని అవి దెబ్బతింటాయని ఏనాడూ ఆలోచించలేదు వారు. హైదరాబాద్ అంటే కోచింగ్ సెంటర్లు గుర్తు వస్తాయి కాని ఎంజాయ్ చేసిన క్షణాలు బుర్ర బద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు. ఇక ఐఐటీలో అయితే ఊపిరి తీసుకోవడానికి కాదు కదా, చావడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. అలసి సొలసి ఇంటికి వచ్చిన నన్ను ఏనాడూ మా అమ్మ నన్ను ఒక మనసున్న మనిషిగా ట్రీట్ చేయలేదు. ఎంతసేపూ నాకెన్ని మార్కులు వచ్చాయని అడగడం, మంచి మార్కులు వచ్చాయనగానే స్వీట్స్ చేసి పెట్టడం, ఎప్పుడైనా ఒకటీ అరా తక్కువ వచ్చిన సందర్భాల్లో తాను డల్‌గా మారిపోవడం... ఇంతేనా జీవితమంటే అని అనిపించేది. నేను కంటి ముందు కనిపిస్తే చాలు ‘బాగా చదువుకో, అమెరికాలో ఉద్యోగం తెచ్చుకో’ ఈ రెండు మాటలే తప్ప మూడోమాట ఆవిడ నోట్లోంచి వచ్చేది కాదు. ఎక్కడో నాకూ మా అమ్మకీ మధ్యన ఉండాల్సిన సున్నితమైన ఏదో బంధం తెగిపోయినట్లనిపిస్తుంది నాకు.
ర్యాంకులు, మార్కులు, పరీక్షలులాంటి టాపిక్స్ తప్ప మా మధ్య మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉండేవి కావు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పరిస్థితి మరీ ఘోరం అయ్యిందని చెప్పవచ్చు.నాకెరీర్‌ని మా అమ్మ ఒక జీవన్మరణ సమస్యగా తీసుకున్నట్లనిపించేది నాకు.సినిమాల్లో చూపించినట్లు ఇంటి వాతావరణం అందంగా ఉండదని నాకు తెలిసిన క్షణం నుంచి నాలో ఒకవిధమైన విరక్తి కలిగింది.అలా అన్చెప్పి నాకు మా అమ్మపై ప్రేమ లేదని కాదు. ఆవిడ బాధపడితే నేను చూడలేను. ఆవిడ ఆనందంగా ఉండాలి. ఆవిడ ఆనందానికి మూలకారణం నా మార్కులే. నా విజయాలే అనే ధోరణి నాకు విపరీతమైన చిరాకు కలిగించేది.సెలవులకు రాకూడదా అని మీరు నాకు పదే పదే ఫోన్ చేయకండి. వీలైతే నేనే వస్తాను. తరచూ వచ్చి అక్కడ గడపడం నా వల్ల కాదు. నా ఇబ్బంది అక్కడికి రావడం కాదు. వచ్చాక ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది ఇంట్లో. నాకక్కడ అసలేం తోచదు. నాకు మా అమ్మకి మధ్య ఓవిధమైన నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తనకీ తోచదు, నాకూ తోచదు.ఇంతదూరం వచ్చి నా టైమ్ వేస్ట్ చేసుకుని వృథాగా గడిపి వెళ్లిన భావన కలుగుతుంది. దయచేసి నన్ను రమ్మని పిలవకండి. నేనే వీలు చూసుకుని తప్పకుండా ఒకసారి వచ్చి వెళతాను. అమెరికా రమ్మంటే తను రాదు. ఎన్నోసార్లు అడిగి విసిగిపోయాను. తనకు ఎంత డబ్బు కావాలన్నా పంపిస్తాను. తనని ఆనందంగా ఉండమని చెప్పండి. మీరంతా ఆవిడకి తోడు ఉన్నారన్న భరోసాతో నేనిక్కడ నింపాదిగా ఉండగలుగుతున్నాను. అమ్మని బాగా చూసుకోండి.మీ రఘు.ఆవిడ అక్షరాలని కూడబలుక్కుని చదివి ఉంటుంది ఆ ఉత్తరం.‘‘ఈ కాలనీ వారంతా మీ పిల్లల్లాంటి వారు కాదా ఆంటీ’’ అని చెప్పి ఓదార్చి వచ్చాను. కాని ఆవిడ దుఃఖాన్ని ఆపడం నా వల్ల కాలేదు.
నన్ను ఎక్కువసేపు ఉండనివ్వలేదావిడ వారింట్లో. సున్నితంగా నన్ను వెళ్లిపొమ్మని సైగ చేసింది. నేను వచ్చేశాను.ఆ తర్వాత ఆమెలో కొత్త మనిషిని చూశాను. ఇదివరకటి కన్నా ఉత్సాహంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత ఆవిడ ఎప్పుడూ రఘు గురించి మేమడిగినా ప్రస్తావించేది కాదు.ఆవిడలో ఒక స్థిరత్వాన్ని గమనించాను ఈ విషయంలో.మృత్యువు ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేకుండా, చివరి నిమిషం వరకు నవ్వుతూ నవ్విస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ హాయిగా గడిపేసింది ఆమె తన చివరి రోజులు.తానెన్నుకున్న మార్గం విషయంలో ఆమె ఎన్నడూ రాజీ పడలేదు.దుఃఖమే ఆమె ముందు దుఃఖించింది. అలసటే ఆమె ముందు అలసిపోయింది. ఓటమే ఆమె ముందు ఓడిపోయింది. ఆ విధంగా సరోజ ఆంటీ జీవితం ముగిసిపోయింది.మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రంగనాథం గారి నుంచి పిలుపు వస్తే వెళ్లాను వారింటికి.మా కాలనీలో వేసవికాలాల సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న తోటలు ఉంటాయేమో, సాంత్వన కలిగిస్తూ పిల్లగాలులు, మామిడాకు వాసనలు, మల్లెల పరిమళాలు. ఒకవిధమైన ఆహ్లాదం ఉంటుంది వీధుల్లో తిరుగుతుంటే గేటు తీసుకుని లోనికి వెళ్లాను.రంగనాథంగారి కంఠం నాకు పరిచయమే. లోపల్నుంచి ఏదో అపరిచిత కంఠం కూడా వినిపిస్తోంది. హాల్లోకి ప్రవేశించాను. రంగనాథం ఎదురుగా కూర్చున్నది ఎవరో కాదు. సరోజ ఆంటీ వాళ్లబ్బాయి రఘు. మంచి రంగు తేలాడు. బాగా ఒళ్లు చేశాడు. ‘‘హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు?’ నన్ను చూసి కుశల ప్రశ్నలు వేశాడు. నేను చిరునవ్వుతో తలపంకించాను. ‘‘ఎందుకంకుల్ ఎంత ఖరీదైనా నేనే కొంటాను ఇంటిని వేరే ఎవరికీ అమ్మవద్దని అంతలా ఒత్తిడి చేస్తున్నాడు ఆ శ్రీరామ్. ఇంతకీ ఎవరంకుల్ ఆయన’’రఘు ప్రశ్నిస్తున్నాడు రంగనాథం అంకుల్ని.రఘు అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో తమ ఇంటిని వేలానికి పెట్టాడని ఇటీవలే తెలిసింది. ఆ విషయంగా బేరం ఫైనల్ చేసుకోవడానికి వచ్చాడట.‘‘శ్రీరామ్ ఎవరో తెలీదా నీకు?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా.తెలీదన్నట్టు తలూపాడు రఘు.‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా. మళ్లీ తెలీదన్నట్టు తలూపాడు రఘు.
‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా నీకు’’ మరోసారి ప్రశ్నించారు రంగనాథం అంకుల్.రఘు తెల్లమొహం వేశాడు.నేను ఆసక్తిగా వింటుండిపోయాను. హాల్‌లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పేజీలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాసేపట్లో ఒక బ్రహ్మాండమైన నిజం బద్దలవుతుందని నాకా క్షణంలో తెలియదు. ఈ నిజాన్ని రంగనాథం అంకుల్ ఇన్నాళ్లూ కాపాడాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు రంగనాథం అంకుల్.‘‘ఆ శ్రీరామ్ ఒక అనాథ. మీ అమ్మగారి సాయంతో ఈవేళ ఒక మంచి స్థితికి చేరుకున్నాడు. మీ ఇంటి దగ్గర అనాథాశ్రమంలో ఒక విద్యార్థి వాడు. వాడికి తెలుసు మీ అమ్మగారి చివరి కోరిక. అందుకే వాడు ఆ ఇంటిని తానే కొనాలని పట్టుదలగా ఉన్నాడు. ఆశ్రమంవారు వాడిని ఇంటర్ వరకు చదివించి, ఆపై చదివించలేమని చేతులెత్తేశారు. అప్పుడు మీ అమ్మగారు పూనుకొని వాణ్ణి ఇంజనీరింగ్ చదివేలా ప్రోత్సహించింది. ఆపై ఎంబీఏ చదివించింది. వాడూ సలక్షణంగా చదువుకుని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెళ్లి చూడు. వాడి ప్రతి కంపెనీ పేరూ ‘సరోజా ఇండస్ట్రీస్’ అనే ఉంటుంది. వాడు మీఅమ్మని మరువలేదు. ఆవిడ చివరి కోరికనీమరువలేదు.‘‘ఏంటంకుల్ ఆ చివరి కోరిక’’ అడిగాడు రఘు.‘‘తన తదనంతరం ఇంటిని అనాథాశ్రమంగా మార్చాలన్నది ఆవిడి కోరిక. రఘూ! నీకొక నిజం చెప్పాలి. సరోజ ఆంటీ నీ సొంత తల్లి కాదు. నువ్వొక అనాథవి. పెంటకుప్ప దగ్గర పసిగుడ్డుగా పొత్తిళ్లలో కనిపిస్తే ఆ మహాతల్లి తీసుకువచ్చి నిన్ను పెంచింది. కానీ నీకెన్నడూ ఆ భావన రాకుండా పెంచింది. నీ జీవితం ఆవిడ ఇచ్చిన దానం. ఆ మహాతల్లే కనుక చేరదీయకపోతే నువ్వు ఆ క్షణమే నేలరాలిపోయేవాడివి. నీ జీవితమంతా సుఖంగా ఉండటానికి కాలేజీ వాళ్లు నిన్న పెట్టిన కష్టమే పెద్ద కష్టమని అంటున్నావు. ఆ చదువే లేకుంటే నీ జీవితం ఏమయ్యేదో ఊహించుకో. అమ్మ ఏది చేసినా నీ మంచికే అనే జ్ఞానం నీకు లోపించడం వల్ల నీలో ఈ విపరీత ధోరణి కలుగుతోంది’’ఎంతగా దాచాలనుకుంటున్నా రఘు తన కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీటిని దాచలేకపోతున్నాడు.‘‘సరోజ అనాథ వసతి గృహం’’ఆ ఇంటిని అమ్మకుండానే తల్లి చివరి కోరిక తీర్చాడు రఘు. ఆ ఇంట్లోనే అనాథ వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు.
- రాయపెద్ది వివేకానంద్
చివరి కోరిక
Published Sun, Nov 4 2018 1:57 AM | Last Updated on Sun, Nov 4 2018 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment